
నటుడు ప్రియదర్శి, నిహారిక ఎన్ఎం హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా మిత్రమండలి. అక్టోబర్ 16న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. డైరెక్టర్ విజయేందర్ దర్శకత్వం వహించారు.

ఇందులో బ్రహ్మానందం, వెన్నెల కిసోర్, సత్య, విష్ణు, రాగ్ మయూర్ కీలకపాత్రలు పోషించగా.. విడుదలకు ముందే టీజర్, ట్రైలర్ ద్వారా మంచి హైప్ క్రియేట్ చేశారు. ఈ చిత్రాన్ని సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి.

ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది. నవంబర్ 6న ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కేవలం 20 రోజుల్లోనే ఓటీటీలోకి రానుంది.

ఈ సినిమాలో జంగ్లీపట్నానికి చెందిన నారాయణ (వీటీవీ గణేష్)కు కులపిచ్చి. తన తుట్టె కులానికి చెందినవాళ్లు ఇతర కులాలకు చెందినవారిని పెళ్లి చేసుకుంటే వారిని చంపే రకం. అతడి కూతురు స్వేచ్ఛ (నిహారిక ఎన్ఎమ్).

అతడికి ఎమ్మెల్యే టికెట్ వచ్చే సమయంలో కూతురు ఇంట్లో నుంచి పారిపోతుంది. ఆమె పారిపోవడానికి కారణం ఊర్లోని నలుగురు కుర్రాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే స్వేచ్ఛ పారిపోవడానికి గల కారణం ఏంటీ అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.