
అంతర్జాతీయంగా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో బంగారం, వెండి రేట్లు పెరగడం సాధారణమే. ట్రంప్ టారిఫ్ రేట్లు పెంచడం, రష్యా-ఉక్రెయిన్ మధ్య వార్‌తో గోల్డ్ రేట్లు గత ఏడాదిలో భారీగా పెరిగాయి. అయితే 2026 ప్రారంభంలోనే మరోసారి పెద్ద ముప్పు వచ్చి పడింది. అమెరికా-వెనిజులా మధ్య ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి.

వెనిజులాపై అమెరికా సైనిక దాడులకు సిద్దమైనట్లు జాతీయ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ దాడులు ఎంతవరకు దారితీస్తాయనే చర్చ ప్రపంచవ్యాప్తంగా నడుస్తోంది. ఈ దాడులను ట్రంప్ కూడా సోషల్ మీడియా వేదికగా ధృవీకరించారు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోతో పాటు ఆయన భార్యను కూడా బంధించినట్లు తెలుస్తోంది.

ఆయన అరెస్ట్‌తో వెనిజుల భవిష్యత్ ఏంటి..? ప్రపంచ పరిణామాలు ఎలా మారనున్నాయనే చర్చ జరుగుతోంది. ఈ పరిణామాలతో సోమవారం బంగారం, వెండి రేట్లు భారీగా పెరగవచ్చని తెలుస్తోంది. అలాగే వెనిజులా ముడి చమురును ఎక్కువగా ఉత్పత్తి చేస్తోంది. దీని వల్ల ముడి చమురు ధరలు కూడా పెరిగే ఛాన్స్ ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

వెండి ధరలు రూ.2.50 లక్షల వరకు చేరుకోవచ్చని, గోల్డ్ ధర రూ.1.40 లక్షలకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. ఇక క్రూడ్ ఆయిల్ ధర 65 డాలర్లకు చేరుకునే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. సంక్షోభం వల్ల చమురు ఎగుమతులు నిలిచిపోయే ప్రమాదముంది. దీని వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా అనే చర్చ మొదలైంది.

అయితే వెనిజులా రోజుకు 10 లక్షల బ్యారల్స్ చమురు మాత్రమే ఉత్పత్తి చేస్తోంది. రోజూ 5 లక్షల బ్యారల్స్ మాత్రమే ఎగుమతి చేస్తోంది. ప్రపంచంలో ఉత్పత్తి చేసే చమురుతో పోలిస్తే ఇది ఒక శాతమే. దీని వల్ల పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం చూపకపోవచ్చని కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. అయితే సంక్షోభం ఎక్కువ రోజులు కొనసాగితే మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు.