
వేపాకు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వేప చెట్టులో అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. అనేక రకాల అనారోగ్య సమస్యల్ని తగ్గించుకునేందుకు ఆయుర్వేదంలో వేపాకు ఉపయోగిస్తారు. ఈ వేపాకులతో ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా.. అందాన్ని కూడా పెంచుకోవచ్చు.

వేపాకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి చర్మ వ్యాధులను తగ్గించేందుకు చక్కగా పని చేస్తాయి. అందాన్ని రెట్టింపు చేసుకోవడంలో ఈ వేప ఫేస్ ప్యాక్ బాగా పని చేస్తుంది.

వేప ఆకుల ఫేస్ ప్యాక్ వల్ల చర్మం అందంగా, కాంతి వంతంగా తయారవుతుంది. మొటిమలు, ముడతలు, నల్లటి మచ్చలు వంటివి తగ్గుతాయి. వీటిని తరుచుగా ఉపయోగిస్తే మచ్చ లేని చంద్రుడిలా మీ ముఖం వెలిగిపోతుంది.

కొన్ని వేపాలకును తీసుకుని శుభ్రంగా కడగాలి. ఇప్పుడు వీటిని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ, కాళ్లు, చేతులకు బాగా పట్టించండి. ఓ 10 - 15 నిమిషాల తర్వాత గోరు వెచ్చటి నీటితో ముఖం శుభ్రం చేసుకోండి.

ఈ వేపాకు పేస్టులో తేనె, పసుపు, పెరుగు, పాలు, ముల్తానీ మట్టి ఇలా వేటినైనా కలుపుకోవచ్చు. వారంలో రెండు సార్లు ఈ ప్యాక్‌ను ట్రై చేయవచ్చు. అయితే బాగా సెన్సిటీవ్ స్కిన్ ఉన్నవారు.. ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి.