
రామ్ చరణ్ కెరీర్‌తో శంకర్ గేమ్స్ ఆడుతున్నారా..? గేమ్ ఛేంజర్ పేరు చెప్పి చరణ్‌తో ఆడుకుంటున్నారా..? లేదంటే నమ్మాడు కదా అని పూర్తిగా లైట్ తీసుకుంటున్నారా..? అదేంటి అంత పెద్ద మాటలనేస్తున్నారు అనుకోవచ్చు.. కానీ శంకర్ తీరు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మరి. ఇండియన్ 2 మొదలయ్యాక శంకర్ తీరు మారిపోయింది.. అదే ఇప్పుడు తలనొప్పులు తెచ్చి పెడుతుంది.

ఇండియన్ సినిమాకు కొత్త దారి చూపించిన దర్శకులలో శంకర్ ముందుంటారు. అయితే కొన్నేళ్లుగా ఈయన టైమ్ బాలేదు. చేసిన సినిమాలేమో హ్యాండిస్తున్నాయి.. మొదలు పెట్టిన సినిమాలేమో ముందుకెళ్లనంటూ మొరాయిస్తున్నాయి. ఓ టైమ్‌లో సినిమాల్లేక ఖాళీగా ఉన్న శంకర్‌కు ఊహించని ఛాన్స్ ఇచ్చింది రామ్ చరణ్. గేమ్ ఛేంజర్ మొదలయ్యాకే.. శంకర్‌కు మళ్లీ గుడ్ టైమ్ మొదలైంది.

అప్పటికే ఇండియన్ 2 ఆగిపోయింది.. ఫ్లాపుల్లో ఉన్నారు కాబట్టి కసిగా ఉంటారు.. ఏడాదిలో సినిమా విడుదల చేస్తాడు చూడు అంటూ శంకర్‌పై చాలా నెమ్మకాలు పెట్టుకున్నారు చరణ్ ఫ్యాన్స్.

కానీ అక్కడున్నది శంకర్.. ఆయన ఏడాదిలో సినిమా చేస్తానంటే నమ్మడం ఫ్యాన్స్ తప్పే అవుతుంది. పైగా ఆగిపోయిన ఇండియన్ 2 తిరిగి మొదలవ్వడంతో.. ప్రస్తుతం గేమ్ ఛేంజర్‌ను పూర్తిగా పక్కనబెట్టేసారు ఈ దర్శకుడు.

సినిమాల్లేనపుడేమో గేమ్ ఛేంజర్‌పైనే ఫోకస్ చేసిన శంకర్.. ఇండియన్ 2 మొదలయ్యాక దాన్ని పక్కనబెట్టడంతో చరణ్ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. పైగా ఇండియన్ 3 కూడా ఉండటంతో.. గేమ్ చేంజర్ ఎప్పుడొస్తుందో అర్థం కావట్లేదు. అందుకే శంకర్ తీరుపై ఫ్యాన్స్ అసహనంగా ఉన్నారు. ప్రస్తుతం ఉన్న తీరు చూస్తుంటే.. 2024 దసరాకు కానీ గేమ్ ఛేంజర్ రావడం కష్టమే. చూడాలిక.. ఏం జరగబోతుందో..?