
సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అనిల్ రావిపూడి రేంజ్ ఆకాశమంత ఎత్తుకు చేరిపోయింది. హిట్టు కొట్టడం వేరు.. హీరో ఇమేజ్‌ను పట్టుకుని.. దానికి తగ్గట్లు కథ రాసుకుని ఇండస్ట్రీ హిట్ కొట్టడం వేరు. అనిల్ చేసింది ఇదే. 25 ఏళ్ళ తర్వాత వెంకటేష్‌తో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాయించారు అనిల్. అది కూడా రొటీన్ ఫ్యామిలీ సినిమాతో..!

సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు ముందు కూడా.. హీరో ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని కథలు రాసుకున్నారు అనిల్. అది భగవంత్ కేసరి అయినా.. సరిలేరు నీకెవ్వరు అయినా.. రాజా ది గ్రేట్ అయినా.. ఏదైనా హీరోను బట్టే ఈ దర్శకుడి కథ ఉంటుంది. చిరంజీవి కోసం ఇదే చేస్తున్నారీయన.

మెగాస్టార్‌కు బాగా కలిసొచ్చిన డబుల్ రోల్ కాన్సెప్ట్ తీసుకుంటున్నారు. కెరీర్ మొదట్నుంచీ డ్యూయల్ రోల్ సినిమాలు చిరుకు బాగానే కలిసొచ్చాయి. దొంగ మొగుడు, యముడికి మొగుడు, రౌడీ అల్లుడు లాంటి సినిమాలు బ్లాక్‌బస్టర్ అయ్యాయి.

స్నేహం కోసం పర్లేదనిపించింది.. రీ ఎంట్రీ సినిమా ఖైదీ నెం 150లోనూ ద్విపాత్రాభినయం చేసారు చిరు. ఇది కూడా సూపర్ హిట్ అయింది. అనిల్ రావిపూడితో తను చేయబోయే సినిమా రౌడీ అల్లుడు, దొంగ మొగుడులా ఉండబోతుందని చిరు ఇప్పటికే హింటిచ్చారు.

ఈ లెక్కన డ్యూయల్ రోల్ ఖరారైనట్లే. ఒకటి మాస్.. మరోటి కామెడీ.. రెండూ కలిస్తే వింటేజ్ మెగా ఎంటర్‌టైన్మెంట్ ఖాయం. మే నుంచి అనిల్, చిరు సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.. సంక్రాంతి 2026 విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.