
బాహుబలి, RRR వంటి సినిమాలతో ఇండియన్ సినిమా రూపు రేఖలు మార్చేసిన దర్శకుడు రాజమౌళి. మన ఇండియన్ సినిమాకు అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకొచ్చిన దర్శక ధీరుడు ఈయన. అలాంటి దర్శకుడు ప్రస్తుతం వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నాడు. ఆయన సినిమాలు, పాత ట్వీట్లు, భవిష్యత్తు ప్రాజెక్టులకు సంబంధించిన అంచనాలు.. ఇవన్నీ కలిసి ఆయనను నిరంతరం చర్చల్లో ఉంచుతున్నాయి.

ఆయన గొప్పదనం ఎంతటిదో.. ఆయన చుట్టూ అల్లుకుంటున్న వివాదాలు కూడా అంతే తీవ్రంగా ఉండడం గమనార్హం. ముఖ్యంగా పౌరాణిక అంశాలను తన కథనాల్లో వక్రీకరిస్తున్నారనే ఆరోపణలు ఆయనపై ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈ అంశాలే ఆయన సినీ ప్రయాణంలో కొత్త చిక్కులను తెచ్చిపెడుతున్నాయా అనే కోణంలో పరిశీలించాల్సిన అవసరం ఉంది. తాజా వివాదాలకు.. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధం ఉంది.

పుష్కరం కిందట ఆయన చేసిన ఒక పాత ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అందులో నాకు రాముడు నచ్చడు.. శ్రీ కృష్ణుడు నాకు ఎక్కువగా నచ్చుతాడు అంటూ ఆయన చేసిన ట్వీట్ దుమారం రేపుతుంది. దీనికి తోడు మొన్న వారణాసి ఈవెంట్‌లో హనుమంతుడిపై ఆయన చేసిన వ్యాఖ్యలపై వానర సేన లాంటి హిందూ సంస్థల నుండి తీవ్ర వ్యతిరేకత వస్తుంది.

పురాణ పాత్రలను, దైవాలను అవమానపరిచే విధంగా రాజమౌళి తరచుగా మాట్లాడుతున్నారని.. ఇది భారతీయ సంస్కృతిని డీగ్రేడ్ చేయడమేనని ఈ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆయన ప్రతిభపై ఎవరికీ సందేహం లేకపోయినా.. వ్యక్తిగత అభిప్రాయాలు, కళాత్మక స్వేచ్ఛ పేరిట ఆయన చేస్తున్న పనుల పట్ల అభ్యంతరాలు పెరుగుతున్నాయి. రాజమౌళి కళాత్మక స్వేచ్ఛను ప్రశ్నించే విధంగా బాహుబలి చిత్రానికి సంబంధించిన ఒక అంశం కూడా వివాదాస్పదమైంది.

యానిమేషన్‌లో వస్తున్న బాహుబలి ఎటర్నల్ ట్రైలర్‌కు సంబంధించి.. రాక్షసులకి అండగా ఉన్న దేవుడిపై బాహుబలి యుద్ధం చేస్తున్నట్టుగా చూపించారని, ఇది దేవతలను కించపరచడమేనని ఆరోపణలు వచ్చాయి. అలాగే వారణాసి చిత్రంలో శివుడికి వాహనమైన నంది విగ్రహంపై హీరో మహేష్ బాబుని కూర్చోబెట్టడంపై కేసు నమోదైంది.


ఒకవైపు రాజమౌళి సినిమాలు ప్రపంచ వేదికలపై భారతీయ సినిమా ఖ్యాతిని పెంచుతున్నప్పటికీ.. మరోవైపు ఆయన వ్యక్తిగత జీవితం, తీసుకుంటున్న నిర్ణయాలు తరచుగా విమర్శలకు దారి తీస్తున్నాయి. ఈ వరుస కేసుల వెనుక కేవలం కళాత్మక అభ్యంతరాలు మాత్రమే ఉన్నాయా లేక రాజమౌళి అంతర్జాతీయ స్థాయికి ఎదగడం పట్ల కొందరిలో ఉన్న వ్యతిరేకత దీనికి కారణమా అనే కోణం కూడా చర్చనీయాంశమవుతోంది.

కారణం ఏదైనా కావచ్చు కానీ భారతీయ సినిమా గతిని మార్చిన దర్శకుడు రాజమౌళి ఇలాంటి వివాదాల్లో ఇరుక్కోవడం ఆయన ఫ్యాన్స్‌కు బాధ కలిగించే విషయం. పౌరాణిక కథనాలను ఉపయోగించుకోవడంలో ఆయనకు ఉన్న స్వేచ్ఛను ప్రేక్షకులు అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా..? లేక ఆయన నిజంగానే పురాణాల పట్ల, దైవాల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారా అనేది ప్రస్తుతం డిబేటబుల్ ఇష్యూగా మారింది.