King Cobra – East Godavari: పచ్చని పైర్లు, పైరగాలితో పరవశింపచేసే తూర్పుగోదావరి జిల్లాలో కింగ్ కోబ్రా కలవరపెట్టింది. ఒకటో.. రెండో, మూడో.. నాలుగో కాదు, ఏకంగా దాదాపు 15 అడుగుల పొడవుందీ కోబ్రా. జిల్లాలోని ప్రత్తిపాడు మండలం చింతలూరులో ఉన్న సరుగుడు(సరివి చెట్టు) తోట్లలో కింగ్ కోబ్రా సంచారం కనిపించింది.
ఇంతకు ముందెన్నడూ లేనిది ఒక్కసారిగా.. అదీ.. ఇంతపొడవున్న పాము కనిపించడంతో స్థానికులు, రైతులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. చింతలూరు గ్రామానికి చెందిన బొడ్డు లోవరాజు, సూరిబాబుల పొలాల్లో తిరుగుతున్న కోబ్రాను అక్కడున్న రైతులు తమ ఫోన్లో వీడియో తీయడంతో కింగ్ కోబ్రా సంచారం అందరికీ తెలియరావడమేకాదు, ఆ వీడియో చూసిన వాళ్లందరి ఒళ్లు గగుర్పాటుకు గురిచేస్తోంది.
అటవీ శాఖ అధికారులు తక్షణమే వచ్చి భారీ కోబ్రా పట్టుకొని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టాలని స్థానిక రైతులు కోరుతున్నారు.