SEDITION CASES: రాజద్రోహం సెక్షన్.. బ్రిటీషర్ల కాలపు అవశేషం.. తొలగించాలన్న సంకల్పం.. పార్టీల వైఖరే అనుమానాస్పదం!

ఈస్టిండియా కంపెనీ కంటే బ్రిటీషర్లు కాస్త ఉదారంగా ఆలోచించి రాజద్రోహం అంశాన్ని పక్కన పెట్టారా అని చాలా మంది అనుకున్నారు. కానీ చివరికి పదేళ్ళకు గానీ పొరపాటును గుర్తించలేదు. 1870లో 113 సెక్షన్ పొరపాటున మిస్సయ్యిందని గ్రహించారు. దానికి సెక్షన్ 124ఏ రూపంలో ఐపీసీలో మళ్ళీ చొప్పించారు.

SEDITION CASES: రాజద్రోహం సెక్షన్.. బ్రిటీషర్ల కాలపు అవశేషం.. తొలగించాలన్న సంకల్పం.. పార్టీల వైఖరే అనుమానాస్పదం!
Modi , Sonia Gandhi, Nv Ramana
Follow us
Rajesh Sharma

|

Updated on: May 13, 2022 | 4:19 PM

SEDITION CASES IN INDIA SUPREME COURT ORDER ON IPC SECTION 124A: రాజద్రోహం. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 124ఏ. గత వారం రోజులుగా ఈ టాపిక్ దేశవ్యాప్తంగా పెద్ద చర్చకే దారి తీసింది. అత్యున్నత ధర్మాసనం ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా రాజద్రోహం సెక్షన్‌ (ఐపీసీ 124ఏ) ప్రకారం కొత్త కేసుల నమోదు నిలిచిపోయింది. కేవలం ఇదే సెక్షన్ కింద నమోదైన కేసుల విచారణ కూడా నిలిపి వేశారు. కానీ ఈ సెక్షన్‌తోపాటు ఇతర ఐపీసీ (IPC) సెక్షన్ల ప్రకారం నమోదైన కేసులను.. వాటిని విచారిస్తున్న న్యాయమూర్తుల విచక్షణాధికారాల మేరకు కొనసాగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం GOVERNMENT OF INDIA ఈ ఐపీసీ సెక్షన్‌కు ప్రత్యామ్నాయం తెచ్చే దాకా ఇదే పరిస్థితి కొనసాగనున్నది. ఇదంతా బాగానే వుంది. బ్రిటిష్ పాలకులు ఆనాటి స్వాతంత్ర్య పోరాట యోధులను హింసించేందుకు రూపొందించిన రాజద్రోహం సెక్షన్‌ను ఇంత కాలం కొనసాగించిన ఘనతలో దాదాపు అన్ని రాజకీయ పార్టీలు POLITICAL PARTIES భాగస్వాములే. దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ CONGRESS PARTYని మరి కాస్త ఎక్కువగానే నిందించాల్సి వుంటుంది. ఎందుకంటే దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ JAWAHAR LAL NEHRU అభిప్రాయాన్ని కాంగ్రెస్ పాలకులెవరు గౌరవించలేదు. రాజద్రోహం సెక్షన్‌ను తొలగించాల్సిందేనని ఇవాళ మీడియాలో తమ అభిమతాన్ని వ్యక్తం చేసిన పార్టీల్లో ఏవీ కూడా ఐపీసీ 124ఏని తొలగించేందుకు కనీసం యత్నించలేదు.. సరికదా.. అందరి హయాంలలో కూడా ఎన్నో కేసులు రాజద్రోహం సెక్షన్‌ కింద నమోదయ్యాయి. రాజద్రోహం సెక్షన్ నేపథ్యాన్ని ఓసారి చూద్దాం.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమలవుతున్న విద్యావిధానాన్ని రూపొందించిన మెకాలే నే ఇండియన్ పీనల్ కోడ్‌ (ఐపీసీ)ని, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ)ని రూపొందించారు. 18వ దశకం తొలినాళ్ళలో భారత దేశం మీద పట్టుసాధిస్తున్న బ్రిటీష్ పాలకులకు దేశంలోని విభిన్న భౌగోళిక, పౌర విధానాలు అడ్డంకిగా మారాయి. పౌరులకు శిక్షలు విధించే విషయంలో సేమ్ సిస్టమ్ ఇండియా INDIA వ్యాపితంగా వుండాలని భావించారు. ఆ సందర్భంలోనే ఆనాటి ఈస్టిండియా కంపెనీ EAST-INDIA COMPANY బ్రిటిష్ చట్టాల ఆధారంగా ఇండియాలోను కొత్త పాలసీలను రూపొందించాలని సంకల్పించారు. బ్రిటిష్ పార్లమెంటు చార్టర్ యాక్టు BRITISH PARLIAMENT CHARTER ACT ఆధారంగా 1833లో లా కమిషన్‌ను ఏర్పాటు చేసింది ఈస్టిండియా కంపెనీ. లా కమిషన్ LAW COMMISSION సారధ్య బాధ్యతలను లార్డ్ మెకాలేకు అప్పగించింది. 1837 నాటికి మెకాలే తాను సిద్దం చేసిన పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ముసాయిదాలను ఈస్టిండియా కంపెనీకి అందజేశారు. కానీ ఇవి చట్టాలుగా మారడానికి మాత్రం చాలా కాలమే పట్టింది. సుమారు రెండున్నర దశాబ్ధాల తర్వాత అంటే 1860-61లో ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) (దీనినే భారతీయ శిక్ష్యాస్మృతి అంటారు) చట్టంగా మారింది. మెకాలే రూపొందించిన ఐపీసీ డ్రాఫ్టులోని సెక్షన్ 113లో రాజద్రోహం ప్రస్తావన వుండింది. తీరా ఇది చట్టంగా మారే సమయానికి అంటే 1860 నాటికి అందులో సెక్షన్ 113 కనిపించలేదు. ఈ విషయం అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరిచింది. అది ఈస్టిండియా కంపెనీ నుంచి అధికారం బ్రిటీషర్లకు మారుతున్న సందర్భం. దాంతో ఈస్టిండియా కంపెనీ కంటే బ్రిటీషర్లు కాస్త ఉదారంగా ఆలోచించి రాజద్రోహం అంశాన్ని పక్కన పెట్టారా అని చాలా మంది అనుకున్నారు. కానీ చివరికి పదేళ్ళకు గానీ పొరపాటును గుర్తించలేదు. 1870లో 113 సెక్షన్ పొరపాటున మిస్సయ్యిందని గ్రహించారు. దానికి సెక్షన్ 124ఏ రూపంలో ఐపీసీలో మళ్ళీ చొప్పించారు.

ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే.. ముసాయిదాను రచించే సమయంలో మెకాలే రాజద్రోహ నేరానికి జీవిత కాల శిక్షLIFE-TIME IMPRIONMENT ను ప్రతిపాదించారు. కానీ అప్పట్లో రాజద్రోహ నేరానికి ఇంగ్లాండు (ENGLAND)లో కేవలం మూడేళ్ళ జైలు శిక్ష వుండింది. దాన్ని ఓకేసారి జీవిత కాలానికి పెంచితే విమర్శలు వచ్చే అవకాశం కనిపించడంతో భారతీయుల విషయంలో రాజద్రోహ నేరానికి అయిదేళ్ళ జైలు శిక్ష వుండాలని పాలకులు తీర్మానించారు. ఆ మేరకు ఐపీసీ సెక్షన్ 124ఏలో ప్రస్తావించారు. ఈ మార్పు రెండో లా కమిషన్ SECOND LAW COMMISSION సిఫారసు మేరకు జరిగినట్లు చరిత్ర HISTORY చెబుతోంది.అయితే.. ఆశ్చర్యకరమైన రీతిలో ఈ సెక్షన్‌ని భావప్రకటనా స్వేచ్ఛకు ఉపయోగకరమని ఆనాడు బ్రిటీష్ పాలకులు (BRITISH RULERS) పేర్కొన్నారు. ఇది చట్టంగా మారిన తర్వాత దీనిని బ్రిటీష్ పాలకులు మహాత్మా గాంధీ MAHATMA GANDHI, బాల గంగాధర్ తిలక్ BAL GANGADHAR TILAK సహా వేలాది మంది భారతీయులపై ప్రయోగించి కేసులు నమోదు చేశారు. 19వ శతాబ్ధం తొలి నాళ్ళలో అంటే 1907లో అనుమతి లేకుండా బహిరంగ సభలు నిర్వహించినా ఈ సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు సవరణ చేశారు. సరిగ్గా వందేళ్ళ క్రితం అంటే 1922లో బ్రిటీష్ పాలకుల వైఖరిని నిరసిస్తూ మహాత్మా గాంధీ ‘యంగ్ ఇండియా’ (YOUNG INDIA) పత్రికలో వరుసగా ఆర్టికల్స్ రాశారు. దాంతో ఆయనపై ఐపీసీ సెక్షన్ 124ఏ ప్రకారం కేసు నమోదు చేశారు. 1922 మార్చిలో అహ్మాదాబాద్ కోర్టులో గాంధీపై విచారణ జరిగింది. దాంతో ప్రజల స్వేచ్ఛను కబళించే రాక్షస సెక్షన్‌గా 124ఏ ని మహాత్మా గాంధీ అభివర్ణించారు. హింసను ప్రేరేపించనంతకాలం ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రకటించడం భావ ప్రకటనా స్వేచ్ఛ కిందకు వస్తుందని గాంధీ అభిప్రాయపడ్డారు. రాజద్రోహం సెక్షన్ను RAPE AGAINST JUSTICE గా మహాత్మా గాంధీ పేర్కొనడం విశేషం. 124ఏ తొలగింపును డిమాండ్ చేస్తూ గాంధీ 1929లో ప్రజా ఉద్యమానికి పిలుపునిచ్చారు. గమ్మత్తేమిటంటే.. గాంధీ ప్రజా ఉద్యమానికి పిలుపునిచ్చిన సందర్భంలో ఈ సెక్షన్ని ఎంత తొందరగా వదిలించుకుంటే అంత మంచిదని అభిప్రాయపడిన నెహ్రూ NEHRU.. ఆ తర్వాత తాను 14 ఏళ్ళపాటు దేశానికి ప్రధానిగా వున్న సందర్భంలో దాన్ని తొలగించలేదు. ఆయన హయాంలోను పలు రాజద్రోహం కేసులు నమోదవడం గమనార్హం. కేవలం నెహ్రూ హయాంలోనే కాదు.. స్వాతంత్ర్యపోరాట సమయంలో ఐపీసీ 124ఏ ని వ్యతిరేకించిన ఇందిరా గాంధీ INDIRA GANDHI, మొరార్జీ దేశాయ్ MORARJI DESAI