
హెల్మెట్ వాడకంపై ఒక్కొక్కరిది ఒక్కో ప్రచారం. భద్రతపై అవగాహన కల్పించే ప్రయత్నం. టెంపుల్ సిటీ తిరుపతిలో 'నో హెల్మెట్... నో పెట్రోల్' అన్న రీతిలో పోలీసులు వ్యవహరిస్తుంటే, పెట్రోల్ బంకుల వద్ద ఈ మేరకు ఫ్లెక్సీలు వెలిశాయి. ఇక ద్విచక్ర వాహనాలు నడిపే వారిలో మరింత అవగాహన కల్పించేందుకు ఇప్పుడు న్యూ ఇయర్ తోడైంది. తిరుపతి పోలీసు యంత్రాంగం తెచ్చిన హెల్మెట్ తప్పనిసరి అమలు విధానానికి ప్రజలలో మంచి స్పందన రాగా వ్యాపారులు సైతం ఇదే రీతిలో హెల్మెట్ల వాడకంపై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.

తిరుపతి పరిసరాల్లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల తీవ్రత ను ఆర్టీఏ అధికారుల గణాంకాలు కూడా స్పష్టం చేస్తున్నడంతో కట్టడి చేసే ప్రయత్నంలో హెల్మెట్ వాడకం తప్పనిసరిగా అధికార యంత్రాంగం అమలు చేస్తోంది. రోడ్డు ప్రమాదాలను అరికట్టి, ప్రాణనష్టం తగ్గించడానికి హెల్మెట్ తప్పని సరిగా వేసుకోవాలన్న నిబంధన అధికారులు అమలులోకి తెచ్చారు. హెల్మెట్ వల్ల కలిగే ప్రయోజనాలను వివరించి ప్రజల్లో అవగాహన కల్పిస్తూనే చట్టాన్ని పోలీసు, రవాణా శాఖ అధికారులు అమలు పరుస్తున్నారు.

చలానా భయంతో కాకుండా ప్రాణాలపై అక్కరతో కుటుంబ సభ్యులపట్ల బాధ్యతతో హెల్మెట్ ధరించాలని అధికారులు కోరుతున్నారు. ఇక వ్యాపారులు కూడా తాము సైతం అంటున్నారు. ఇందులో భాగంగానే తిరుపతి బ్లూ పెటల్ ఫ్లోరిస్ట్ హెల్మెట్ బొకేలతో రంగంలోకి దిగింది. న్యూ ఇయర్ విషెస్ తెలిపే వారి కోసం హెల్మెట్ బొకేలను అందుబాటులోకి తెచ్చింది. ఆత్మీయులకు, బంధుమిత్రులకు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెబుతూనే ప్రాణాలు కాపాడే హెల్మెట్ బోకేలు అందుబాటులోకి తెచ్చి ఆకట్టుకుంటుంది. నిజమైన శ్రేయోభిలాషులమని చెప్పకనే చెప్పవచ్చన్న కాన్సెప్ట్ ను తెచ్చింది.

తిరుపతి తిలక్ రోడ్డులోని బ్లూ పెటల్ ఫ్లోరిస్ట్ హెల్మెట్ బోకెలను తయారు చేసి ప్రాంతీయ రవాణా అధికారి మురళీమోహన్ చేతుల మీదుగా అమ్మకాలను ప్రారంభించింది. వ్యాపారంలోనూ సమాజహితం కలిసి ఉండాలని, అందుకు ఈ హెల్మెట్ బోకేలు నిదర్శనమన్నారు జిల్లా ప్రాంతీయ రవాణా శాఖ అధికారి మురళీమోహన్. హెల్మెట్ బోకేలు మార్కెట్ లో తీసుకొచ్చిన బ్లూ పెటల్ ఫ్లోరిస్ట్ యజమాని సాయి కుమార్ రెడ్డిని అభినందించారు.

ఇక ప్రముఖ బ్రాండ్ల హెల్మెట్లను వాడి వాటి ధరలకు అనుగుణంగా వినియోగదారుల అభీష్టం మేరకు వివిధ రంగుల పూలు, ఫలాలతో అలంకరించిన బోకేలు, బాస్కెట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. రెండున్నర దశాబ్దాల పైగా బొకేల తయారీలో ఉన్న బ్లూ పెటల్స్ ఈ ఏడాది హెల్మెట్ బొకే ఆలోచనను శ్రీకారం చుట్టింది. బిజినెస్ తో పాటు సామాజిక బాధ్యతతోనే హెల్మెట్ బోకేలను తయారుచేసామంటున్నారు నిర్వాహకులు.