Bone Health Diet: ఉరుకుపరుగుల జీవితంలో చాలామంది అనేక సమస్యలతో బాధపడుతున్నారు. వాటిలో కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు కూడా ఉన్నాయి. ఇలాంటి సమస్యలు ప్రతీ ఇంట్లో ఉన్నాయి. దీనికి ప్రధాన కారణాలు వ్యాయామం లేకపోవడం, శరీరంలో కాల్షియం తగ్గుదల. ఈ సమస్యలను నివారించడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అవసరం. అలాగే ఈ 5 ఆహారాలను తప్పనిసరిగా డైట్‌లో చేర్చుకోవాలి
పాలు: గేదె, ఆవు పాలు కాల్షియం, పోషకాలకు ఉత్తమ మూలం. 100 గ్రాముల పాలలో దాదాపు 116 mg కాల్షియం ఉంటుంది. రోజూ ఒక గ్లాసు పాలు తాగడం వల్ల ఎముకల సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.
జున్ను-పాల పదార్థాలు: పాలు తాగడానికి ఇష్టపడని వారు చాలా మంది ఉన్నారు. ఈ సందర్భంలో జున్ను, చీజ్ లేదా పాల పదార్థాలను తినవచ్చు. ఇవి కూడా పాల పదార్థాలు కావున వీటిలో కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది. 100 గ్రాముల జున్ను లేదా చీజ్‌లో 180 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది.
శెనగలు: శెనగల్లో ఎన్నో పోషకాలున్నాయి. అందుకే మొలకెత్తిన శెనగలను తినాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఆహారం ఎముకల నొప్పులను నివారించడంలో చాలా మంచిగా పనిచేస్తుంది. 150 గ్రాముల శెనగల్లో 150 mg కాల్షియం ఉంటుంది.
ఆకు కూరలు శరీరానికి ఎప్పుడూ మేలు చేస్తాయి. పాలకూరలో మంచి మొత్తంలో విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. అదే సమయంలో కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఎముకల సమస్యలుంటే పాలకూర, పొట్లకాయ, గుమ్మడికాయ తినాలని సూచిస్తున్నారు.
థైరాయిడ్ రోగులు సోయాబీన్‌లకు దూరంగా ఉంటారు. కానీ కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు ఉన్నవారు సోయాబీన్స్‌ను ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు. 100 గ్రాముల సోయాబీన్స్‌లో దాదాపు 240 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది.