Rajasthan Polls 2023: కాంగ్రెస్, బీజేపీలో టెన్షన్.. టెన్షన్.. రాజస్థాన్ రికార్డ్ బ్రేకింగ్ ఓటింగ్ దేనికి సంకేతం..?

ఎన్నికల్లో ఫలితాలను అంచనా వేసే క్రమంలో పోలింగ్ శాతం కూడా ఒక అంశంగా మారుతుంది. గతం కంటే ఎక్కువ పోలింగ్ శాతం నమోదైందంటే.. అది ప్రభుత్వ మార్పునకు సంకేతం అని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. తక్కువ పోలింగ్ శాతం నమోదైతే ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపలేదని, అంటే అప్పటి వరకు ఉన్న ప్రభుత్వమే కొనసాగే అవకాశం ఉంటుందని అంచనాలు వేస్తుంటారు. ఇప్పుడు రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన రికార్డ్ బ్రేకింగ్ పోలింగ్ శాతం రాజకీయ విశ్లేషకులకు పనిపెట్టింది.

Rajasthan Polls 2023: కాంగ్రెస్, బీజేపీలో టెన్షన్.. టెన్షన్.. రాజస్థాన్ రికార్డ్ బ్రేకింగ్ ఓటింగ్ దేనికి సంకేతం..?
Rajasthan Polls 2023

Edited By:

Updated on: Nov 27, 2023 | 1:15 PM

ఎన్నికల్లో ఫలితాలను అంచనా వేసే క్రమంలో పోలింగ్ శాతం కూడా ఒక అంశంగా మారుతుంది. గతం కంటే ఎక్కువ పోలింగ్ శాతం నమోదైందంటే.. అది ప్రభుత్వ మార్పునకు సంకేతం అని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. తక్కువ పోలింగ్ శాతం నమోదైతే ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపలేదని, అంటే అప్పటి వరకు ఉన్న ప్రభుత్వమే కొనసాగే అవకాశం ఉంటుందని అంచనాలు వేస్తుంటారు. ఇప్పుడు రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన రికార్డ్ బ్రేకింగ్ పోలింగ్ శాతం రాజకీయ విశ్లేషకులకు పనిపెట్టింది.

ఈ నెల 25న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పోలింగ్ జరిగింది. మొత్తం 200 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రాల్లో ఒక నియోజకవర్గం మినహా మిగతా 199 నియోజకవర్గాలకు ఓటింగ్ జరగగా.. ఈసారి పోలింగ్ శాతం 74.96 అని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. అయితే తుది గణాంకాలు విడుదయ్యేసరికి మరికాస్త పెరిగే అవకాశం ఉంది. 2018లో నమోదైన 74.72 శాతం కంటే స్వల్పంగా ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. 2013లో నమోదైన 75.67 శాతంతో పోల్చితే ఈ సంఖ్య తక్కువే. మొత్తంగా ఈ ఏడాది నమోదైన పోలింగ్ శాతం తుది గణాంకాలు వచ్చేసరికి 2013 నాటి పోలింగ్ శాతాన్ని మించిపోతుందని అంచనా వేస్తున్నారు. ఏదేమైనా ఈ పోలింగ్ శాతం దేనికి సంకేతం అన్నదే ఇప్పుడు రాజకీయ విశ్లేషకుల ముందున్న ప్రశ్న.

పోలింగ్ శాతమే కీలకం

రాజస్థాన్‌లో గత మూడు దశాబ్దాల నుంచి అధికారం కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మధ్య ప్రతి ఐదేళ్లకు మారుతూ వస్తోంది. ఎప్పుడైతే గతం కంటే ఎక్కువ పోలింగ్ నమోదవుతుందో అప్పుడు బీజేపీ గెలిచింది. గతం కంటే తక్కువ పోలింగ్ శాతం నమోదైతే అప్పుడు కాంగ్రెస్ గెలిచింది. 1998 నుంచి ఓసారి గణాంకాలను పరిశీలిస్తే ఆ ఎన్నికల్లో 63.39 శాతం పోలింగ్ నమోదవగా.. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2003లో పోలింగ్ శాతం పెరిగి 67.18కు చేరుకుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. 2008కి వచ్చేసరికి పోలింగ్ శాతం కాస్త తగ్గి 66.25 నమోదైంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందింది. 2013లో ఏకంగా 75.67 శాతం ఓటింగ్ నమోదవగా బీజేపీ బంపర్ మెజారిటీతో విజయం సాధించింది. 2018లో అది స్వల్పంగా తగ్గి 74.72గా నమోదవగా.. ఈ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పూర్తి మెజారిటీ కాంగ్రెస్ సాధించలేకపోయినా.. బీఎస్పీ, స్వతంత్రుల మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు నమోదైన ఓటింగ్ శాతం 2018 నాటి ఓటింగ్ శాతాన్ని దాటింది. అంటే ఈ ఆనవాయితీ కొనసాగితే ఈసారి బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు కొనసాగుతూ వచ్చిన ట్రెండ్.. 3-4 శాతం ఓటింగ్ పెరిగిన ప్రతిసారీ బీజేపీ గెలవగా.. 1 శాతం పోలింగ్ తగ్గినా కాంగ్రెస్ గెలుస్తూ వచ్చింది.

