పార్టీ అధ్యక్ష ఎంపిక లేదా ఎన్నికలపై ప్రశాంత్ కిశోర్ చేసిన సూచనలను సోనియా పట్టించుకోలేదనిడానికి చింతన్ శిబిర్ నిదర్శనంగా నిలుస్తోంది. నిజానికి ప్రశాంత్ కిశోర్ నివేదికను కాంగ్రెస్ హైకమాండ్ పరిగణనలోకి తీసుకోలేదు అనడానికి రాహుల్ విదేశీ విహార యాత్ర, ప్రియాంక అమెరికా AMERICA పర్యటనలను రాజకీయ విశ్లేషకులు కోట్ చేస్తున్నారు. ప్రశాంత్ కిశోర్ ప్రతిపాదించిన అంశాలను నచ్చకనే రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్ళిపోవడం ద్వారా పీకే నివేదికపై చర్చను క్లోజ్ చేశారని చెబుతున్నారు. అదేసమయంలో పీకేతో తనకు అనుకూలంగా నివేదిక ఇప్పించుకున్న ప్రియాంక కూడా తన ప్రయత్నాలు బెడిసి కొట్టడంతో అమెరికా బాట పట్టారని చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీలో చేరబోవడం లేదని, సోనియా ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్నానని ప్రశాంత్ కిశోర్ ప్రకటించిన తర్వాత అసలు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి అన్న చర్చలకు ముగింపుగానే చింతన్ శిబిర్ నిర్వహణకు సోనియా పూనుకున్నారు. పార్టీని సమూలంగా మార్చేసేలా నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు కనిపించినా చివరికి శిబిర్ ముగిసే సమయానికి పార్టీలో పెద్దగా మార్పేమీ రాలేదన్న సంకేతాలే బయటపడ్డాయి. కశ్మీర్ KASHMIR నుంచి కన్యాకుమారి KANYAKUMARI దాకా ఓ పాదయాత్ర, కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా మరో పాదయాత్ర చేపట్టనున్నట్లు కాంగ్రెస్ పెద్దలు ప్రకటించడం మాత్రం ప్రజాకర్షణకు బీజేపీ పంథానే ఎంచుకున్నారా అనిపించేలా వుంది. ఎందుకంటే బీజేపీ తొలినాళ్ళలో ఇలాంటి యాత్రలే ఆ పార్టీని క్షేత్రస్థాయికి చేర్చాయి. అద్వానీ LK ADWANI నిర్వహించిన అయోధ్య AYODHYA రథయాత్ర, మురళీ మనోహర్ జోషి నిర్వహించిన లాల్‌చౌక్ తిరంగా యాత్రలు 90వ దశకంలో బీజేపీ ఎంపీ సీట్లను గణనీయంగా పెంచేశాయి. ముఖ్యంగా హిందీ రాష్ట్రాలలో బీజేపీ వేళ్ళూనుకుపోయేలా చేశాయి అద్వానీ, జోషిల యాత్రలు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా రెండు కీలకాంశాలను ఎంచుకున్న కాంగ్రెస్ పార్టీ వైస్ వెర్సాగా కశ్మర్, కన్యాకుమారి పాదయాత్రలతో సిద్దమైంది. అక్టోబర్ 2వ తేదీన కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా సాగనున్న సమైక్య యాత్రకు పూనుకున్నారు కాంగ్రెస్ నేతలు. దేశంలో మతపరమైన విభజన జరగకుండా సమైక్య భావన పెంచాలనేది ఈ యాత్ర ఉద్దేశంగా కనిపిస్తోంది. అయితే ఈ యాత్ర ప్రకటన వెలువడిన వెంటనే బీజేపీ, దాని అనుబంధ సంస్థల నుంచి కాంగ్రెస్ పార్టీపై ట్రోలింగ్ మొదలైంది. 1948లో బీజేపీ లేదని, మరి ఆనాడు కాంగ్రెస్ సారథ్యంలోనే దేశం రెండుగా విభజించారని కౌంటర్ అటాక్ మొదలుపెట్టాయి సంఘ్ పరివార్ సంస్థలు. ఇక కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతిపాదించిన మరో యాత్ర.. పెరిగిపోతున్న నిరుద్యోగాన్ని నియంత్రించాలన్న డిమాండ్‌తో చేపట్టబోతున్నారు.
