
అతిలోక సుందరి దివంగత హీరోయిన్ శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది జాన్వీ కపూర్. దఢక్ సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ.. ఫస్ట్ మూవీతోనే నటనపరంగా మెప్పించింది.

ఇండస్ట్రీలో విభిన్న కథాంశం చిత్రాలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. గ్లామర్ పాత్రలు కాకుండా కంటెంట్ ప్రాధాన్యత.. హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలను చేస్తూ అగ్రకథానాయికగా దూసుకుపోతుంది.

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న దేవర సినిమాలో జాన్వీ నటిస్తోంది. ఈ మూవీతో తెలుగు తెరకు పరిచయం కాబోతుంది అతిలోక సుందరి తనయ.

అయితే చాలా సందర్భాల్లో ఎన్టీఆర్ పై తనకున్న అభిమానాన్ని బయటపెట్టింది జాన్వీ. తాజాగా మరోసారి దేవర సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది.

ఎన్టీఆర్ తో కలిసి నటించాలని చాలా కాలం ఎదురుచూశానని... దేవర సినిమా ప్రకటించిన తర్వాత తనను హీరోయిన్ గా తీసుకుంటే బాగుండని అనుకున్నానని.. ఏడాదిపాటు ఇదే కోరుకున్నానని తెలిపింది.

చివరకు తన కోరిక నెరవేరిందని.. ఇప్పుడు ఎన్టీఆర్ తో కలిసి షూటింగ్ లో పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. అలాగే తనకు హృతిక్, రణ్వీర్ సింగ్, టైగర్ ష్రాఫ్ లతో కలిసి నటించాలని ఉందని తెలిపింది.

అంతేకాకుండా సంజయ్ లీలా భన్సాలీ, కరణ్ జోహర్ లో దర్శకత్వంలో నటించాలని ఉందని తన మనసులోని కోరికను బయటపెట్టింది. ప్రస్తుతం జాన్వీ నటిస్తోన్న దేవర చిత్రం ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది.