
ఫేక్ న్యూస్‌ను అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఐటీ నిబంధనలపై బాంబే హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒక చీమను చంపాలంటే సుత్తిని ఉపయోగించలేం కదా అంటూ స్పందించింది. నిబంధనలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను విచారించిన సమయంలో ఈ కోర్డు ఇలా వ్యాఖ్యలు చేసింది.

అయితే ఆన్‌లైన్‌లో ఫేక్ న్యూస్‌ను గుర్తించడానికి ఫ్యాక్ట్ చెక్‌ను అందుబాటులోకి తెస్తామని ఈ ఏడాది ఏప్రిల్‌లో కేంద్రం చెప్పింది. ఇందుకోసం ఐటీ రూల్స్-2021కు సవరణలు కూడా చేసింది. అయితే కొత్త నిబంధనలు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయని విమర్శలు వచ్చాయి.

ఈ క్రమంలోనే సామాజిక మాధ్యమాల్లో నకిలీ సమాచారాన్ని నిరోధించేందుకు ఇతర మార్గాలు ఉన్నాయంటూ పిటీషనర్ల తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. దీనికి స్పందించిన కోర్టు.. ఫ్యాక్ట్ చెకింగ్ ఉండాలని, కొంతమేరకు కంటెంట్‌ను ఫ్యాక్ట్ చేయాలంటూ పేర్కొంది.

నిబంధనలు మితిమీరినవని చెప్పడం సరైన విషయం కావచ్చు. కానీ ఒక చీమను చంపేందుకు ఏకంగా సుత్తిని వాడటం ఎంతవరకు సమంజసం అంటూ ఆ నిబంధనల తీవ్రతను ప్రశ్నించింది.

ఈ ప్రజాస్వామ్యంలో ప్రతిఒక్కరికి ప్రశ్నించే హక్కు ఉందని.. దానికి సమాధానం చెప్పడం ప్రభుత్వ విధి అని ధర్మాసనం తెలిపింది. అలాగే ఫ్యాక్ట్ చెక్ యూనిట్‌ను ఎవరు ఫ్యాక్ట్ చేస్తారంటూ అడిగింది. ఫేక్ సమాచారాన్ని ఎలా నిర్ణయిస్తారనే విషయంపై స్పష్టత లేదని తెలిపింది.