Zomato: బాగా ఆకలివేస్తే వెంటనే ఫోన్ లో ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్ ఓపెన్ చేసి వెంటనే ఆర్డర్ పెట్టేస్తాం. అయితే మన నగరం లేదా పట్టణంలోని రెస్టారెంట్లలోనే అందుబాటులో ఉన్న ఫుడ్స్ ను ఆర్డర్ పెట్టుకోవచ్చు. కాని మనకు ఎంతో ఇష్టమైన ఆహారం వేరే రాష్ట్రంలో ఉంటే దానిని ఆర్డర్ పెట్టుకోవడం చాలా కష్టం. ఎవరైనా తెలిసినవారు ఆప్రాంతానికి వెళ్లినప్పుడు లేదా మనం వెళ్లినప్పుడో అక్కడి టెస్టీ ఫుడ్ ను టెస్ట్ చేస్తాం. కాని ఇప్పుడు దేశంలో వివిధ ప్రాంతాల్లో ఫేమస్ ఫుడ్ ను ఆర్డర్ చేసుకుంటే నిర్ణీత సమయంలో డెలీవరీ చేసే అదిరిపోయే ఆప్షన్ అందుబాటులోకి రానుంది. అదెంటో తెలుసుకోవాలనుకుంటే రీడ్ దిస్ స్టోరీ..
ఆహార ప్రియులకు ఇకపై దూరం అడ్డును తొలగిస్తామంటోంది జొమాటో. అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించే సర్వీసెస్ ను దేశీయ ఫుడ్ డెలివరీ దిగ్గజం సుసాధ్యం చేసి చూపిస్తానంటూ దానికి అవసమరమైన కార్యాచరణను సైతం ప్రారంభించింది. జొమాటో తాజాగా ఇంటర్‌సిటీ లెజెండ్స్ అనే కొత్త డెలివరీ సర్వీసును పరిచయం చేయబోతుంది. దీని ద్వారా ఇతర నగరాల్లో ఫేమస్ రెస్టారెంట్ల నుంచి వంటకాలను ఆర్డర్ చేసుకునే వెసులుబాటును భోజన ప్రియులకు కల్పిస్తుంది. డెలివరీ కొన్ని సందర్భాల్లో ఒక రోజు లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టవచ్చు. ప్రస్తుతానికి జొమాటో ఈ డెలివరీ ఎంపికను కేవలం గురుగ్రామ్, దక్షిణ ఢిల్లీ కస్టమర్లకు మాత్రమే పరిమితం చేస్తోంది. త్వరలో ఇతర నగరాలకు విస్తరించనుంది.
కొత్త సర్వీస్ ద్వారా కస్టమర్లు జైపూర్ నుంచి కచోరీ, కోల్‌కతా నుంచి కాల్చిన రోసోగొల్లాస్, హైదరాబాద్ నుంచి బిర్యానీ, బెంగళూరు నుంచి మైసూర్ పాక్, లక్నో నుంచి కబాబ్‌లు, ఓల్డ్ ఢిల్లీ నుంచి బటర్ చికెన్ ఇలా ఆయా ప్రాంతాల్లో ఫేమస్ వంటకాలను ఆర్డర్ చేసి ఆస్వాధించడానికి వెసులుబాటు కల్పించనుంది. ప్రస్తుతం ఈ జాబితాలో కోల్‌కతా, హైదరాబాద్, లఖ్నో, జైపూర్, బెంగళూరు, మధుర, చెన్నై, ఆగ్రా, భువనేశ్వర్ నుంచి కస్టమర్లు ఇష్టమైన ఫుడ్స్ ఆర్డర్ చేసుకోవచ్చు.
సేవలు ప్రారంభమైన నగరాల్లో కేవలం ఎంపిక చేసిన కొన్నింటికే ఈ అవకాశాన్ని జొమాటో అందిస్తోంది. లఖ్నోలో కేవలం ఏడు రెస్టారెంట్లు మాత్రమే ఈసేవలు అందించే జాబితాలో ఉన్నాయి. ఇతర నగరాలకు ఆహారాన్ని విమానం ద్వారా పంపిస్తారు. రెస్టారెంట్ తాజాగా ఆహారాన్ని సిద్ధం చేసిన తరువాత.. సురక్షితంగా రవాణా చేసేందుకు రీయూజబుల్, ట్యాంపర్ ఫ్రూఫ్ కంటైనర్లలో ప్యాక్ చేస్తారు. ఆహారం చెడిపోకుండా ఉంచేందుకు అత్యాధునిక మొబైల్ శీతలీకరణ సాంకేతికతను వినియోగించనున్నారు. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కలపబోమని కంపెనీ వెల్లడించింది. కస్టమర్లు ఆహారాన్ని అందుకున్న తరువాత మైక్రోవేవ్, ఎయిర్-ఫ్రై లేదా పాన్-ఫ్రై వినియోగించి హాట్ గా సర్వ్ చేసుకోవచ్చని కంపెనీ వెల్లడించింది.