Kavitha Vs Arvind: నెక్స్ట్ లెవెల్‌కు బీజేపీ, టీఆర్ఎస్ పోరు.. కాకరేపిన కేసీఆర్ కామెంట్.. ఇప్పుడు అరవింద్ వర్సెస్ కవిత

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టయిన బోయినపల్లి అభిషేక్ రావు, ఆరోపణలు ఎదుర్కొంటున్న రామచంద్రన్ పిళ్ళై కవితకు సన్నిహితులంటూ ప్రచారం జరిగింది. లిక్కర్ స్కామ్‌లో కవిత పేరు కూడా జోరుగా ప్రచారం జరిగింది. అయితే...

Kavitha Vs Arvind: నెక్స్ట్ లెవెల్‌కు బీజేపీ, టీఆర్ఎస్ పోరు.. కాకరేపిన కేసీఆర్ కామెంట్.. ఇప్పుడు అరవింద్ వర్సెస్ కవిత
Arvind Vs Kavitha

Updated on: Nov 18, 2022 | 3:53 PM

తెలంగాణ రాజకీయం బుసలు కొడుతోంది. బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలడమే కాదు. ఇళ్ళపై దాడులు కూడా ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కవిత ఫోన్ చేశారని, ఆ పార్టీలో చేరేందుకు యత్నిస్తున్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన కామెంట్ కాక రేపింది. ఖర్గేతో ఫోన్ మాట్లాడిన విషయాన్ని కవితే స్వయంగా తన తండ్రి, టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లీకు ఇచ్చిందని అరవింద్ కామెంట్ చేశారు. అరవింద్ కామెంట్‌పై కవిత చాలా సీరియస్ అయ్యారు. అవాకులు చెవాకులు పేలితే నిజామాబాద్ నడిరోడ్డు మీద చెప్పుతో కొడతానని కవిత వార్నింగిచ్చారు. అరవింద్ ఎక్కడ పోటీ చేసినా వెంటబడి ఓడిస్తానని సవాల్ విసిరారు. మళ్ళీ మాట్లాడితే కొట్టి కొట్టి సంపుతం అన్నారు ఎమ్మెల్సీ కవిత. కవిత ఇలా అరవింద్‌కు వార్నింగ్ ఇస్తున్న తరుణంలోనే తెలంగాణ జాగృతి శ్రేణులు హైదరాబాద్ నగరంలోని అరవింద్ సొంతింటిపై దాడికి దిగారు. ఇంటి ఆవరణలోని పూల మొక్కలు, కారు, ఇంట్లోని ఫర్నీచర్, దేవుని పటాలు ధ్వంసం చేశారు. ఆ సందర్భంలో ఇటు అరవింద్ గానీ, అటు ఆయన తండ్రి సీనియర్ రాజకీయవేత్త డి. శ్రీనివాస్ గానీ ఇంట్లో లేరు. అరవింద్ నిజామాబాద్ నగరంలో జరిగిన దిశ సమావేశంలో వున్నపుడు ఈ దాడి జరిగింది. దాడి గురించి తెలుసుకున్న అరవింద్ నిజామాబాద్ సిటీలో మీడియాతో మాట్లాడారు. దాడిని ఖండించారు. 70 ఏళ్ళ తన తల్లిని కవిత పంపిన గూండాలు బెదిరించారని ఆయన ఆరోపించారు. తనపై పోటీ చేసి ఓడిస్తానని కవిత సవాల్‌ని స్వీకరించారు. నిజామాబాద్ లోక్‌సభ సీటులోనే 2024లో తనతో తలపడాలని కవితకు సూచించారు.

ఆజ్యం పోసిన కేసీఆర్ కామెంట్!

నిజానికి కవితను బీజేపీలోకి తీసుకునేందుకు ఆ పార్టీ నేతలు సంప్రదించారని నవంబర్ 15వ తేదీన జరిగిన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కేసీఆర్ ప్రకటించారు. ఇది నిజమేనా అంటూ మీడియా బీజేపీ నేతలపై ప్రశ్నలు సంధించింది. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు. వీరిద్దరిలో అరవింద్ స్పందన చాలా సెటైరిక్‌గా వుండడం కవితకు ఆగ్రహం తెప్పించింది. కవితను బీజేపీలోకి ఎవరు తీసుకుంటారంటూనే ఆమె కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు టచ్‌లో వున్నారని చెప్పారు. ఖర్గేకు అత్యంత సన్నిహితంగా వుండే ఓ వ్యక్తి తనకీ విషయం చెప్పారని అరవింద్ అన్నారు. అరవింద్ మాటలకు నొచ్చుకున్న కవిత చాలా సీరియస్‌గా స్పందించారు. పిచ్చిపిచ్చిగా మాట్లాడితే నిజామాబాద్ చౌరాస్తాలో చెప్పుతో కొడతానంటూ హూంకరించారు. మాటల యుద్దం వరకు బాగానే వున్నా.. ఇళ్ళ మీద దాడులు కూడా ప్రారంభమవడం తెలంగాణ రాజకీయాల్లో కొత్త ఒరవడి ప్రారంభమైనట్లు అవగతమవుతోంది. తెలంగాణ జాగృతి నేతలు రాజారాం యాదవ్ ఆధ్వర్యంలోనే అరవింద్ ఇంటిపై దాడి జరిగినట్లు ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. దాడి జరిగిన కొన్ని గంటల్లోనే బీజేపీ నేతలు నిరసనకు దిగారు. ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సారథ్యంలో అరవింద్ ఇంటి నుంచి నిరసన ర్యాలీ నిర్వహించారు. కేసీఆర్ హయాంలో రాష్ల్రంలో గులాబీ శ్రేణులు రెచ్చిపోతున్నారని ఆరోపించారు.

