
భారతీయ చలన చిత్రపరిశ్రమలో అలనాటి అందాల తార దివంగత హీరోయిన్ శ్రీదేవికు ప్రత్యేక గుర్తింపు ఉంది. తెలుగు, తమిళ్, కన్నడ,హిందీ భాషలలో ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించారు. బాలనటిగా తెరంగేట్రం చేసిన శ్రీదేవి.. కథానాయికగా ఎన్నో చిత్రాల్లో నటించారు. ఈరోజు (ఆగస్ట్ 13న) శ్రీదేవి పుట్టినరోజు.

ఈ సందర్భంగా ఆమె కుటుంబసభ్యులు... బంధువులు... సినీ ప్రముఖులు శ్రీదేవితో ఉన్న అనుబంధాన్ని, జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే శ్రీదేవికి సౌత్ ఇండస్ట్రీ హీరోతో ఉన్న స్నేహం గురించి నెటిజన్స్ ఆరా తీస్తున్నారు.

ఆ స్టార్ హీరో కోసం ఏకంగా7 రోజులు ఉపవాసం ఉన్నారట శ్రీదేవి. ఆయన ఆరోగ్యం కోసం షిరిడి వెళ్లి ప్రార్థించారట. ఇంతకీ ఆ హీరో ఎవరంటే..సూపర్ స్టార్ రజినీకాంత్.. ఇండస్ట్రీలో వీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్.

తలైవా, శ్రీదేవి కాంబోలో దాదాపు 25కు పైగా సినిమాలు వచ్చాయి. ఫరిష్టే, చాల్ బాజ్, భగవాన్ దాదా, జుల్మ్, గైర్ లీగల్ వంటి సినిమాల్లో కలిసి నటించారు. పెళ్లి తర్వాత కూడా శ్రీదేవి, రజినీకాంత్ మధ్య స్నేహం కొనసాగింది.

2011 రజినీ ఆరోగ్యం క్షీణించడంతో చికిత్స కోసం సింగపూర్ తీసుకెళ్లాల్సి వచ్చింది. ఆ విషయం తెలియగానే శ్రీదేవి తీవ్ర మనస్తాపానికి గురైంది. ఆయన ఆరోగ్యం మెరుగుపడేందుకు ఆమె షిర్డీ వెళ్లారు. అక్కడ దాదాపు 7 రోజులు ఉపవాసం ఉన్నారు.

కొద్ది రోజులకు రజినీకాంత్ కోలుకున్నారు. ఆ తర్వాత ఆయన ఇండియాకు తిరిగి వచ్చిన వెంటనే శ్రీదేవి తన భర్త బోణీ కపూర్ తో కలిసి తలైవాను చూసేందుకు వెళ్లారు. రజినీ తిరిగి కోలుకోవడం చూసి ఎంతో సంతోషించారని గతంలో తలైవా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.