వంటి ప్రధానులు కూడా ఈ సెక్షన్ తొలగింపునకు యత్నించలేదు. ఇండియన్స్ స్వాతంత్ర్య అభిలాషను అణచివేసేందుకు బ్రిటీషర్లు ఉపయోగించిన ఈ కఠిన చట్టాన్ని స్వతంత్రం వచ్చిన తర్వాత స్వపాలకులు కూడా యధేచ్ఛగా ఉపయోగించారు. దాంతో బాంబే హైకోర్టు BOMBAY HIGHCOURT ఓ సందర్భంలో ప్రభుత్వ అభిప్రాయంతో ఏకీభవించని వారంతా దేశద్రోహులేనా అని ప్రశ్నించాల్సి వచ్చింది. 80వ దశకం తర్వాత రాజద్రోహం సెక్షన్ వినియోగం పెరిగి పోయిందనడానికి గణాంకాలు ఆధారంగా కనిపిస్తున్నాయి. ఓ అధ్యయనం ప్రకారం దేశవ్యాప్తంగా 2010-2014 (యుపీఏ హయాం) మధ్య కాలంలో 3762 మందిపై 279 రాజద్రోహం కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఆరేళ్ళలో అంటే 2014-2020 మధ్య కాలంలో (మోదీ హయాం) 7136 మందిపై 519 రాజద్రోహం కేసులు నమోదయ్యాయి. అభియోగాలు నమోదైన వారి సంఖ్య పెద్దగానే వున్నా ఆ అభియోగాలు నిరూపణ అయిన వారి సంఖ్య కనిష్టంగా వుంది. అంటే ఆయా ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగానే రాజద్రోహం సెక్షన్‌ని దుర్వినియోగం చేస్తున్నట్లుగా గమనించవచ్చు. తాజాగా కాలం చెల్లిన చట్టాలను తొలగించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PRIME MINISTER NARENDRA MODI) పిలుపునిచ్చారు. ఆయన ప్రస్తావించిన కాలం చెల్లిన చట్టాల్లో రాజద్రోహ నేరం కూడా వుంది. ఇంకోవైపు దేశ అత్యున్నత న్యాయస్థానానికి చీఫ్ జస్టిస్‌గా ఎన్వీ రమణ (CHIEF JUSTICE N V RAMANA) బాధ్యతలు చేపట్టిన తర్వాత ‘‘వలస కాలపు అవశేషం’’ సెక్షన్ 124ఏ కొనసాగింపును అభివర్ణించారు. సుప్రీం సూచన మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ సెక్షన్‌పై పున: పరిశీలన చేస్తామని హామీ ఇచ్చింది. ఆ మేరకు సుప్రీంకోర్టులో ప్రమాణ పత్రాన్ని కూడా కేంద్ర న్యాయ శాఖ సమర్పించింది. ఈ నేపథ్యంలో రాజద్రోహం సెక్షన్ అంశం ఓ కొలిక్కి వచ్చే వరకు దేశంలో 124ఏ సెక్షన్ వినియోగంపై సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం స్టే విధించింది. పాత కేసుల విచారణపై కూడా నిర్దిష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే సుప్రీంకోర్టు (SUPREME COURT) ఉత్తర్వులను దాదాపు అన్ని పార్టీలు స్వాగతించాయి. హర్షం వ్యక్తం చేశాయి. ఇదంతా బాగానే వున్నా.. గతంలో తాము పాలించిన కాలంలో ఈ సెక్షన్‌ని ఏ మేరకు దుర్వినియోగం చేశామన్న ఆత్మ పరిశీలన చేసుకుని, తదనుగుణంగా భవిష్యత్తులో ప్రభుత్వ అభిప్రాయంతో విభేదించే వారి పట్ల వ్యవహరించే దిశగా ఆయా పార్టీలు, వాటి అధినేతలు అడుగులు వేయాల్సి వుంది.