ధాన్యం సేకరణ అంశంపై షురూ

సరిగ్గా ఏడాది క్రితం ధాన్యం సేకరణ అంశంపై బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్దం మొదలైంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో పండిన ధాన్యాన్ని సేకరించడం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ సహా తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు ఆరోపించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రుల బృందం న్యూఢిల్లీ వెళ్ళి కేంద్ర మంత్రులను కోరి వచ్చింది. అయితే, తెలంగాణ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసమే ధాన్యం సేకరణ అంశాన్ని లేవనెత్తుతోందని, అన్ని రాష్ట్రాలలో సేకరించిన విధంగానే తెలంగాణలోను ధాన్యం సేకరణ జరుగుతోందని బీజేపీ నేతలు చెప్పుకొచ్చారు.  ఆ తర్వాత ధాన్యం సేకరణ అంశం కనుమరుగై కేంద్రం తెలంగాణ పట్ల వివక్ష ప్రదర్శిస్తుందన్న అంశం తెరమీదికి వచ్చింది.  ఇలా ఏడాది కాలంగా టీఆర్ఎస్ నేతలు బీజేపీనే తమ ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తూ రాజకీయ పోరాటం కొనసాగిస్తున్నారు. ఈక్రమంలో వచ్చిన మునుగోడు ఉప ఎన్నిక రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా చేసింది. ఓవైపు ఉప ఎన్నిక కొనసాగుతున్న తరుణంలోనే నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీలోకి లాగేందుకు ప్రయత్నించారంటూ ఇద్దరు స్వాములు, ఓ బిజినెస్‌మాన్‌లకు చెందిన వీడియోలు, ఆడియోలు లీకయ్యాయి. ఈ అంశంపై కేసీఆర్ భగ్గుమన్నారు. సుదీర్ఘ ప్రెస్ కాన్ఫరెన్సు పెట్టి బీజేపీ నేతలపై మండిపడ్డారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్‌హౌజ్‌లో జరిగిన వ్యవహారంపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సహా దేశంలోని అన్ని పార్టీలకు ఆ వీడియోలుపంపారు. ఆడియో రికార్డులను పంపారు. ఈ వ్యవహారంపై విచారణకు సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ సారథ్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించారు. ఈ సిట్ దర్యాప్తు హైకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో కొనసాగుతోంది. అటు కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐ కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ దర్యాప్తు పేరిట టీఆర్ఎస్ నేతల సన్నిహితులను విచారిస్తోంది. రాష్ట్ర దర్యాప్తు సంస్థలు బీజేపీ నేతలను టార్గెట్ చేస్తుంటే.. కేంద్ర దర్యాప్తు సంస్థలు టీఆర్ఎస్ నేతలే లక్ష్యంగా విచారణలు కొనసాగిస్తున్నాయి. ఈ విపరీత ధోరణి గతంలోను వున్నా ఇపుడు పతాక స్థాయికి చేరిందని చెప్పాలి.

దర్యాప్తు సంస్థల దూకుడు

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టయిన బోయినపల్లి అభిషేక్ రావు, ఆరోపణలు ఎదుర్కొంటున్న రామచంద్రన్ పిళ్ళై కవితకు సన్నిహితులంటూ ప్రచారం జరిగింది. లిక్కర్ స్కామ్‌లో కవిత పేరు కూడా జోరుగా ప్రచారం జరిగింది. అయితే, ఈ స్కామ్‌లో తన పేరు ప్రస్తావించకుండా ఆమె హైకోర్టు నుంచి ఇంజెక్షన్ తీసుకొచ్చారు. అయినా లిక్కర్ స్కామ్‌లో కవిత అరెస్టు ఖాయమంటూ కొన్ని మీడియా సంస్థలు ప్రచురిస్తూనే వున్నాయి. తాజాగా హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫ్లైట్‌లో లిక్కర్ స్కామ్ డబ్బులు ఢిల్లీకి తరలాయంటూ కథనాలు వచ్చాయి. ఓవైపు ఇదంతా కొనసాగుతుండగానే టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో కేసీఆర్ చేసిన కామెంట్లు కాకరేపాయి. బీజేపీ నేతలు ఏకంగా తన కూతురు కవితనే పార్టీ మారాటంటూ ఒత్తిడి తెచ్చారని కేసీఆర్ కామెంట్ చేశారు. దీనిపై అరవింద్ స్పందించారు. కవిత బీజేపీలోకి కాదు.. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళేందుకు యత్నిస్తున్నారని బాంబు పేల్చారు. ఈ కామెంట్‌పై సీరియస్ అయిన కవిత అరవింద్‌ను వెంటబడి తరుముతామని, ఎన్నికల్లో ఎక్కడ పోటీ చేసినా ఓడిస్తామని సవాల్ చేశారు. అదేసమయంలో జాగృతి శ్రేణులు అరవింద్ ఇంటిపై దాడికి దిగారు. తాజా పరిణామాలతో రెండు పార్టీల మధ్య చిచ్చు మరింత ముదిరినట్లయ్యింది. ఇది తరువాతి దశలో ఏ టర్న్ తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.