
సీనియర్ సంగీత దర్శకులకు అవకాశాలు రావడం అంటే అంత చిన్న విషయం కాదు. అందులోనూ ఇప్పుడున్న పోటీలో ఒకప్పటి మ్యూజిక్ డైరెక్టర్స్ అంతా సైలెంట్ అయిపోయారు. అడపా దడపా తప్పితే వాళ్ల పాటలు కూడా వినిపించడం లేదు. కానీ కీరవాణిని చూస్తుంటే ఇది తప్పనిపిస్తుంది.. ఆయన టైమ్ మళ్లీ స్టార్ట్ అయిందనిపిస్తుంది. అసలు ఈ కీరవాణి చేస్తున్న మ్యాజిక్ ఏంటి..?

టాలీవుడ్ మ్యూజిక్ అంతా ఇప్పుడు దేవీ, థమన్ చుట్టూ తిరుగుతుంది. వాళ్లు వదిలేస్తే మిగిలిన వాళ్లకు ఆఫర్స్ వెళ్తున్నాయేమో అనిపిస్తుంది. ఇంత పోటీలోనూ కీరవాణి సమ్‌థింగ్ స్పెషల్ అనిపిస్తున్నారు. ఈ సీనియర్ సంగీత దర్శకుడి కోసం దర్శకులే కాదు హీరోలు ఎగబడుతున్నారు. ముఖ్యంగా సీనియర్ హీరోలంతా కీరవాణి వైపు చూస్తున్నారు.. ఆయనే కావాలంటున్నారు.

రాజమౌళి సినిమాలకు ఎలాగూ కీరవాణి ఫిక్స్. అందులో పాటలు ఎలా ఉన్నా.. ఆర్ఆర్ మాత్రం అదిరిపోతుంది. కేవలం తన బ్యాగ్రౌండ్ స్కోర్‌తోనే సినిమా స్థాయి పెంచేస్తుంటారు కీరవాణి.

అందుకే ఎంత పెద్ద సినిమా తీసినా.. జక్కన్న మరో మ్యూజిక్ డైరెక్టర్ వైపు చూడరు రాజమౌళి. ఇక సోషియో ఫాంటసీలకు కీరవాణిని మించిన ఆప్షన్ లేదు. తాజాగా హరిహర వీరమల్లుతో పాటు వశిష్ట, చిరంజీవి సినిమాకు ఈయనే సంగీత దర్శకుడు.

దాదాపు 30 ఏళ్ళ తర్వాత చిరంజీవి సినిమాకు సంగీతం అందిస్తున్నారు కీరవాణి. పవన్, చిరు, మహేష్ తర్వాత.. నాగార్జున నా సామిరంగాకు కూడా కీరవాణే సంగీతం అందిస్తున్నారు. వారసుడు, ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, అల్లరి అల్లుడు, ఘరానా బుల్లోడు లాంటి ఛార్ట్‌బస్టర్స్ ఈ కాంబోలో వచ్చాయి. మొత్తానికి ఇంత పోటీలోనూ తర్వాత కూడా కీరవాణి తన మార్క్ చూపిస్తూనే ఉన్నారు.