
బేసిక్‌గా ఇలాంటి ఓ పీరియాడిక్ వార్ డ్రామా చేయాలంటే ఏ దర్శకుడైనా కనీసం ఏడాది రెండేళ్లు తీసుకుంటారు. కానీ క్రిష్ మాత్రం బాలకృష్ణ ప్రధాన పాత్రలో గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి సినిమాను కేవలం 78 రోజుల్లో తీసారు.

అంతేకాదు.. ఎన్టీఆర్ బయోపిక్ కూడా 89 రోజుల్లోనే పూర్తి చేసారు. పైగా అది కూడా రెండు భాగాలు.. ఫలితం ఎలా ఉన్నా.. ఆ సినిమాను చాలా వేగంగా పూర్తి చేసారు క్రిష్. కెరీర్‌లో ఏ సినిమాకు ఆర్నెళ్లకు మించి తీసుకోలేదీయన.

ఎలాంటి సినిమా అయినా నెలల్లోనే పూర్తి చేసే క్రిష్‌ను హరిహర వీరమల్లు సందిగ్దంలో పడేసింది. ఈ సినిమా మొదలై మూడేళ్లు దాటినా ఇప్పటి వరకు కనీసం సగం షూటింగ్ పూర్తి కాలేదు. పీరియాడిక్ డ్రామా కావడంతో.. పవన్ గెటప్ కూడా మార్చాల్సి ఉంటుంది. ఇతర సినిమాలతో పాటు పొలిటికల్ బిజీ కారణంగా వీరమల్లుకు డేట్స్ ఇవ్వలేకపోతున్నారు పవన్. అందుకే ముందుకు కదలట్లేదు ఈ ప్రాజెక్ట్.

పవన్‌ను నమ్ముకుంటే తన సినిమా పూర్తి అవడం కష్టమనే.. కరోనా టైమ్‌లో 40 రోజుల్లోనే వైష్ణవ్ తేజ్‌తో కొండపొలం చేసారు క్రిష్. ఇప్పుడూ ఇదే చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.

అనుష్క శెట్టితో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా ప్లాన్ చేస్తున్నారు. గతంలో ఇదే కాంబినేషన్‌లో వచ్చిన వేదంకు ప్రశంసల వర్షం కురిసింది. తాజాగా జేజమ్మతో మరో సినిమా చేయబోతున్నారు క్రిష్. దీని తర్వాతే హరిహర వీరమల్లు మళ్లీ సెట్స్‌పైకి రానుంది.