మలయాళం స్టార్ హీరో మమ్ముట్టి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సోదరి అమీనా (70) కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కాగా కొన్నినెలల క్రితమే మమ్ముట్టి తల్లి కన్నుమూశారు. దీని నుంచి తేరుకోకముందే సోదరి కన్నుమూయడంతో మమ్ముట్టి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
కాగా.. అమీనాకు జిబిన్ సలీం, జూలీ, జూబీ అనే ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. బుధవారం (సెప్టెంబర్ 13) ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
మమ్ముట్టి చెల్లి మరణంతో సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆయనకు సానుభూతి తెలియజేస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలంటూ ప్రార్థిస్తూ కామెంట్లు పెడుతున్నారు.
ఇటీవలే తన పుట్టిన రోజును జరుపుకొన్నారు మమ్ముట్టి. ఈ సందర్భంగానే బ్రహ్మయుగంపేరుతో కొత్త సినిమాను కూడా అనౌన్స్ చేశారు. ఇందులో మమ్ముట్టి మాంత్రికుడిగా నటించనున్నట్లు తెలుస్తోంది.
మలయాళంలో స్టార్ హీరోగా వెలుగొందుతోన్న మమ్ముట్టి తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమే. స్వాతి కిరణం, యాత్ర వంటి చిత్రాలతో తెలుగు ఆడియెన్స్‌ను మెప్పించారు. ఇటీవలే అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్‌లోనూ మెరిశారు.