హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రతిష్టను దిగజార్చే, లేదా దీన్ని షిఫ్ట్ చేసే ప్రయత్నాలను తాము సహించబోమని మహారాష్ట్ర సీఎం ఉధ్ధవ్ థాక్రే ప్రకటించారు. ముంబై కేవలం దేశ వాణిజ్య రాజధాని మాత్రమే కాదని, ఎంటర్ టైన్ మెంట్ కేపిటల్ అని ఆయన అన్నారు. గురువారం సినీ థియేటర్ల యజమానులతో సమావేశమైన ఆయన.. ప్రపంచ వ్యాప్తంగా బాలీవుడ్ కి మంచి పేరు ఉందన్నారు. ఇది ఎంతోమందికి ఉపాధి కల్పిస్తోందన్నారు. అయితే కొన్ని రోజులుగా కొన్ని శక్తులు ఈ ఇమేజిని భంగపరచజూస్తున్నాయని, కానీ వాటి ఆటలు సాగనివ్వబోమని చెప్పారు. సుశాంత్ కేసులో బాలీవుడ్ పై కొందరు ఆరోపణలు చేసిన నేపథ్యంలో థాక్రే ఇలా వ్యాఖ్యానించారు. ఇక నోయిడాలో భారీ ఫిల్మ్ సిటీని ఏర్పాటు చేస్తామని యూపీ ప్రభుత్వం ఈ మధ్య ప్రకటించింది.