MP Vijayasai Reddy: ఆంధ్రప్రదేశ్ కోణంలో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్.. చెత్త బడ్జెట్ అని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ వి. విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. రాజ్యసభలో బుధవారం కేంద్ర బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఎంపీ విజయసాయి రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశ పరిచిందని అసంతృప్తి వ్యక్తంచేశారు. కేంద్ర బడ్జెట్‌లో ఎలాంటి పస లేదన్నారు. ఆత్మ నిర్భరత కేంద్రానికే కాదు రాష్ట్రాలకూ అవసరమేనని స్పష్టం చేశారు. సెస్‌లు, సర్‌ఛార్జ్‌ల పేరుతో రాష్ట్రాల పన్ను వాటా తగ్గించారని తెలిపారు. పెట్రోల్ విషయంలో ట్యాక్స్ వాటా 40 శాతం తగ్గిందని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌కు ఈ బడ్జెట్ పరమ అధ్వాన్నంగా ఉందన్నారు. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్న చందంగా కేంద్ర బడ్జెట్ ఉందని కామెంట్ చేశారు. ఆత్మ నిర్భర భారత్ అంటున్న కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రాల ఆత్మ నిర్భరత అవసరం లేదా ? అంటూ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా సెస్, సర్ చార్జీలు పెంచుతోందన్నారు. రాష్ట్రాలకు పన్నుల వాటా పంచకుండా ఇలా కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
15వ ఆర్థిక సంఘం 41 శాతం పన్నుల వాటా రాష్ట్రాలకు పంచాలని సిఫారసు చేసిందని గుర్తు చేశారు. కానీ సేస్, సర్చార్జీల వల్ల రాష్ట్రాలకు దక్కుతున్నది 29శాతం మాత్రమే అన్నారు. కేంద్రం నుంచి పన్నుల వాటా ఏపీకి ఏడాదికేడాది తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏపీపై సవతి తల్లి ప్రేమ కనబరుస్తోందన్నారు.
రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రసంగం..
ఆర్థిక సంఘం ఫార్ములా వల్ల జనాభా నియంత్రించని రాష్ట్రాలు ప్రయోజనం పొందుతున్నాయన్నారు. జనాభా నియంత్రించిన రాష్ట్రాలు నష్టపోతున్నాయన్నారు. 2010-2015 మధ్య ఏపీ షేర్ 6.9 శాతం కాగా, 2015-2020 నాటికి ఏపీ పన్నుల వాటా 4.3 శాతానికి పడిపోయిందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. వ్యవసాయంపై ఏపీ ప్రభుత్వం 5.9 శాతం నిధులు వెచ్చిస్తోందని తెలిపారు. కానీ, కేంద్రం వెచ్చిస్తోంది 3.9 శాతం మాత్రమేనని చెప్పారు. విద్య కోసం ఏపీ 11.8 శాతం ఖర్చుచేస్తుంటే కేంద్రం 2.6 శాతం ఖర్చు చేస్తోందని తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల్లోనూ కేంద్రం కంటే రాష్ట్రామే ఎక్కువ ఖర్చు చేస్తోందని చెప్పారు. ఏపీ ప్రభుత్వంపై కేంద్రం సవతి ప్రేమ చూపిస్తోందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.
ఏపి విభజన చట్టంలో పెండింగ్ సమస్యలను ఇంకా పరిష్కరించలేదని విజయసాయి రెడ్డి అన్నారు. కేంద్రం విద్యాసంస్థలన్నీ అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయన్నారు. లోపభూయిష్టంగా కాంగ్రెస్ విభజనచట్టం చేస్తే దానిని బీజేపీ ప్రభుత్వం అడ్వాంటేజీగా తీసుకుందన్నారు. ఏపీపై సవతి తల్లి ప్రేమ చూపించడమే కాకుండా రాష్ట్ర బీజేపీ మమ్మల్ని విమర్శిస్తోందన్నారు. రాష్ట్రాల విషయంలో కేంద్రానిది – నో సబ్ కా సాత్, నో వికాస్ , నో విశ్వాస్, నో ప్రయాస్ అన్నారు.
ఇవి కూడా చదవండి: Trekker Stuck: మృత్యుంజయుడు.. చావుకు, బతుక్కి మధ్య 40 గంటల పోరాటం.. పాలక్కడ్ కొండల్లో చిక్కుకున్న ట్రెక్కర్ సేఫ్
NRI Marriage: ప్రియుడికి వేరొకరితో నిశ్చితార్థం.. రష్యా నుంచి వచ్చిన ప్రియురాలు.. చివరికి..?