Bengaluru: ట్రాఫిక్ పోలీసులకు సవాల్ విసిరిన యువకుడు.. దెబ్బకు దిమ్మతిరిగే రిప్లై ఇచ్చారుగా..

|

Oct 22, 2022 | 8:45 AM

కొందరు వేసిన చలానాకు డబ్బులు కట్టేస్తుంటారు. అయితే మరికొందరు ఈ ట్రాఫిక్ చలానాల విషయంలోనే రోడ్డుపై ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగుతారు.

Bengaluru: ట్రాఫిక్ పోలీసులకు సవాల్ విసిరిన యువకుడు.. దెబ్బకు దిమ్మతిరిగే రిప్లై ఇచ్చారుగా..
Bengaluru Traffic Police
Follow us on

సాధారణంగా మనం హెల్మెట్ లేకుండా వాహనాన్ని రోడ్డెక్కిస్తే.. ట్రాఫిక్ పోలీసులు చలానా వేస్తుంటారు. రూల్స్‌లో భాగం కాబట్టి.. మరోసారి ఆ పొరపాటు జరగకుండా కొందరు వేసిన చలానాకు డబ్బులు కట్టేస్తుంటారు. అయితే మరికొందరు ఈ ట్రాఫిక్ చలానాల విషయంలోనే రోడ్డుపై ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగుతారు. సరిగ్గా బెంగళూరులో ఇదే తరహా ఘటన ఒకటి జరిగింది. హెల్మెట్ లేదని చలానా విధించిన ట్రాఫిక్ పోలీసులకు.. ఓ యువకుడు సవాల్ విసిరాడు. ‘హెల్మెట్ లేదంటారా.. అసలు మీ దగ్గర ప్రూఫ్ ఏది’ అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు. పోలీసులు ఏమైనా తక్కువ.. నిమిషాల్లోనే రిప్లై ఇచ్చారు.. వారి రిప్లయ్‌కి యువకుడి మైండ్ బ్లాంక్ అయింది.

ఇంతకీ అసలేం జరిగిందంటే.?

ఫెలిక్స్ రాజ్(ట్విట్టర్ ఖాతా పేరు) అనే యువకుడు హెల్మెట్ లేకుండా వాహనాన్ని నడపడంతో బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు అతడికి ఇటీవల చలానా విధించారు. అయితే ఆ యువకుడు జరిమానా విధించిన చలానా ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేసి ట్రాఫిక్ పోలీసులకు.. ఆ ఫోటోలో ఉన్నది తానేననడానికి ప్రూఫ్ ఏదంటూ సవాల్ విసిరాడు. ‘నేను హెల్మెట్ ధరించలేదనడానికి ఇందులో ఎలాంటి ఆధారం లేదు. కాబట్టి పూర్తి ఫోటో పంపించండి. లేదంటే కేసు తొలగించండి. ఇలాగే గతంలో జరిగితే.. నేను చలానా చెల్లించా. ఈసారి మాత్రం కట్టేదేలే’ అంటూ బెంగళూరు ట్రాఫిక్ పోలీసు, బెంగళూరు పోలీసులకు ట్యాగ్ చేసి తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు.

ఆ యువకుడు పోస్ట్ చేసిన ట్వీట్‌కు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు నిమిషాల్లో రిప్లయ్ ఇచ్చారు. సదరు యువకుడు హెల్మెట్ లేకుండా.. హెడ్‌సెట్ పెట్టుకుని వాహనాన్ని నడిపిన పూర్తి ఫోటోను అతడికి రీ-ట్వీట్‌గా పెట్టారు. పాపం.! పోలీసుల నుంచి ఇంత త్వరగా రిప్లయ్ వస్తుందనుకోలేదు సదరు యువకుడు.. దీనిపై స్పందిస్తూ.. ‘ఆధారంగా చూపించినందుకు ధన్యవాదాలు. ఓ పౌరుడిగా ఈ విషయాన్ని అడిగే హక్కు అందరికి ఉంది. దీనిపై స్పష్టత ఇచ్చిన బెంగళూరు ట్రాఫిక్ పోలీసులకు ధన్యవాదాలు. నేను జరిమానా చెల్లిస్తా’ అంటూ ట్వీట్ చేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి తొలుత చేసిన ట్వీట్‌ను డిలీట్ చేశాడు. అయితేనేం.. నెటిజన్లు మాత్రం ఒకవైపు సోషల్ మీడియా వేదికగా అతడ్ని ఓ ఆట ఆడేసుకుంటూ.. మరోవైపు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు స్పందించిన తీరును మెచ్చుకున్నారు.