
సినిమా ఇండస్ట్రీలో కొన్ని సినిమలా గురించి మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడల్లా ఎన్నికల తర్వాత... ఎన్నికల తర్వాత.. అనే మాట పదే పదే వినిపించేది. ఎన్నికల తర్వాత నందమూరి బాలకృష్ణ సినిమాల్లో కదలిక కనిపిస్తోంది. మరి పవన్ కల్యాణ్ సినిమాల సంగతులేంటి? ఒకటికి రెండు సినిమాలు ఈ ఏడాది రిలీజ్‌కి రెడీ అవుతాయని మాటిచ్చారు. ఆ మాట నిలబెట్టుకుంటారా?

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించే అఖండ సినిమా షూటింగ్ వచ్చే నెల నుంచి మొదలవుతుంది. ఎవరూ ఊహించనంత బడ్జెట్‌తో సినిమా ఉంటుంది అంటూ వార్తలు తెగ ఊరిస్తున్నాయి. మొన్న మొన్నటిదాకా ఏపీ రాజకీయాలతో క్షణం తీరిక లేకుండా గడిపిన నందమూరి బాలకృష్ణ ఇప్పుడు మళ్లీ సినిమాల స్పీడు పెంచుతున్నారు. మరి పవన్ కల్యాణ్ మాటేంటి?

జనసేనాని పవన్ కల్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమాను సెప్టెంబర్‌లో విడుదల చేస్తారన్నది మేకర్స్ నుంచి వచ్చిన మాట. చాలా వరకు షూటింగ్ పూర్తయినా, హీరో మీద చిత్రీకరించాల్సిన సన్నివేశాలు కొన్ని మిగిలే ఉన్నాయట. ఇప్పుడు పవన్ కల్యాణ్ మళ్లీ మేకప్ వేసుకుంటే ముందు వాటిని చిత్రీకరించాలి. ఆ తర్వాత సీజీ పూర్తి చేయాలి. అప్పుడే డేట్ ఫైనల్ అయ్యేది.

ఆగస్టులో రిలీజ్ అయ్యే పుష్ప2, అక్టోబర్‌లో రిలీజ్ కావాల్సిన దేవర కూడా ఏదో విధంగా వార్తల్లో ఉంటూ ప్రమోషన్ల స్పీడు పెంచుతున్నాయి. అలాంటప్పుడు ఓజీ ప్రమోషన్లు స్టార్ట్ అయ్యేదెప్పుడు అనే ఎదురుచూపులు కనిపిస్తున్నాయి పవర్‌స్టార్ ఫ్యాన్స్ లో. పనిలో పనిగా హరిహరవీరమల్లు గురించి కూడా ఆరా తీస్తున్నారు అభిమానులు.

ఈ ఏడాదే హరిహరవీరమల్లుని విడుదల చేస్తామని ప్రకటించారు మేకర్స్. కొత్త డైరక్టర్ నేతృత్వంలో సెట్లో షూటింగ్‌కి హాజరు కావాలి పవన్ కల్యాణ్. ఏపీ ఎన్నికల ఫలితాలను బట్టి, ఆయన నెక్స్ట్ స్టెప్ ఉంటుంది. ఆ మేరకు ముందు ఓజీకి కాల్షీట్ కేటాయిస్తారు. ఆ తర్వాతే హరిహరవీరమల్లు సంగతి... సో ఈ ఏడాది పవర్‌స్టార్ నుంచి రెండు సినిమాల రిలీజులు ఉంటాయా? ఉండవా? అన్నది తేలాలంటే, ముందు ఎన్నికల ఫలితాలు వెల్లడి కావాల్సిందే. దాన్ని బట్టే పవన్ ప్లానింగ్ ఉంటుందని అంటున్నారు క్రిటిక్స్.