పేకాట క్లబ్బులపై యానాం ప్రజలు తిరగబడ్డారు. పేకాట క్లబ్బులను వెంటనే మూసివేయాలంటూ ధర్నాకు దిగారు. వందలాదిగా చేరుకున్న మహిళలు పేకాట వద్దు.. యానాం ముద్దు అంటూ నినాదాలు చేశారు. స్కూళ్లు, ఇళ్ల నడుమ పేకాట క్లబ్బుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన చెందారు. విద్యార్థులు పేకాటకు ఆకర్షితులై భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆందోళనకు దిగారు. మెట్టకుర్రులోని శ్రీలక్ష్మి గణేశ్ రైస్ మిల్లులో రిక్రియేషన్ పేరుతో నిర్వహిస్తున్న పేకాట క్లబ్బును తక్షణమే మూసివేయాలని డిమాండ్ చేశారు. నివాసప్రాంతాల్లో పేకాట క్లబ్బులకు పర్మిషన్ ఇవ్వడంపై మండిపడుతున్నారు స్థానికులు. క్లబ్బును వెంటనే మూసివేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆందోళనలో రామన్నకోడు, పిషర్‌మెన్‌పేట, రమాబాయి నగర్, వంశీకృష్ణ కాలనీ, ఆంధ్రపేట ప్రాంత ప్రజలు భారీసంఖ్యలో పాల్గొన్నారు.
అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పేకాట కేంద్రాలు మళ్లీ జోరందుకున్నాయి. పక్క రాష్ట్రాల్లో ఆడితే ఇబ్బందేంటని భావించిన పేకాట నిర్వాహకులు ఏకంగా అక్కడ భూములు కొనుగోలు చేసి క్లబ్బులుగా మార్చేశారు. చీమ చిటుక్కుమన్నా తెలిసిపోయేలా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసుకుని మరీ దందా సాగిస్తున్నారు. వారంలో మూడు రోజులు పేకాట రాయుళ్లకు అన్ని రకాల వసతులు కల్పించి లక్షల్లో కమిషన్ పేరిట దోచుకుంటున్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో జరుగుతున్న పేకాట వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
నెల రోజులుగా యానంలో ఇదే జరుగుతోంది. యానాం నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గుట్టుచప్పుడు కాకుండా రీక్రియేషన్ క్లబ్బుల పేరుతో పేకాట నిర్వహిస్తున్న క్లబ్బులపై దాడులు చేశారు యానాం పోలీసులు. దాడులు చేసేందుకు వచ్చిన పోలీసులను క్లబ్బు లోకి రాకుండా అడ్డుకునేందుకు సతవిధాల ప్రయత్నించారు నిర్వాహకులు. ఈసీన్ లో క్లబ్బు నిర్వాహకులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం ఉద్రిక్తతకు దారితీసింది. ఎట్టకేలకు క్లబ్బులోకి ప్రవేశించిన పోలీసులు అక్కడ జరుగున్న విషయాలను బట్టబయలు చేశారు.
ఇప్పటికే ఆన్ లైన్ రమ్మీని బ్యాన్ చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఇటీవలే తమిళనాడు ప్రభుత్వం కూడా రాష్ట్రంలో ఆన్లైన్ రమ్మీని నిషేదిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీలో బిల్లు కూడా ప్రవేశపెట్టారు. ఇదే క్రమంలో పుదుచ్చేరి అసెంబ్లీ కూడా ఆన్లైన్ రమ్మీని బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంటుందని ఆ రాష్ట్ర హోం మంత్రి నమశ్శివాయ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే.. కొందరు పేకాట క్లబ్బుల పేర్లు మార్చారు.. రీక్రియేషన్ క్లబ్బుల పేరుతో పేకాట దందాకు తెరలేపారు. ఇలాంటి క్లాబ్బులను పోలీసులు టార్గెట్ చేసినా.. నిర్వాహకులు పట్టించుకోకపోవడంతో స్థానిక మహిళలు కదం తొక్కారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం