
మొదటి భర్త బతికుండగానే అతనికి చట్టబద్ధంగా విడాకులు ఇవ్వకుండా మరో వ్యక్తిని వివాహం చేసుకున్న మహిళలకు సంబంధించి అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పును ఇచ్చింది. అలాంటి మహిళలకు రెండో భర్త నుండి భరణం పొందే హక్కు లేదని కోర్టు స్పష్టం చేసింది. విడాకులు తీసుకోకుండా చేసే రెండో పెళ్లికి చట్టబద్ధమైన భార్య అనే హోదా దక్కదని, అందువల్ల ఆమె రెండో భర్త నుండి ఎలాంటి భరణాన్ని డిమాండ్ చేయలేరని న్యాయస్థానం తేల్చిచెప్పింది. జస్టిస్ అచల్ సచ్‌దేవ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన పాత ఆర్డర్‌ను రద్దు చేస్తూ ఈ సంచలన తీర్పును ఇచ్చింది.
కోర్టు తీర్పు ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక మహిళ 2006 జూన్ 10న సంతోష్ కుమార్ అనే వ్యక్తిని హిందూ సాంప్రదాయాల ప్రకారం రెండో వివాహం చేసుకుంది. అయితే సంతోష్‌తో పెళ్లి జరిగే సమయానికి ఆమె తన మొదటి భర్తకు విడాకులు ఇవ్వలేదు. ఆ తర్వాత సంతోష్, ఈ మహిళ భార్యాభర్తలుగా కలిసి జీవించారు. వీరికి ఒక కూతురు కూడా జన్మించింది. కొన్నేళ్ల తర్వాత సంతోష్ తనను, తన కూతురిని వేధిస్తున్నాడని.. నెలకు రూ.18 నుండి 20 వేలు సంపాదిస్తున్నా తమకు తిండి, ఖర్చులు పెట్టడం లేదని సదరు మహిళ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 125 కింద భరణం కావాలంటూ చిత్రకూట్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. ఆగస్టు 2025లో ఈ కేసును విచారించిన ఫ్యామిలీ కోర్టు.. సంతోష్ కుమార్ సదరు మహిళకు నెలకు రూ.2000, అలాగే కూతురికి నెలకు రూ.1,000 భరణం చెల్లించాలని ఆదేశించింది.
ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సంతోష్ కుమార్ అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ అచల్ సచ్‌దేవ్.. కింది కోర్టు రికార్డులను పరిశీలించారు. మొదటి భర్త బతికుండగానే, విడాకులు తీసుకోకుండా సంతోష్‌తో కలిసి జీవించినందున సదరు మహిళ చట్టబద్ధమైన భార్య అనే నిర్వచనం పరిధిలోకి రాదని హైకోర్టు స్పష్టం చేసింది. కింది కోర్టు మహిళకు భరణం మంజూరు చేసి తప్పు చేసిందని పేర్కొంటూ, ఆమెకు భరణం ఇచ్చే ఆదేశాలను రద్దు చేసింది.
అయితే భార్యకు భరణం రద్దయినప్పటికీ.. డిఎన్ఏ నివేదికల ప్రకారం ఆ ఎనిమిదేళ్ల బాలికకు సంతోష్ కుమారే బయోలాజికల్ తండ్రి అని నిరూపితమైంది. అందువల్ల తండ్రిగా కూతురిని పోషించాల్సిన బాధ్యత సంతోష్‌పై ఉంటుందని, బాలికకు నెలకు రూ.1000 భరణం ఇచ్చే ఆదేశాలను హైకోర్టు సమర్థించింది.
భారతదేశంలో భార్య, పిల్లలు, వృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ కోసం CrPC సెక్షన్ 125 భరణం పొందే హక్కును కల్పిస్తుంది. ఈ చట్టం ప్రకారం.. ఒక పురుషుడు తనపై ఆధారపడిన భార్య, పిల్లలు లేదా తల్లిదండ్రులను వదిలేస్తే వారికి నెలవారీ భరణం చెల్లించాల్సి ఉంటుంది. అయితే భార్యకు భరణం దక్కాలంటే ఆమె చట్టబద్ధమైన భార్య అయి ఉండాలి. ఎలాంటి సరైన కారణం లేకుండా భర్తకు దూరంగా ఉన్నా, లేదా మరో పురుషుడితో వివాహేతర బంధంలో ఉన్నా, లేక పరస్పర అంగీకారంతో విడిపోయినా ఈ సెక్షన్ కింద మహిళకు భరణం పొందే అర్హత ఉండదు.