
గత ఐదేళ్లలో టాలీవుడ్‌కు దూసుకొచ్చిన హీరోయిన్లు ఎవరు అంటే ముందుగా గుర్తుకొచ్చే పేర్లు కృతి శెట్టి, శ్రీలీల. వీళ్ళతో పాటు చాలా మంది ముద్దుగుమ్మలు పరిచయమైనా.. వీళ్ళ స్థాయిలో ప్రభావం చూపించలేదు.

తాజాగా మరో బ్యూటీ ఇదే దూకుడు చూపిస్తున్నారు. తొలి సినిమా ఫ్లాప్ అయినా.. మూడు సినిమాలు సైన్ చేసి సంచలనం రేపుతున్న ఆ భామ ఎవరో తెలుసా..? కరోనా టైమ్‌లో కరోనా కంటే వేగంగా తెలుగు ప్రేక్షకులకు చేరువైన బ్యూటీ కృతి శెట్టి.

ఉప్పెన అనే ఒక్క సినిమాతో కుర్రాళ్ల గుండెలకు బాగానే గాయం చేసారు ఈ భామ. అదే ఊపులో రెండేళ్ల పాటు వరస సినిమాలతో రచ్చ రచ్చ చేసారు కృతి శెట్టి.

ఈమె తర్వాత శ్రీలీల ఇదే స్థాయిలో దూకుడు చూపించారు. ఇప్పుడు ఈ ఇద్దరూ సైలెంట్ అయిపోయారు. కృతి శెట్టికి తెలుగు కంటే తమిళం, మలయాళం నుంచి ఆఫర్స్ ఎక్కువగా వస్తున్నాయి.

దాంతో అక్కడే ఫోకస్ చేస్తున్నారు ఈ బ్యూటీ. మరోవైపు శ్రీలీలకు రవితేజ సినిమాతో పాటు నితిన్, పవన్ కళ్యాణ్ సినిమాలు చేతిలో ఉన్నాయి. మరోవైపు పుష్ప 2లో స్పెషల్ సాంగ్ కూడా చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీలీల దూకుడు కాస్త తగ్గడంతో భాగ్య శ్రీ బోర్సే రేసులోకి వచ్చారు.

మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ అయినా భాగ్య శ్రీ మాత్రం హిట్ అయ్యారు. ఆమె గ్లామర్‌కు రెస్పాన్స్ అదిరిపోయింది. నిజానికి ఈ సినిమా విడుదలకు ముందే మూడు నాలుగు సినిమాలు ఓకే చేసారు భాగ్యశ్రీ. అవి ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి.

ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి, విజయ్ దేవరకొండ సినిమాతో పాటు దుల్కర్ సల్మాన్‌తో నటిస్తున్నారు. దుల్కర్ సల్మాన్‌తో రానా నిర్మిస్తున్న కాంతాలో భాగ్యశ్రీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

అలాగే తాజాగా రామ్ పోతినేని హీరోగా మహేష్ బాబు తెరకెక్కిస్తున్న సినిమాలో ఈ భామనే హీరోయిన్‌గా తీసుకున్నారు. మొత్తానికి భాగ్య శ్రీ దూకుడు చూస్తుంటే.. మరో కృతి శెట్టి, శ్రీలీల అయ్యేలా కనిపిస్తున్నారు.