
దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సౌకర్యాన్ని రైల్వేశాఖ అందిస్తోన్న విషయం తెలిసిందే. ప్రయాణికులు గంటపాటు ఉచితంగా వైఫైని ఉపయోగించుకునే సౌకర్యం కల్పిస్తోంది. దాదాపు దేశవ్యాప్తంగా ప్రధాన స్టేషన్లలో ఇది అందుబాటులో ఉంది. దీని వల్ల ప్రయాణికులు అవసరమైన సమయంలో గంటపాటు హైస్పీడ్ ఇంటర్నెట్‌ను ఉపయోగించుకుంటున్నారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 6,117 స్టేషన్లలో ఫ్రీ వైఫై సౌకర్యం అందుబాటులో ఉంది. ఈ విషయాన్ని లోక్‌సభలో రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. మారుమూల ప్రాంతాల్లో ఉన్న స్టేషన్లలో కూడా ఉచిత వైఫై అందిస్తున్నట్లు తెలిపారు. వైఫై సెటప్ కోసం రైల్వేశాఖ ప్రత్యేక నిధులు కేటాయించలేదని, ఇప్పటికే ఉన్న వనరులు, భాగస్వామ్యాలపై ఆధారపడి ఆ సర్వీసులు నడుస్తున్నట్లు స్పష్టం చేశారు

రైలు ఆధారిత పబ్లిక్ ఇంటర్నెట్ యాక్సెస్‌లో ఇండియన్ రైల్వే అగ్రగామిగా ఉందన్నారు. ఫ్రీ వైఫై యాక్సెస్ ఉపయోగించుకోవడానికి వినియోగదారులు ఓటీపీ కోసం తమ మొబైల్ నెంబర్‌ను మాత్రమే వాడాలని చెప్పారు. యూజర్ల వ్యక్తిగత డేటాను సేకరించమని, ఎలాంటి ఇబ్బంది లేకుండా వాడుకోవచ్చన్నారు.

ఫ్రీ వైఫైకు సంబంధించి ప్రయాణికుల ఫిర్యాదులను వెంటనే పరిష్కరిస్తామన్నారు. రైల్వే అధికారులు నెట్‌వర్క్‌ను నిశితంగా పర్యవేక్షిస్తారని, ఫిర్యాదులపై వేగంగా చర్య తీసుకుంటారని తెలిపారు. లాగిన్ సమస్యలు ఎదురైనా, స్లోగా ఉన్నా ఇంటర్నెట్ అంతరాలయను వెంటనే పరిష్కరిస్తారన్నారు. ఇక సీసీ కెమెరాల ఏర్పాటుపై కూడా దృష్టి పెట్టినట్లు అశ్విని వైష్ణవ్ వివరించారు

ఇప్పటికే 1,731 స్టేషన్లు, 11,953 కోచ్‌లను సీసీ కెమెరాల నిఘా వ్యవస్థ కవర్ చేస్తుందని రైల్వేశాఖ మంత్రి తెలిపారు. త్వరలోనే అన్ని స్టేషన్లలో సీసీ కెమెరాలను ప్రయాణికుల భద్రత కోసం ఏర్పాటు చేస్తామన్నారు అశ్విని వైష్ణవ్.