
బ్లాక్ అండ్ వైట్ నుంచి సినిమాలు కలర్‌వైపు టర్న్ అయిన సమయంలో ప్రత్యేకించి 'ఈస్ట్ మన్ కలర్ మూవీ' అని ప్రస్తావించేవారట. కానీ, అన్నీ సినిమాలూ రంగుల్లో తెరకెక్కడం మొదలయ్యాక ఆ ప్రస్తావనే లేదు. ఇప్పుడు కూడా రీజినల్, ప్యాన్ ఇండియా సినిమాలంటూ ప్రత్యేకించి మాట్లాడుకుంటున్నాం. ఫర్‌దర్‌గా ఇలా పర్టిక్యులర్‌గా చెప్పుకోవాల్సిన పని ఉండదేమో.

ఎందుకంటే మెగాస్టార్ టు మామూలు స్టార్, అందరూ ప్యాన్ ఇండియా వైపే ఫోకస్ పెంచుతున్నారు. ఈ ఏడాది వాల్తేరు వీరయ్యతో జబర్దస్త్ హిట్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఉత్తరాంధ్ర యాసతో సంక్రాంతి సీజన్‌లో మెప్పించిన మెగా బాస్ చిరంజీవి, ఇప్పుడు సరికొత్త సినిమాకు సిగ్నల్ ఇచ్చారనే వార్త వైరల్ అవుతోంది.

అదీ ప్యాన్ ఇండియా సినిమా అని సంబరపడుతున్నారు మెగా అభిమానులు. రీఎంట్రీలో వరుసగా అన్నీ జోనర్లకు న్యాయం చేసేయాలని ఫిక్సయిన చిరు, ఈ సారి సూపర్ ఫాంటసీ స్టోరీని సెలక్ట్ చేసుకున్నారట. వచ్చేనెల్లో ఎలాగూ భోళా శంకర్‌తో మెప్పించడానికి రెడీ అవుతున్నారు మెగాస్టార్ చిరంజీవి.

ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉన్నప్పుడే బింబిసార డైరక్టర్ వశిష్టకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు అన్నది ట్రెండింగ్‌లో ఉన్న న్యూస్. సోషియో ఫాంటసీ జోనర్‌లో బింబిసార తెరకెక్కించి ప్రేక్షకులను మెప్పించారు డైరక్టర్ వశిష్ట. అదే జోనర్‌లో రీసెంట్‌గా మరో స్టోరీ ప్రిపేర్ చేసుకున్నారు. బింబిసారను మించేలా ఉందట మెగాస్టార్ కోసం రెడీ చేసిన స్క్రిప్ట్.

ఈ కథకు ముల్లోకవీరుడు అనే పేరు కూడా ప్రచారంలో ఉంది. వశిష్ట చెప్పిన కథ మెగాస్టార్ చిరంజీవికి బాగా నచ్చిందట. వెంటనే, ఫస్ట్ డ్రాఫ్ట్ కి పక్కాగా మెరుగులు దిద్దమని అన్నారట. ప్రస్తుతం అదే పనిలో ఉన్నారు కెప్టెన్ వశిష్ట. మెగాభిమానులకు మరొక్కసారి జగదేకవీరుడు అతిలోక సుందరి రోజుల్ని గుర్తుచేయాలన్న సంకల్పంతో పనిచేస్తున్నారు వశిష్ట

ఇప్పుడు విడుదలవుతున్న సినిమాల్లో గ్రాఫిక్స్ గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారు గానీ, అప్పట్లో విజువల్ వండర్ అంజి మూవీతోనే వాటన్నిటినీ అభిమానులకు పరిచయం చేశారు చిరంజీవి. ఇప్పుడు వశిష్ట చేసే సినిమాలోనూ గ్రాఫిక్స్ మరో రేంజ్‌లో ఉంటాయని టాక్. ఈ ఇయర్ ఎండింగ్‌కి మెగా ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని ఫిల్మ్ నగర్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఫారిన్ ట్రిప్ వెళ్లొచ్చిన చిరంజీవి, త్వరలోనే కుమార్తె సుష్మిత ప్రొడక్షన్‌లో ఓ సినిమా చేస్తారు. కల్యాణకృష్ణ కురసాల చెప్పిన స్టోరీకి ఆల్రెడీ థంబ్సప్ చెప్పేశారు.