
వరుణ్ తేజ్ పెళ్లి కోసం మెగా హీరోలంతా బ్రేక్ తీసుకోవడంతో ఇండస్ట్రీలో షూటింగ్స్ హడావిడి సగానికి సగం తగ్గిపోయింది.. మరో వారం వరకు మెగా హీరోలెవరూ ఇండియాకు రాకపోవచ్చు. అలాగే బాలయ్య, రవితేజ కూడా ఇంకా కొత్త సినిమా షూటింగ్ మొదలు పెట్టలేదు.. వీళ్లు మినహా హీరోలందరూ లొకేషన్‌లోనే ఉన్నారు. మరి ఆ డీటైల్స్ చూద్దామా..?

నవంబర్ 1న వరుణ్ తేజ్ పెళ్లి ఇటలీలో జరగబోతుంది. దీనికోసం పవన్ కళ్యాణ్ సహా మెగా హీరోలంతా అక్కడికి వెళ్లారు. దాంతో మెగా షూటింగ్స్‌కు వారం రోజులు బ్రేక్ పడనుంది.

మరోవైపు ప్రభాస్ ఇండియాలో లేకపోయినా ఆయన షూటింగ్స్ మాత్రం ఆగట్లేదు. కల్కి షూటింగ్ శంకరపల్లిలో జరుగుతుంది. సలార్ ప్యాచ్ వర్క్స్ కూడా నాన్‌స్టాప్‌గా జరుగుతూనే ఉన్నాయి.

షూటింగ్ మొదలుపెట్టిన తర్వాత ఫస్ట్ టైమ్ హైదరాబాద్ దాటి బయటికి వెళ్లారు దేవర టీం. జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ సహా కీ మెంబర్స్ అంతా గోవాకు వెళ్లారు. అక్కడ లేటెస్ట్ షెడ్యూల్ జరుగుతుంది. గోవా తర్వాత గోకర్ణకు వెళ్లనుంది దేవర టీం. మహేష్ బాబు, త్రివిక్రమ్ గుంటూరు కారం షూటింగ్‌కు చిన్న బ్రేక్ ఇచ్చారు.

నాగార్జున నా సామిరంగా షూటింగ్ అజీజ్ నగర్ చిత్రమందిర్‌లో జరుగుతుంది. విజయ్ దేవరకొండ, పరశురామ్ ఫ్యామిలీ స్టార్ షూటింగ్ వాయుపురీ కాలనీలో జరుగుతుండగా.. నితిన్, వక్కంతం వంశీ ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. గోపిచంద్, కన్నడ దర్శకుడు హర్ష కాంబినేషన్‌లో వస్తున్న భీమా సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది.