
తన నట విశ్వరూపంతో దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న కమల్ హాసన్ నవంబర్ 7, 1954లో జన్మించారు. ఆరేళ్ల వయసులో 'కలాథూర్ కన్నమ్మ' అనే సినిమా తర్వాత బాల నటుడిగా కెరీర్ మొదలు పెట్టారు.

బాల నటుడిగా కొన్ని సినిమాల్లో నటించిన తర్వాత కమల్.. కొన్ని రోజుల పాటు తన చదువును కొనసాగించారు. అనంతరం 1971లో కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. 'అన్నై వెలంకని', 'కాశీ యాత్ర' సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా పని చేశారు.

కమల్ హాసన్ తన అద్భుత నటనకుగాను 19 ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో పాటు 4 నేషనల్ అవార్డులను అందుకున్నారు. 1990లో పద్మశ్రీ, 2014లో పద్మభూషన్ వంటి ఎన్నో గొప్ప అవార్డులను సొంతం చేసుకున్నారు.

కమల్ కేవలం సినిమాలకే పరిమితం కాకుండా సేవ కార్యక్రమాలతోనూ తన మంచి మనసును చాటుకున్నారు. కమల్ వెల్ఫేర్ అసోసియేషన్ పేరుతో కమల్ అభిమానులు పెద్ద ఎత్తున ఐ డొనేషన్ డ్రైవ్‌తో పాటు విద్యార్థులకు ఉచితంగా పుస్తకాల పంపిణీ, రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు.

ఇక సినిమాల్లో తనదైన ముద్ర వేసిన కమల్ హాసన్ రాజకీయాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. మక్కల్ నీధి మయం పేరుతో 2018లో ఓ పార్టీని ఏర్పాటు చేశారు. అయితే విజయాన్ని మాత్రం అందుకోలేక పోయారు.