రాష్ట్రవ్యాప్తంగా నమోదైన పోలింగ్ శాతాల్లోనూ ఏకరూపత లేదు. కొన్ని జిల్లాల్లో అత్యధికంగా 80 శాతానికి పైగా పోలింగ్ నమోదవగా.. కొన్ని జిల్లాల్లో 70 శాతం కంటే తక్కువగా నమోదైంది.

ఓటింగ్ శాతంలో మొదటి 5 స్థానాల్లో ఉన్న జిల్లాలు:

  • జైసల్మేర్: 82.32 శాతం
  • ప్రతాప్‌గఢ్: 82.07 శాతం
  • బన్స్వారా: 81.36 శాతం
  • హనుమాన్‌గర్: 81.30 శాతం
  • ఝలావర్: 80.24 శాతం

ఓటింగ్‌లో దిగువన ఉన్న 5 జిల్లాలు:

  • పాలీ: 65.12 శాతం
  • సిరోహి: 66.92 శాతం
  • కరౌలి: 68.38 శాతం
  • జాలోర్: 69.56 శాతం
  • సవాయ్ మాధోపూర్: 69.91 శాతం (తుది గణాంకాలు లెక్కించకముందు)

మార్వార్ జంక్షన్‌లో అత్యల్పంగా 61.10 శాతం ఓటింగ్ నమోదైంది. సీఎం అశోక్ గెహ్లాట్, మాజీ సీఎం వసుంధర రాజే పోటీ చేసిన నియోజకవర్గాల్లో కూడా తక్కువ ఓటింగ్ నమోదైంది. ఇదిలా ఉంటే బీజేపీ తరఫున సీఎం రేసులో పేర్లు వినిపిస్తున్న రాజేంద్ర రాథోడ్, గోవింద్ సింగ్ దోటసార పోటీ చేస్తున్న స్థానాల్లో ఓటింగ్ శాతం పెరిగింది. కొన్ని గ్రామాల్లో ఒక్క ఓటు కూడా నమోదు కాలేదు. బరాన్‌లోని దేవ్‌పురియా, కలుఖేడా గ్రామాల్లో తమకు కనీస వసతులైన రోడ్లు, కరెంటు, మంచినీరు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గ్రామస్థులు ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించారు. అధికారులు ఎంతగా నచ్చజెప్పే ప్రయత్నం చేసినా సరే ఒక్క ఓటర్ కూడా ముందుకు రాలేదు.

సీఎం వర్సెస్ పీఎం

రాజస్థాన్‌లో ఈసారి ఎన్నికల్లో ఓ ప్రత్యేక పరిస్థితిని ఏర్పడింది. ఎన్నికల ప్రచారంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి పోటీపడడం సాధారణంగా జరిగేదే. గత కొన్ని దశాబ్దాలుగా అశోక్ గెహ్లాట్, వసుంధర రాజే మధ్య ఇదే జరుగుతూ వచ్చింది. కానీ ఈసారి బీజేపీ జాతీయ నాయకత్వం మాజీ సీఎం వసుంధర రాజేను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎక్కడా ప్రకటించలేదు. పైపెచ్చు ఆమె పేరును ముందే ప్రకటిస్తే ఆమెపై ఉన్న వ్యతిరేకత తమకు చేటు చేస్తుందని కూడా భయపడింది. అదే సమయంలో సీఎం రేసులో ఇంకా చాలామంది నేతలు ఉన్నారన్న సంకేతాలు కూడా ఇచ్చింది. ఇక ప్రచారపర్వంలో అశోక్ గెహ్లాట్‌ను ఢీకొట్టే బాధ్యతను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భుజానికెత్తుకున్నారు. దీంతో ఎన్నికల ప్రచారం కాస్తా సీఎం వర్సెస్ మాజీ సీఎం అవ్వాల్సిన చోట సీఎం వర్సెస్ పీఎంగా మారింది.

హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో ఓటర్లు రాష్ట్రం, కేంద్రం విషయంలో భిన్నమైన వైఖరిని ప్రదర్శిస్తూ వస్తున్నారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి వరకు బీజేపీ అధికారంలో ఉన్న చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఓటమిపాలైంది. కానీ కొద్ది నెలల వ్యవధిలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఈ రాష్ట్రాలను బీజేపీ దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. అంటే ఓటర్లు స్థానికంగా తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని కోరుకుంటూనే.. జాతీయస్థాయిలో మోదీ నాయకత్వానికి జై కొడుతున్నారు. ఎన్నికల తుది ఫలితాలు వెల్లడయ్యేందుకు మరో వారం రోజుల సమయం ఉన్నప్పటికీ.. ఈలోగా పోలింగ్ శాతాన్ని బేరీజు వేసుకుంటూ రాజకీయ విశ్లేషణలు జరుగుతున్నాయి. ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వాన్ని మార్చే ఆనవాయితీని మార్చి మరోసారి అధికారం చేజిక్కించుకోవడం కోసం కాంగ్రెస్ 7 హామీలతో పాటు ప్రజాకర్షక మేనిఫెస్టోను నమ్ముకోగా.. మార్పు ఆనవాయితీ, పెరిగిన ఓటింగ్ శాతం తమకు కలిసొస్తాయని బీజేపీ భావిస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..