Unemployment in India: ‘ప్రపంచ దేశాలతో పోల్చితే భారత్‌లో నిరుద్యోగ రేటు చాలా తక్కువ’.. కేంద్ర మంత్రి వెల్లడి

|

Nov 29, 2024 | 11:38 AM

ప్రపంచ దేశాలతో పోల్చితే మన దేశంలో నిరుద్యోగ రేటు చాలా తక్కువగా ఉందని, యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు తమ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కల్పిస్తుందని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే లోక్‌సభలో వెల్లడించారు..

Unemployment in India: ప్రపంచ దేశాలతో పోల్చితే భారత్‌లో నిరుద్యోగ రేటు చాలా తక్కువ.. కేంద్ర మంత్రి వెల్లడి
Unemployment Rate In India
Follow us on

న్యూఢిల్లీ, నవంబర్‌ 29: దేశంలో నిరుద్యోగ రేటు తక్కువగా ఉందని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే లోక్‌సభకు తెలియజేశారు. 2023-24లో భారతదేశంలో యువత నిరుద్యోగిత రేటు 10.2 శాతంగా ఉందని, ఈ రేటు ప్రపంచ దేశాలతో పోల్చితే తక్కువగా ఉంది పేర్కొన్నారు. ఈ మేరకు నవంబర్ 25న లోక్‌సభలో మంత్రి శోభా కరంద్లాజే రాతపూర్వక సమాధానంలో వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి ఉపాధి, నిరుద్యోగ గణాంకాల వివరాలు వెల్లడిస్తూ..

పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS) మన దేశంలో ఉపాధి, నిరుద్యోగ యువతకు సంబంధించిన అధికారిక గణాంకాలను వెల్లడిస్తుంది. ఈ నివేదిక ప్రకారం.. 2023-24 సంవత్సరానికి దేశంలో 15-29 ఏళ్ల మధ్య వయస్సున్న యువతకు నిరుద్యోగిత రేటు 10.2 శాతంగా ఉంది. ఇది ప్రపంచ స్థాయి కంటే తక్కువగా ఉంది. వర్కర్ పాపులేషన్ రేషియో (WPR) సూచిలో.. 2017-18లో 31.4 శాతం నుంచి 2023-24లో 41.7 శాతానికి యువత ఉపాధి పెరిగింది. స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ (MoSPI) నిర్వహించిన వార్షిక సర్వే ఆధారంగా PLFS నివేదికను రూపొందిస్తారు.

ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ILO)కి చెందిన గ్లోబల్ రిపోర్ట్ ట్రెండ్స్ ఫర్ యూత్.. 2021, 2022లో ప్రపంచవ్యాప్తంగా యువత నిరుద్యోగిత రేటు 15.6 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ఇక 2024లో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వెలువరించిన ప్రపంచ ఉపాధి, సామాజిక ఔట్‌లుక్ ట్రెండ్స్ ప్రకారం.. యువత నిరుద్యోగం రేటు ప్రపంచవ్యాప్తంగా 13.3 శాతానికి తగ్గినట్లు పేర్కొంది. మరోవైపు EPFO పేరోల్ డేటా కూడా ఇదే విషయాన్ని చెబుతుంది. 2023-24లో 1.3 కోట్ల మంది EPFOలో చేరినట్లు వెల్లడించింది. సెప్టెంబరు 2017 – ఆగస్టు 2024 మధ్య దేశ వ్యాప్తంగా 7.03 కోట్లకు పైగా ఉద్యోగులు EPFOలో చేరినట్లు పేర్కొంది. ఈ గణాంకాలు దేశంలో ఉపాధి పెరుగుదలను సూచిస్తున్నాయి. ఉపాధి కల్పనతో పాటు ఉపాధిని మెరుగుపరచడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, తదనుగుణంగా కేంద్రం దేశంలో ఉపాధి కల్పన కోసం పలు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి శోభా కరంద్లాజే పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.