
Vijనటుడు నరేశ్, తన తల్లి, తెలుగు సినిమా చరిత్రలో చెరగని ముద్ర వేసిన ప్రముఖ నటి, దర్శకురాలు విజయ నిర్మల స్మృతిని శాశ్వతంగా నిలిపి ఉంచేందుకు ఒక అపురూపమైన కార్యాన్ని చేపట్టారు. ఆమె మరణానంతరం, తన మిత్రుడు వికాస్ ఇచ్చిన ఆలోచన మేరకు, ఆమె పాదాల మౌల్డ్‌ను సేకరించి బంగారంతో తయారు చేయించారు. ఈ బంగారు పాదాలను తన ఇంట్లో ప్రత్యేకంగా ప్రతిష్ఠించి, నిత్యం పూజిస్తూ, తల్లికి తన ప్రేమను, కృతజ్ఞతను చాటుకుంటున్నారు. నరేశ్ దృష్టిలో ఇవి కేవలం జ్ఞాపకాలు కావు, తన జీవితానికి రెండు బలమైన స్తంభాలు అని అన్నారు. వాటిని ప్రతి ఉదయం దర్శించడం వల్ల తనకు అపరిమితమైన ధైర్యం, ప్రేరణ లభిస్తాయని ఆయన అన్నారు.

విజయ నిర్మల కేవలం తన పాదాల ద్వారానే కాకుండా, ఆమె జీవించిన విధానం ద్వారా, ఆమె అలవాట్లు, ఆకాంక్షల ద్వారా కూడా తన ఇంట్లోనే నిత్యం సజీవంగా ఉన్నారని నరేశ్ బలంగా నమ్ముతున్నాని అన్నారు. తన తల్లికి ఇష్టమైన పిల్లితో.. ఆమెకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆమె మరణానంతరం కూడా ఆ పిల్లి ఆమె ఫోటో కింద పడుకుంటూ, ఆమె గ్లాసులో నీరు తాగేదని, చివరికి మరణించిన తర్వాత ఆమె విగ్రహం వెనుకనే పూడ్చి పెట్టామని నరేశ్ వెల్లడించారు. ఈ అనుభవాలు ఆమె స్ఫూర్తి ఇంట్లో నిండి ఉందని నరేశ్ నమ్మకాన్ని బలపరుస్తాయని తెలిపారు.

అందుకే, తన తల్లి జీవించి ఉన్నప్పుడు ఆచరించిన దినచర్యను ఇప్పటికీ అదే విధంగా కొనసాగిస్తున్నానని అన్నారు. ప్రతిరోజూ ఉదయం ఆమెకు బెడ్ కాఫీ, అల్పాహారం (చెన్న మసాలా, పూరి, ఉప్మా వంటివి), మధ్యాహ్న భోజనం, సాయంత్రం కాఫీ, రాత్రి భోజనం ఆమెకు ఇష్టమైన మెనూ ప్రకారమే సిద్ధం చేస్తారు. ఇంట్లో ఆమె వాడిన వస్తువులు, అలంకరణలలో ఎలాంటి మార్పు చేయలేదని, ఆమెకు ఎంతో నచ్చిన మహేశ్ బాబు ఫోటోను కూడా ఆమె సూచన మేరకు అలాగే ఉంచారని నరేశ్ వివరించారు.

జయ నిర్మల కేవలం ఇంటి పనులకే పరిమితం కాలేదు. ఆమె ఒక శక్తివంతమైన మహిళ అని, చిన్న వేలిపైనే అన్ని పనులను చక్కబెట్టగలదని నరేశ్ అన్నారు. సూపర్ స్టార్ కృష్ణతో ఆమెకున్న అనుబంధం ప్రేమకు, గౌరవానికి నిదర్శనమని పేర్కొన్నారు. కృష్ణ పక్కన నిలబడినప్పుడు ఆమె చూపిన వినయం, అంకితభావం అద్భుతమని తెలిపారు. కృష్ణ నిర్ణయాలను ఆమె గౌరవించేవారని, వారి మధ్య వాదనలు వస్తే వాటిని నలుగురి మధ్య కాకుండా గోడల మధ్యనే పరిష్కరించుకునేవారని వెల్లడించారు. ఈ ఇద్దరు లెజెండ్స్, కృష్ణ, విజయ నిర్మల, వారి ప్రేమ, జీవితం ఎందరికో ఆదర్శమని నరేశ్ తెలిపారు.

విజయ నిర్మల కెరీర్ కూడా అంతే ప్రకాశవంతమైనదని అన్నారు.. ఆమె దివంగత ఎన్.టి. రామారావు గారి ఆశీస్సులతో, పాండురంగ మాహాత్మ్యం చిత్రంలో కృష్ణుడి పాత్రతో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఈ సినిమాలో రామారావు గారు స్వయంగా ఆమెకు మేకప్ వేసి, పారాణి పెట్టారని నరేశ్ గుర్తు చేసుకున్నారు. ఆమె జీవితం మొత్తం కృష్ణుడితో ముడిపడి ఉందని, ఆమె భర్త పేరు కూడా కృష్ణ అని ప్రస్తావించారు. ఆమె డాక్టరేట్, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించడం ఆమె అసాధారణ ప్రతిభకు నిదర్శనం. ఒక మహిళా దర్శకురాలిగా 42 చిత్రాలకు దర్శకత్వం వహించిన ఏకైక మహిళ ఆమె కావడం ఒక రికార్డు. రోజుకు రెండు చిత్రాల షూటింగ్, కృష్ణ గారికి డై వేయడం, వంట చేయడం, కారులో స్క్రిప్టులు రాసుకోవడం వంటి అనేక పనులను ఒకేసారి నిర్వహించి, సినీ పరిశ్రమలో అన్ని సంప్రదాయాలను బద్దలు కొట్టారని నరేశ్ వివరించారు.