
శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో... అంటూ నాయక్ సినిమాలో రామ్‌చరణ్‌తో ఆడిపాడిన అమలాపాల్ గుర్తున్నారా? తెలుగులో అంతకు ముందు.. ఆ తర్వాత కూడా పలు సినిమాలు చేశారు అమలాపాల్.

త్వరలోనే పెళ్లికూతురుగా పెళ్లి పీటల మీదకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. ఆమె చిరకాల స్నేహితుడు జగత్ దేశాయ్‌కి యస్ చెప్పారు అమలాపాల్. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టా ద్వారా జనాలతో పంచుకున్నారు.

స్టైలిష్ వేలో ఈ వేడుక జరిగింది. మై జిప్సీ క్వీన్ సెడ్ యస్ అంటూ అమలాపాల్‌ని వివాహం చేసుకోబోతున్న విషయాన్ని ఓపెన్‌గా ప్రకటించేశారు ఆమె చిరకాల మిత్రుడు జగత్ దేశాయ్.

పెద్ద హోటల్‌లో లైట్లను, సూర్య కాంతిని చూపిస్తూ తమ ప్రేమ వీడియో తీశారు జగత్. చుట్టూ డ్యాన్సర్లతో, ఇష్టంగా స్టెప్పులు వేస్తూ, అమలాపాల్ ముందు మోకాళ్ల మీద కూర్చుని స్టైలిష్‌గా ప్రపోజ్ చేశారు జగత్ దేశాయ్.

ఆమె వేలికి ఉంగరం తొడిగి నిశ్చితార్థ వేడుకను చేసుకున్నారు. జగత్ ప్రపోజ్ చేసిన తీరుకు అమలాపాల్ ఫిదా అయ్యారు. అమలాపాల్ మాతృభాష మలయాళం అయినప్పటికీ, తెలుగు, తమిళ్‌లో చాలా సినిమాల్లో నటించారు.

తమిళంలో విక్రమ్ సరసన దైవ తిరుమగల్ చేస్తున్న సమయంలో ఆమెకు దర్శకుడు ఎ.ఎల్.విజయ్‌తో చనువు పెరిగింది. అది ప్రేమగా మారడంతో 2014లో ఇద్దరికీ వివాహం జరిగింది. అయితే మనస్పర్థలు రావడంతో 2016లో విడిపోయారు. 2017లో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఎ.ఎల్.విజయ్ ఇంకో పెళ్లి చేసుకున్నారు.

ఆయనకు కూతురు పుట్టినప్పుడు కూడా అమలాపాల్ విషెస్ పంపారు. అమలాపాల్ పెళ్లికి సంబంధించి కూడా చాలా విషయాలు వైరల్ అయ్యాయి. ఆమె ఓ సింగర్‌ని పెళ్లిచేసుకుంటారంటూ కూడా వార్తలొచ్చాయి. అయితే జగత్ షేర్ చేసిన వీడియోతో వాటన్నిటికీ ఫుల్‌స్టాప్ పెట్టినట్టు అయింది.

ప్రస్తుతం అమలాపాల్ ప్రొఫెషనల్‌గానూ బిజీగా ఉన్నారు. ఆమె ఇటీవల అజయ్ దేవ్‌గన్‌తో భోళాలో నటించారు. ప్రస్తుతం పృథ్విరాజ్ సుకుమారన్‌తో కలిసి ఆడుజీవితంలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.