
కమెడియన్లతో సినిమాలు తీస్తే కలెక్షన్లు వస్తాయా..? వాళ్లను హీరోలుగా పెడితే ఆడియన్స్ చూస్తారా..? ఇలా ఎన్నో అనుమానాలుంటాయి నిర్మాతల్లో. కానీ కొందరు మాత్రం అలాంటి రిస్కులే చేస్తుంటారు. ఏం వాళ్లకేం తక్కువ.. కమెడియన్లు హీరోలైతే కలెక్షన్లు రావా అంటూ అటువైపే వెళ్తున్నారు. టాలీవుడ్‌లో ఈ మధ్య హాస్యనటులే కథానాయకులుగా మారుతున్నారు.

కమెడియన్లు హీరోలు కావడం కొత్తేం కాదు. అప్పట్లో రేలంగి, రాజబాబు నుంచి.. నిన్నటి బ్రహ్మానందం, అలీ మీదుగా.. నేటి సునీల్ వరకు ఎంతోమంది కమెడియన్లు హీరోలుగా నటించారు.. మెప్పించారు కూడా. ఈ జనరేషన్‌లో కూడా ఇదే కంటిన్యూ అవుతుంది. ప్రియదర్శి ఇప్పటికే మల్లేశం, బలగం లాంటి సినిమాలతో హీరోగా ప్రూవ్ చేసుకున్నారు కూడా.

సుహాస్ కూడా కమెడియన్‌గానే వచ్చారు. కానీ కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్, అంబాజిపేట మ్యారేజ్ బ్యాండ్ అంటూ వరస విజయాలతో హీరోగా దూసుకుపోతున్నారు.

తాజాగా స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ కూడా చారి 111 సినిమాతో హీరోగా మారారు. కీర్తి కుమార్ తెరకెక్కిస్తున్న ఈ స్పై కామెడీ మార్చ్ 1న విడుదల కానుంది.

వెన్నెల కిషోర్ మాత్రమే కాదు.. ఈ నగరానికి ఏమైందిలో మస్త్ షేడ్స్ ఉన్నాయిరా నీలో అనే డైలాగ్‌తో ఫేమస్ అయిన అభినవ్ గోముటం హీరోగా మస్త్ షేడ్స్ ఉన్నాయిరా అనే పేరుతోనే ఓ సినిమా వస్తుంది. అజయ్ ఘోష్‌తో మ్యూజిక్ షాప్ మూర్తి అనే సినిమా చేస్తున్నారు కొత్త దర్శకుడు శివ పాలడుగు. ఇక వైవా హర్ష హీరోగా రవితేజ సుందరం మాస్టార్ అనే సినిమా నిర్మిస్తున్నారు.