
ఈ సారి దసరా పండక్కి సందడంతా డబ్బింగ్ సినిమాలదే అన్నట్టుగా ఉంది. స్ట్రయిట్ తెలుగు సినిమాలు కూడా బరిలో ఉన్నా... పరభాష సినిమాలే ప్రమోషన్‌లో దూసుకుపోతున్నాయి. తాజాగా అలియా భట్ జిగ్రా కూడా దసరా బరిలో దిగుతుండటంతో పోటిమరింత రసవత్తరంగా మారింది.

ఈ దసరకు బాక్సాఫీస్ దగ్గర ఇంట్రస్టింగ్ సినిమాలు తలపడుతున్నాయి. తెలుగులో మీడియం రేంజ్ సినిమాలే బరిలో ఉన్నా... ఇతర భాషల నుంచి మాత్రం ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్స్ పోటి పడుతున్నాయి. ముఖ్యంగా సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన వేట్టయాన్ రిలీజ్ అవుతుండటంతో పోటి మరింత ఇంట్రస్టింగ్‌గా మారింది.

తాజాగా అలియా భట్ కూడా జిగ్రా మూవీతో దసరా సీజన్‌లో తెలుగు మార్కెట్ మీద దృష్టి పెట్టారు. కన్నడ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన మార్టిన్ ఏకంగా పదకొండు భాషల్లో రిలీజ్ అవుతోంది. ఈ సినిమా కేజీఎఫ్ మ్యాజిక్‌ను రిపీట్ చేస్తుందన్న ఆశతో ఉన్నారు మేకర్స్.

తెలుగు నుంచి గోపిచంద్ హీరోగా తెరకెక్కిన విశ్వం మీదే కాస్త బజ్ ఉంది. శ్రీనువైట్ల డైరెక్ట్ చేసిన ఈ సినిమా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో ఎలాగైన హిట్ కొట్టి మళ్లీ ఫామ్ లోకి రావాలని కష్టపడుతున్నారు హీరో గోపిచంద్, దర్శకుడు శ్రీనువైట్ల.

సుదీర్ బాబు హీరోగా తెరకెక్కిన మా నాన్న సూపర్ హీరో, సుహాస్ లీడ్ రోల్‌లో రూపొందిన జనక అయితే గనక సినిమాలు కూడా దసరా సీజన్‌లోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అయితే స్టార్ ఇమేజ్ పరంగా డబ్బింగ్ సినిమాలకే ఎక్కువ థియేటర్లు దక్కే ఛాన్స్ ఉందంటున్నారు విశ్లేషకులు.