Yogi Adityanath on Asaduddin Owaisi Attack: ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కాన్వాయ్‌పై కాల్పులు జరిగిన సంఘటన దేశంలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓవైసీ మిరట్ నుంచి ఢిల్లీకి వెళుతుండగా గురువారం అసదుద్దీన్ ఓవైసీ కాన్వాయ్‌పై ఛాజర్సీ టోల్‌గేట్ వద్ద నిందితులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) ప్రాణాలతో క్షేమంగా బయటపడ్డారు. కాగా.. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) స్పందించారు. ఒవైసీ వాహనంపై దాడి ఆమోదయోగ్యం కాదంటూ సీఎం యోగి.. ఈ దాడి ఘటనను ఖండించారు. అసదుద్దీన్ ఒవైసీ వాహనంపై కాల్పులు జరపడం సహించరానిది.. ఆమోదయోగ్యం కాదని అభిప్రాయపడ్డారు. అసద్ కాన్వాయ్‌పై దాడిని ఖండిస్తూనే.. ఎన్నికల ప్రసంగాలలో మతపరమైన మనోభావాలను దెబ్బతీయకుండా నాయకులు జాగ్రత్తగా ఉండాలని ఆదిత్యనాథ్ సూచించారు. యూపీ ఎన్నికల్లో (UP Election 2022) భాగంగా గోరఖ్‌పూర్ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన అనంతరం నెట్‌వర్క్ 18 గ్రూప్ ఎడిటర్-ఇన్-చీఫ్ రాహుల్ జోషికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్.. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు సహా పలు విషయాలపై మాట్లాడారు. ‘డబుల్ ఇంజన్’ ప్రభుత్వం యూపీలో పూర్తి మెజారిటీతో గెలుస్తుందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ ప్రభుత్వంలో మహిళలు, పిల్లలు, అన్ని వర్గాల ప్రజలు లబ్ధి పొందారని పేర్కొన్నారు. ఈ ఎన్నికల (UP Assembly polls 2022) లో 80:20 నిష్పత్తిలో సీట్లు గెలుస్తామని పేర్కొన్నారు. బీజేపీకి 80శాతం సీట్లు, ఇతర పార్టీలకు 20 శాతం సీట్లు వస్తాయన్నారు. భారతీయ జనతా పార్టీ ‘డబుల్ ఇంజిన్’ ప్రభుత్వానికి ఈసారి 300 కంటే ఎక్కువ ఓట్లు వస్తాయని అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదని అభిప్రాయపడ్డారు.
బుల్లెట్‌పై కాకుండా బ్యాలెట్‌పై నమ్మకం ఉంచాం..
ప్రజాస్వామ్యంలో.. మేము బ్యాలెట్‌ని నమ్ముతాం.. బుల్లెట్‌ను కాదంటూ యోగి పేర్కొన్నారు. ఓవైసీపై దాడి ఘటనను ప్రస్తావిస్తూ.. ఈ రకమైన సంఘటన సహించరానిది.. ఆమోదయోగ్యం కాదు. మాకు.. వారి మధ్య సైద్ధాంతిక విభేదాలు ఉన్నాయి. కానీ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడానికి ఎవరినీ ప్రభుత్వం అనుమతించదు. దాడికి పాల్పడిన వారిపై పోలీసులు వేగంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు ముఖ్యమంత్రి యోగి అన్నారు. అయితే, రాజకీయ నేతలు ఎన్నికల ప్రసంగాలు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని.. ఇవన్నీ గుర్తుంచుకోవాలని ఆదిత్యనాథ్ సూచించారు. ప్రసంగాలు చేసేటప్పుడు ఏ వర్గం వారి మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాలని అన్ని రాజకీయ పార్టీలకు యోగి విజ్ఞప్తి చేశారు. ఓటు బ్యాంకు కోసం.. ప్రజల విశ్వాసంతో ఆటలాడుకోవద్దంటూ సూచించారు.
కాంగ్రెస్-ఎస్పీ మ్యాచ్ ఫిక్సింగ్..
సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్‌పై సీఎం యోగి మాట్లాడుతూ.. తాము జాతీయవాదం గురించి మాట్లాడుతామని.. కానీ వారు కులాల గురించి మాట్లాడుతారని.. తాము అభివృద్ధి గురించి ఆలోచిస్తే.. వారు వారి కుటుంబం గురించి ఆలోచిస్తారంటూ పేర్కొన్నారు. టీకెట్ల పంపిణీ విషయంలో బీజేపీతో ఇతర పార్టీలతో పోల్చి చూస్తే.. ఎస్పీ, బీఎస్పీ తదితర పార్టీలు రౌడీషీటర్లకు టిక్కెట్లు ఇచ్చాయని యోగి పేర్కొన్నారు. ఎస్పీ, కాంగ్రెస్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందంటూ యోగి ఆరోపించారు. అందుకే అఖిలేష్ యాదవ్, శివపాల్ యాదవ్‌లపై కాంగ్రెస్ అభ్యర్థులను నిలబెట్టడం లేదని ముఖ్యమంత్రి యోగి అన్నారు.
ఎస్పీ – ఆర్‌ఎల్డీ పొత్తుపై
ఎస్పీ – ఆర్‌ఎల్డీ పొత్తుపై మాట్లాడుతూ.. ఆర్‌ఎల్‌డీ అధినేత జయంత్ చౌదరి మంచి వ్యక్తి కావచ్చు.. కానీ తప్పుడు పార్టీతో పొత్తు పెట్టుకున్నారంటూ యోగి పేర్కొన్నారు. చౌదరి చరణ్ సింగ్ తాము గౌరవిస్తామని.. పశ్చిమ యూపీని ఆయన అభివృద్ధి చేసినంతగా ఎవరూ చేయలేదన్నారు. కానీ జయంత్ తన తాత వారసత్వాన్ని తగిన విధంగా ముందుకు తీసుకెళ్లడం లేదన్నారు. కైరానా వలసల గురించి మాట్లాడుతూ.. కైరానా వలసలను ఎవరూ క్షమించరని అభిప్రాయపడ్డారు. అజం ఖాన్, అతిక్ అహ్మద్, ముఖ్తార్ అన్సారీల గురించి ప్రస్తావిస్తూ.. హింసకు ఆజ్యం పోసే వ్యక్తులపై, నేరస్థులపై చర్య తీసుకోవడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని.. తాము అదే చేస్తున్నామని సీఎం యోగి పేర్కొన్నారు.
తొలిసారిగా అసెంబ్లీ బరిలో యోగి..
కాగా.. యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో గోరఖ్‌పూర్ అర్బన్ అసెంబ్లీ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఐదుసార్లు లోక్‌సభ ఎంపీగా ఎన్నికైన సీఎం యోగి.. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేయడం ఇదే తొలిసారి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మొత్తం ఏడు దశల్లో జరగనున్నాయి. 10 ఫిబ్రవరి (గురువారం), 14, 20, 23, 27, మార్చి 3, 7 తేదీలో జరగనున్నాయి. ఎన్నికల అనంతరం మార్చి 10న ఉత్తరప్రదేశ్ సహా నాలుగు ఇతర ఎన్నికలు జరిగే రాష్ట్రాలైన పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ ఫలితాలు విడుదల కానున్నాయి.
Also Read: