
ఈ రోజుల్లో ఓ మంచి రిలీజ్ డేట్ దొరకడం మామూలు విషయం కాదు.. దానికోసం పూజలు చేస్తుంటారు దర్శక నిర్మాతలు. ఇప్పుడలాంటి ఓ మేజర్ డేట్ కోసం పెద్ద యుద్ధమే చేస్తున్నారు మన హీరోలు. అదే ఆగస్ట్ 15. పుష్ప 2 వదిలేసిన ఈ డేట్‌పై చాలా మంది కళ్లు పడ్డాయి. పంద్రాగస్ట్ కోసం పెద్ద వార్ నడుస్తుంది. మరి ఆ రోజు రాబోతున్న సినిమాలేంటో చూద్దామా..?

ఆగస్ట్ 15న పుష్ప 2 వస్తుందని ఏడాది ముందే ఖరారు చేసారు దర్శక నిర్మాతలు. కానీ చివరి నిమిషంలో అది వాయిదా పడటంతో.. ఆ డేట్ కోసం పెద్ద యుద్ధమే చేస్తున్నారు మిగిలిన వాళ్లు. ఈ రేసులో అందరికంటే ముందే ఉన్నారు రామ్. ఆయన నటిస్తున్న డబుల్ ఇస్మార్ట్ పంద్రాగస్ట్ రోజే రానుంది. పూరీ జగన్నాథ్ ఈ సినిమాకు దర్శకుడు.

లైగర్ ఫ్లాప్ తర్వాత పూరీ తెరకెక్కిస్తున్న సినిమా అయినా కూడా.. డబుల్ ఇస్మార్ట్‌పై అంచనాలు బాగానే ఉన్నాయి. దానికి కారణం అది ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ కావడమే. మరోవైపు గీతా ఆర్ట్స్ 2 నుంచి వస్తున్న ఆయ్ కూడా అదే రోజు వస్తుంది. నార్నె నితిన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం పూర్తిగా కామెడీ ఎంటర్‌టైనర్. టీజర్స్, పాటలకు మంచి హైప్ రావడంతో.. సినిమాపై నమ్మకంగానే ఉన్నారు మేకర్స్.

ఆగస్ట్ 15 రోజే రానున్న మరో సినిమా 35.. ఒక చిన్న కథ. రానా దగ్గుబాటి సమర్పిస్తున్న ఈ చిత్రంలో నివేదా థామస్, ప్రియదర్శి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. క్యూట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తుంది 35 సినిమా. ఈ మధ్యే ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేసారు మేకర్స్.

ఎన్ని రోజులైనా పర్లేదు.. ఎంత లేటైనా పర్లేదు అనుకున్నది వచ్చేవరకు తగ్గేదే లే అన్నట్లు ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం క్లైమాక్స్ షూట్ జరుగుతుంది. ఇక వాయిదాలేం లేవు.. డిసెంబర్ 6న కుమ్మేద్దాం అంటున్నారు పుష్ప 2 టీం.