SRILANKA CRISIS INTENSIFIED FURTHER VIOLENCE IN AGITATION: శ్రీలంకలో సంక్షోభం మరింత ముదిరింది. గత నెలరోజులుగా రోడ్డెక్కి నినదిస్తున్న శ్రీలంక ప్రజల ఆందోళన హింసాత్మక మార్గానికి మళ్ళుతోంది. దీనికి కారణం ఆందోళనకారులను బలప్రయోగంతో అణచివేయాలని అక్కడి ప్రభుత్వం భావించడమేనని అంతర్జాతీయ అంశాల విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. లంక రాజధాని కొలంబోకు 95 కిలోమీటర్ల దూరంలో వున్న రాంబక్కన్ పట్టణంలో ప్రజలు నిర్వహిస్తున్న ఆందోళనలో హింస చోటుచేసుకుంది. భారీ ఎత్తున రోడ్డెక్కిన ప్రజలను నియంత్రించేందుకు పోలీసులు, మిలటరీ ప్రయత్నించడంతో ఉద్యమకారులు రెచ్చిపోయారు. ప్రభుత్వ వాహనాలకు నిప్పుపెట్టారు. భద్రతాదళాలపైకి రాళ్ళు రువ్వారు. దాంతో రెచ్చిపోయిన పోలీసులు కాల్పులు ప్రారంభించారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మరణించగా 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. భద్రతాబలగాల్లోను పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇన్నాళ్ళు శాంతియుత మార్గంలో పయనిస్తున్న లంకేయుల ఆందోళనపర్వంలో ఏప్రిల్ 19 నాటి హింసాత్మక ఉదంతం ఓ మలుపుగా మారింది. ఇకపై ఆందోళనకారులు హింసాత్మక మార్గాన్ని అవలంభించే సంకేతాలున్నాయని లంక ఇంటెలిజెన్స్ విభాగం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. కానీ తీవ్రమైన ఆకలికేకలతో రోడ్డెక్కిన ఆందోళనకారులు హింసాత్మక మార్గాన్ని ఎలా అవలంభిస్తారన్నది నివేదిక ఇచ్చిన వారికే తెలియాలని శ్రీలంక ప్రజా సంఘాలు అంటున్నాయి. లంక సంక్షోభానికి కారణమైన రాజపక్స కుటుంబీకులు ప్రభుత్వాన్ని వీడేందుకు సిద్దంగా లేకపోవడం గమనార్హం. ప్రజాగ్రహాన్ని తగ్గించేందుకు మంత్రవర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు అధ్యక్షుడు గొటబాయ రాజపక్స. గతంలో తాము చేసిన తప్పిదాల వల్లనే ఈనాటి సంక్షోభమని తప్పును అంగీకరించారు కూడా. కానీ ఈ చర్యలు లంకేయుల ఆకలిని తీరుస్తాయా? ఇప్పటికిప్పుడు లంక సంక్షోభం ముగుస్తుందా ? అంటే సాధ్యం కాకపోవచ్చనే చెప్పుకోవాలి.
నిజానికి లంక సంక్షోభానికి మూడు కారణాలు కనిపిస్తున్నాయి. ముందుగా 2005లో దేశ పరిపాలనా పగ్గాలను చేపట్టిన మహేంద్ర రాజపక్స హయాంలోనే లంక పరిస్థితి దిగజారడం ప్రారంభమైంది. చిరకాల మిత్ర దేశమైన ఇండియాకు దూరం జరుగుతూ స్వలాభం కోసం, స్వల్పకాల ప్రయోజనాల కోసం ఆనాటి మహేంద్ర రాజపక్స ప్రభుత్వం డ్రాగన్ కంట్రీ చైనాకు దగ్గరైంది. దేశంలో కీలకమైన రెండు నౌకాశ్రయాలను చైనాకు ధారదత్తం చేసింది. ముందుగా హంబన్‌టోట పోర్టుపై పట్టు సాధించింది చైనా. తమ యుద్దనౌకలను అక్కడ వుంచేందుకు వీలుగా హంబన్‌టోట పోర్టును చైనా తీసుకుంది. దాన్ని తమకు అనుగుణంగా డెవలప్ చేసుకుంది. అందుకోసం శ్రీలంకకు భారీగా అప్పులిచ్చింది. అప్పులను చూపి, పోర్టును ఏకంగా 99 ఏళ్ళపాటు లీజుకు తీసుకుంది. అందుకోసం శ్రీలంకకు భారీ ఎత్తున రుణం ఆశచూపింది. అధికారంలో వున్న రాజపక్స కుటుంబీకులకు పెద్ద ఎత్తున లంచం అందజేసింది. రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు