
రూల్ చేయడమంటూ మొదలుపెడితే.. మాకంటే బాగా ఎవరూ రూల్ చేయలేరు అంటున్నారు మన దర్శకులు. భాషతో పనిలేదు.. ఇండియన్ సినిమాను నడిపిస్తున్నది మాత్రం దక్షిణాది దర్శకులే.

అది పుష్పతో సుకుమార్ కావచ్చు.. యానిమల్‌తో సందీప్ వంగా అవ్వచ్చు.. పునాదులు వేసిన రాజమౌళి అయినా అవ్వచ్చు.. అందరూ మన దర్శకులే. బాలీవుడ్‌లో మేం సౌత్ నుంచి వచ్చామంటే చాలు ఆ దర్శకులకు రెడ్ కార్పెట్ పరిచేస్తున్నారు.

అందుకే ఫ్లాపుల్లో ఉన్నా కూడా.. సౌత్ డైరెక్టర్ అనే బ్రాండ్‌తోనే మురుగదాస్‌కు ఛాన్సిచ్చారు సల్మాన్ ఖాన్. ఇక వరుణ్ ధావన్ బేబీ జాన్‌కు కర్త కర్మ క్రియ అంతా అట్లీనే. జవాన్‌తో ఈయన బాలీవుడ్‌ను షేక్ చేసారు.

ఇక రన్బీర్ కపూర్ హీరోగా రూపొందిన యానిమల్‌తో బాలీవుడ్‌కు కొత్త పాత్ చూపించారు సందీప్ రెడ్డి వంగా. పుష్ప 2 టేకింగ్, మేకింగ్ చూసాక.. సుకుమార్‌కు దండేసి దండం పెడుతున్నారు నార్త్ ఆడియన్స్. నువ్విక్కడే ఉండిపో సామీ అంటూ పూజలు చేస్తున్నారు.

ఇక కేజియఫ్, సలార్‌తో ప్రశాంత్ నీల్.. బాహుబలి సిరీస్‌తో జక్కన్న ఇప్పటికే బాలీవుడ్‌లో జెండా పాతేసారు. జాట్‌తో గోపీచంద్ మలినేని అదే చేయాలని చూస్తున్నారు. మొత్తానికి ఇండియన్ సినిమాను ఇక్కడ్నుంచే రూల్ చేస్తున్నారు సౌత్ దర్శకులు.