
తొలిసారిగా ఓ ట్రాన్స్‌జెండర్ మోడల్ మిస్ నెదర్లాండ్స్ టైటిల్‌ను గెలుచుకుంది. జూలై 8న ల్యూస్డెన్‌లో జరిగిన అందగత్తెల కాంపిటీషన్‌లో బ్రెడాకు చెందిన ట్రాన్స్‌జెండర్ మహిళ రిక్కీ వలేరి కొల్లే (22) ఏళ్ల మిస్ నెదర్లాండ్స్-2023 కిరీటాన్ని పొందారు.

ప్రముఖ నటి, మోడల్ అయిన 22 ఏళ్ల రిక్కీ వాలెరీ కొల్లె అందాల పోటీలో కిరీటం సాధించి చరిత్ర సృష్టించింది. నెదర్లాండ్‌లో ఓ ట్రాన్స్‌జెండర్ మిస్ నెదర్లాండ్స్ కిరీటాన్ని దక్కించుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం.

మిస్ నెదర్లాండ్స్ టైటిల్ సాధించడం గర్వంగా ఉందంటూ ఆమె ఆనందం వ్యక్తం చేసింది. 'అవును, నేను ట్రాన్స్. నా జీవితంలో ప్రతి క్షణాన్ని ఆస్వాధిస్తున్నాను. ట్రాన్స్ కమ్యూనిటీకి ఆదర్శం కావాలన్నదే నా లక్ష్యమని' రిక్కీ పేర్కొంది.

అమెరికాకు చెందిన మిస్ యూనివర్స్ ఆర్'బోనీ గాబ్రియెల్ కూడా ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. అందాల పోటీకి సంబంధించిన జ్యూరీ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో రిక్కీ ఫొటోను పోస్ట్ చేసింది.

రిక్కీతో కలిసి పనిచేయడం సంస్థ ఆనందిస్తుందని జ్యూరీ పేర్కొంది. కాగా ఈ ఏడాది ఎల్‌సాల్వేడార్‌లో జరుగనున్న మిస్ యూనివర్స్ పోటీల్లో రిక్కీ నెదర్లాండ్స్‌కు ప్రాతినిధ్యం వహించనుంది.