మహేంద్ర రాజపక్స చైనా నుంచి భారీ ఎత్తున ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలువున్నాయి. దానికితోడు తమ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు, అధికారంలో కొనసాగేందుకు మహేంద్ర రాజపక్స పెద్ద ఎత్తున ఉచిత హామీలు అమలు చేయడం మొదలుపెట్టారు. ఈ చర్యలు శ్రీలంకను రుణభారంలోకి నెట్టాయి. ఆ దేశపు ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది. క్రమంగా విదేశీ మారక ద్రవ్య నిల్వలు కరిగిపోవడం మొదలైంది. ఈక్రమంలో రెండు విడతలు అధికారాన్ని వెలగబెట్టిన మహేంద్ర రాజపక్స.. పదవీచ్యుతుడయ్యాడు. మైత్రిపాల సిరిసేన అధ్యక్షుడు అయినా.. అంతకు ముందు పదేళ్ళు కొనసాగిన విధానాలలో పెద్దగా మార్పు తేలకపోయాడు. మళ్ళీ ఎన్నికలొచ్చాయి. మూడోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టే అవకాశం లేకపోవడంతో మహేంద్ర రాజపక్స తన సోదరుడు గొటబాయ రాజపక్సను అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిపాడు. గొటబాయ ప్రెసిడెంట్ కాగానే.. మహేంద్ర బ్యాక్ డోర్ ఎంట్రీ ఇచ్చాడు. ఈసారి దేశ ప్రధానిగా మహేంద్ర రాజపక్స అవతారమెత్తాడు. గొటబాయ మంత్రివర్గంలో ఆయన సోదరవర్గానికే పెద్దపీట లభించింది. మహేంద్ర, గొటబాయ కాకుండా మరో నలుగురు రాజపక్స సోదరులు శ్రీలంక ప్రభుత్వంలో కీలక మంత్రిత్వ శాఖలను చేపట్టారు. ఈసారి శ్రీలంక సంక్షోభం తీవ్రతరమయ్యే దిశగా మళ్ళింది. దేశంలో ఆర్థిక సంక్షోభం మొదలైంది. ముఖ్యంగా విదేశీ రుణభారం తడిసిమోపెడయ్యింది. తక్కువ వడ్డీరేటుకు అప్పులిచ్చే అంతర్జాతీయ ద్రవ్యసంస్థలు శ్రీలంకకు మరిన్ని రుణాలివ్వడాన్ని నిలిపివేశాయి. దాంతో కమర్షియల్ రుణాలపై రాజపక్స ప్రభుత్వం ఆధారపడడం మొదలైంది. సహజంగానే కమర్షియల్ రుణాలకు వడ్డీ రేటు ఎక్కువ. ఇది శ్రీలంకను మరింత సంక్షోభంలోకి నెట్టాయి. విదేశీ మారకద్రవ్య నిల్వలు కనిష్ట స్థాయికి చేరుకున్నాయి.
ఈ దశలో శ్రీలంకకు తీవ్రవాదం దెబ్బ కాస్త గట్టిగానే తగిలింది. 2019లో దేశంలోని మసీదు, చర్చిలపై ఉగ్రదాడులు జరిగాయి. ఆనాటి బాంబు దాడుల్లో 269 మరణించారు. ఇందులో పలువురు విదేశీ పర్యాటకులున్నారు. ఈ ఉదంతంలో శ్రీలంకకు కొన్ని దేశాల పర్యాటకుల రాక తగ్గిపోయింది. ఆ తర్వాత కొన్ని నెలలకే కరోనా కష్టకాలం మొదలైంది. 2020 ఫిబ్రవరిలో కరోనా శ్రీలంకలో ప్రవేశించింది. ఆ తర్వాత నెల రోజులకే శ్రీలంకతోపాటు యావత్ ప్రపంచం కరోనా లాక్ డౌన్‌లో పడిపోయింది. నెలల తరబడి అంతా బంద్. పర్యాటక రంగం ఆదాయాన్నే నమ్ముకున్న శ్రీలంకకు లాక్‌డౌన్ కాలం శాపంగా మారిపోయింది. కరోనా మొదటివేవ్ ముగిసిన నేపథ్యంలో పర్యాటక రంగం మెల్లిగా కోలుకుంటున్న తరుణంలో దేశంలో వ్యవసాయ రంగంలో రాజపక్స ప్రభుత్వం తీసుకొచ్చిన ఓ విధానం శ్రీలంకను ఆహార సంక్షోభం దిశగా మళ్ళించింది. దేశంలో కేవలం ఆర్గానిక్ (ఎరువులు వాడకుండా) వ్యవసాయం మాత్రమే కొనసాగాలని ప్రభుత్వం తీర్మానించింది. దాంతో ఆహార పదార్ధాల ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. ఇదే తరుణంలో కరోనా సెకెండ్ వేవ్ మొదలైంది. మళ్ళీ లాక్ డౌన్. అంతా