
అసలంటూ అనుమానం రాకూడదు. ఒక్కసారి వచ్చిందో, పోగొట్టడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం కనిపించదు. ఇప్పుడు సలార్ విషయంలో జరుగుతున్నది అదే. కన్నడ ఉగ్రమ్ సినిమాకూ, తెలుగు సలార్‌కీ ఉన్న సంబందం ఏంటి? సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్న పోలికలేంటి? చూసేద్దాం రండి...

దూరంగా ఉండే ప్రాంతంలో విడదీయలేని స్నేహం ఉండేది అంటూ మొదలవుతుంది సలార్ ట్రైలర్. ఇద్దరు స్నేహితుల కథ సలార్‌కి ప్రాణం. శ్రీమురళి హీరోగా ప్రశాంత్ నీల్ డైరక్ట్ చేసిన ఉగ్రమ్ సినిమాలోనూ అదే విషయం కీలకం.

ఇద్దరు బాల్య స్నేహితులను అందంగా చూపించారు ఈ సినిమాలో. ఇప్పుడు సలార్‌లోనూ అదే విషయం అద్భుతంగా వైరల్ అవుతోంది. ఉగ్రమ్ కన్నా ముందే ప్రశాంత్ నీల్ సలార్ కథ రాసుకున్నానని అన్నారు.

114 రోజుల్లో ఈ సినిమాను కంప్లీట్ చేశామని అన్నారు. హైదరాబాద్, సింగరేణి, సౌత్ పోర్ట్స్ లో సినిమాను కంప్లీట్ చేశారట. అయితే ఈ సినిమా టింజ్ ప్రశాంత్ నీల్ యూనివర్శ్‌లో కనిపించినా, కంటెంట్ మాత్రం అడుగడుగునా ఉగ్రమ్‌ని గుర్తుచేస్తోందని అంటున్నారు నెటిజన్లు.

ఉగ్రమ్ సినిమాలో శ్రీమురళి ఎడమ చేతికి సింహం గుర్తు ఉండటం, సలార్‌లో ప్రభాస్ ఎడమచేతికి టాటూ ఉండటం, ఉగ్రమ్‌లో శ్రీమురళి చాలా వరకు శాంతంగా ఉండటం, ఇక్కడ ప్రభాస్ అలాగే కనిపించడం.. ఇలాంటి పోలికలు వెతుకుతున్నారు ఆడియన్స్.

నా కళ్ల ముందున్నదంతా నాకు కావాలి అని సలార్‌లో పృథ్విరాజ్ చెప్పే మాటలకు కూడా ఉగ్రమ్‌తో పోలికలున్నాయన్నది వైరల్ అవుతున్న న్యూస్. డిసెంబర్ 22న సలార్ విడుదలైతేగానీ, ఈ మాటల్లో నిజమెంత అనేది అంతుబట్టదు. అప్పటిదాకా ఇది రీమేకా? కాదా? అనే మాటలు మాత్రం తప్పవు.