ఇక్కడొక ఆశ్చర్యకరమైన, ఆసక్తికరమైన అంశాన్ని చెప్పుకోవాలి. కొన్నేళ్ళ క్రితం కాంగ్రెస్ పార్టీలో జీ-23 G-23 పేరిట ఓ అంతర్గత విప్లవం మొదలైంది. కొందరు సీనియర్లు పార్టీ పరిస్థితిని వివరిస్తూ అందుకు కారణాలను, మెరుగు పరిచేందుకు తీసుకోవల్సిన చర్యలను ప్రతిపాదిస్తూ అధినేత్రి సోనియమ్మకు ఓ లేఖాస్త్రాన్ని సంధించారు. అప్పట్లో ఆ లేఖ మీడియాలో సంచలనంగా మారింది. ముందుగా ఉలిక్కి పడ్డ కాంగ్రెస్ హైకమాండ్ ఆతర్వాత ఆ 23 మంది పెద్దలను బుజ్జగించేందుకు పూనుకుంది. కొందరితో నేరుగాను, మరికొందరితో పరోక్షంగాను మాటామంతీ కొనసాగించారు. జీ-23 లోని కొందరు నేతలకు పార్టీ వేదికలపై ప్రాతినిధ్యం కల్పించారు కూడా. కానీ.. ఆ చర్యలు కేవలం పైపై పూతలేనని తాజాగా చింతన్ శిబిర్ తేటతెల్లం చేసింది. జీ-23 వెనుక కీలక నేత, ఆనాటి లేఖ కూర్పు చేసిన వ్యక్తి.. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ KAPIL SIBAL అని గుర్తించిన సోనియా గాంధీ.. తాజాగా జరిపిన చింతన్ శిబిర్‌కు ఆయన రాకుండా జాగ్రత్తపడింది. తద్వారా తమ కుటుంబ ఆధిపత్యాన్ని ప్రశ్నించే వారికి పార్టీలో ప్రాధాన్యత దక్కదని సోనియా పరోక్షంగా చాటారు. పార్టీ మేలు కోసం, ఫ్యూచర్‌లో మంచి ఫలితాలు సాధించేందుకు చేసే సద్విమర్శలను సైతం సోనియా సహించరన్న సందేశం కపిల్ సిబల్‌ని అవాయిడ్ చేయడం ద్వారా పంపారు. జీ-23 నేతల్లో ఒక్క గులాం నబీ ఆజాద్ GULAM NABI AZADకు మాత్రమే చింతన్ శిబిర్‌లో కాస్తో కూస్తో ప్రాధాన్యత లభించింది. బహుశా ఆయన కశ్మీరీ కావడమే అందుకు కారణం కావచ్చు. ఇక చింతన్ శిబిర్ ద్వారా పంపిన సంకేతాల్లో యునైటెడ్ ప్రొగ్రెస్సివ్ అలయెన్స్ ప్రస్తావన అస్సలు కనిపించలేదు సరికదా.. మిత్రపక్షాల అండా దండా అవసరం లేదని.. కాంగ్రెస్ ఒక్కటే బీజేపీకి చెక్ పెట్టగలదని సోనియా, రాహుల్ తమ తమ సందేశాల్లో అభిప్రాయపడ్డారు. నిజానికి బీజేపీని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ పార్టీ తమతో కలిసి వచ్చే ప్రాంతీయ పార్టీలను వీలైనంతగా కలుపుకుని పోవాలని, ప్రాంతీయ పార్టీలు బలంగా వున్న రాష్ట్రాల్లో రెండో పార్టీగా వుండేలా ఒదిగి పోవాలని ప్రశాంత్ కిశోర్ సోనియా గాంధీకిచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో పేర్కొన్నారు. అంటే తమిళనాడులో డీఎంకే, తెలంగాణలో టీఆర్ఎస్, మహారాష్ట్రలో శివసేన, బెంగాల్‌లో టీఎంసీ వంటి పార్టీలతో పొత్తుకోసం కాస్త తగ్గాలని పీకే సూచించారు. ఆయా రాష్ట్రాలలో రెండో పార్టీగా వుండేందుకు సిద్దం కావాలని, అది జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి పెద్దన్న పాత్ర పోషించే అవకాశాన్నిస్తుందని పీకే పేర్కొన్నారు. కానీ ఈ అంశాలను కాంగ్రెస్ పెద్దలు పెద్దగా పట్టించుకోలేదని చింతన్ శిబిర్ ముగింపు ప్రసంగాలు చాటాయి. అంతకు ముందు తెలంగాణలో పర్యటించిన సందర్భంలోను రాహుల్ టీఆర్ఎస్‌పార్టీతో ఎప్పటికీ పొత్తుండదని చాటారు. కేసీఆర్ KCR ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందంటూ తాము అధికారంలోకి వస్తే అవినీతి పరుల వెంట పడతామని కూడా రాహుల్ గాంధీ హెచ్చరించారు. తద్వారా కేసీఆర్‌తో రాహుల్ కయ్యానికి కాలు దువ్వారు. టీఆర్ఎస్ TRS ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడ్డారు. ఓరకంగా చెప్పాలంటే పార్లమెంటు ఎన్నికల తర్వాత బీజేపీకి వ్యతిరేకంగా నెంబర్ గేమ్ అవసరమైతే టీఆర్ఎస్ పార్టీని అక్కున చేర్చుకునే అవకాశాలను ఆయనే స్వయంగా కట్ చేసేశారు. కాంగ్రెస్ పార్టీతోనే బీజేపీ అంతం సాధ్యమవుతుందని చెప్పడం ద్వారా ప్రాంతీయ పార్టీలను దూరం చేసుకున్నారు రాహుల్ గాంధీ. పార్టీ నాయకత్వాన్ని మార్చాలన్న సూచనను పుత్ర ప్రేమ కోసం పక్కన పెట్టిన సోనియా గాంధీ గత విధానాలనే కొనసాగించనున్నట్లు సంకేతాలిచ్చారు. సో.. ఆర్భాటంగా నిర్వహించుకున్న చింత్ శిబిర్ తర్వాత కూడా పార్టీ దిశ మారలేదనడానికి ఈ రెండంశాలు నిదర్శనాలుగా కనిపిస్తున్నాయి.