బంద్. ఇంకేముంది శ్రీలంకలో సంక్షోభ సంకేతాలు ప్రజలపై ప్రభావం చూపడం మొదలైంది. ధరల పెరుగుదల ప్రారంభమైంది. ద్రవ్యోల్బణం తీవ్రమైంది. కాస్తో కూస్తో ఆదుకుంటున్న పర్యాటక రంగాన్ని రష్యా, ఉక్రెయిన్ యుద్దం దెబ్బకొట్టింది. శ్రీలంకకు వచ్చే విదేశీ పర్యాటకుల్లో రష్యా, ఉక్రెయిన్ దేశస్థులు ఎక్కువ సంఖ్యలో వుండే వారు. యుద్దం కారణంగా వారి రాక ఆగిపోయింది. దాంతో ఫిబ్రవరి 2022 నుంచి లంకలో ద్రవ్యోల్బణం తీవ్రమైంది. ధరలు ఆకాశాన్నంటే స్థాయికి చేరాయి. పరిస్థితిని అదుపు చేయాల్సిన రాజపక్స ప్రభుత్వం చైనా సాయం కోసం ఎదురు చూసేందుకు పరిమితమైంది. ఏప్రిల్ మొదటి వారంలో లంకేయులు రోడ్డెక్కారు. నిత్యావసర వస్తువులు కొనలేని పరిస్థితి రావడంతో వారిలో ఆగ్రహం వ్యక్తమైంది. ప్రభుత్వం మీద ఒత్తడి పెరిగింది. కొందరు మంత్రివర్గం నుంచి తప్పుకున్నారు. అయితేనేం తాము మాత్రం పదవులను వదులుకునేందుకు సిద్దపడలేదు గొటబాయ, మహేంద్ర సోదరులు. కొత్త మంత్రులను తీసుకున్నారు. గతంలో చేసిన తప్పులను అంగీకరించారు. ఈ చర్యలు ప్రస్తుత సంక్షోభాన్ని సమసిపోయేలా చేయవని భావిస్తున్న లంకేయులు ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేశారు. ఫలితంగానే ఏప్రిల్ 19న రాంబక్కన్ సిటీలో హింస ప్రజ్వరిల్లింది.
అయితే.. లంక సంక్షోభానికి పరిష్కారం ఏంటి ? ఇదిప్పుడు ఆదేశ పరిణామాలను పరిశీలిస్తున్న వారిలో మెదులుతున్న ప్రశ్న. లంక ఆర్థిక పరిస్థితి అనుకున్న వెంటనే మెరుగుపడేది కాదు. ఇందుకు చాలా సమయం పడుతుంది. స్వల్ప కాలిక చర్యల ద్వారా లంకేయుల ఆహార కొరతను తీర్చాలి. వారు నెమ్మదిగా తమతమ పనుల్లోకి మళ్ళేలా చేయాలి. ధరలను అదుపు చేయాలి. అదేసమయంలో దీర్ఘకాలంలో దేశ ఆర్థిక పరిపుష్టిని సాధించే చర్యలను ప్రారంభించాలి. కేవలం టూరిజం వంటి రంగాలపై ఆధారపడకుండా పారిశ్రామిక రంగాన్ని ఇతోధికంగా ప్రోత్సహించడం ద్వారా ఇటు ఉద్యోగ కల్పన, అటు ఆర్థిక రంగానికి ప్రయోజనం కలిగే చర్యలు ప్రారంభించాలి. హంబన్‌టోట, కొలంబో పోర్టుపై చైనా పెత్తనాన్ని అరికట్టాలి. ముఖ్యంగా కొలంబో పోర్టు ఆవరణలో ఆ దేశ కరెన్సీకి వాల్యూ లేకపోవడం లంక దౌర్భాగ్యంలో మరోకోణమనే చెప్పాలి. సొంత దేశంలోని ఓ ప్రాంతంలో సొంత కరెన్సీకి వాల్యూ లేకపోవడం దౌర్భాగ్యం కాకమరేమిటి ? ఇలాంటి దుస్థితి నుంచి బయటపడడం ద్వారా దేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకోవాలి. కష్టకాలంలో హ్యాండిచ్చిన చైనా పట్ల విదేశాంగ విధానంలో మార్పు రావాలంటే మాత్రం రాజపక్ష కుటుంబం అధికారం నుంచి తప్పుకోవాల్సి వుంది. ఎందుకంటే వారి కుటుంబం పెద్ద ఎత్తున చైనా సంస్థల నుంచి ముడుపులు తీసుకున్న కారణంగా రాజపక్స కుటుంబాలన్ని దేశ ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు. అందుకే ‘‘గో గోటా గో’’ నినాదం అంత బలంగా వినిపిస్తోందా దేశంలో. అంతర్జాతీయ అంశాల విశ్లేషకులు సైతం రాజపక్స కుటుంబం అధికారం నుంచి తప్పుకుంటే గానీ దేశ సంక్షోబానికి తెరపడే అవకాశాలు లేవనే అంటున్నారు. ఈ క్రమంలో గొటబాయ, మహేంద్ర రాజపక్సలు తీసుకోబోయే నిర్ణయాలిపుడు అత్యంత కీలకంగా మారాయి.