
సనాతన ధర్మ ప్రచారకురాలు సాధ్వి ప్రేమ్ బైసా అనుమానాస్పద మృతి రాజస్థాన్‌లో సంచలనం సృష్టిస్తోంది. కేవలం 23 ఏళ్ల వయసులోనే సనాతన ధర్మ గళంగా పేరు తెచ్చుకున్న సాధ్వి ప్రేమ్ బైసాకు నాథ్ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఆమె మరణం చుట్టూ అల్లుకున్న మిస్టరీ మాత్రం ఇంకా వీడలేదు. జనవరి 28న సాధ్వికి గొంతు నొప్పి రావడంతో ఆశ్రమానికి ఒక కాంపౌండర్‌ను పిలిపించారు. అతను ఇంజెక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే సాధ్వి స్పృహ కోల్పోయారు. ఆసుపత్రికి తరలించగా వైద్యులు ఆమె అప్పటికే మరణించినట్లు ధృవీకరించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు పంపమని, అంబులెన్స్ ఇస్తామని మేము చెప్పాము. కానీ ఆమె తండ్రి వీరం నాథ్ నిరాకరించి, మృతదేహాన్ని తన సొంత కారులో తీసుకెళ్లారు అని ప్రేక్ష ఆసుపత్రి డాక్టర్ ప్రవీణ్ జైన్ తెలిపారు.
ఈ కేసులో సాధ్వి తండ్రి ప్రవర్తన పోలీసులకు, ప్రత్యక్ష సాక్షులకు అనేక అనుమానాలను కలిగిస్తోంది. ఆసుపత్రి నుండి వచ్చిన తర్వాత, సాధ్వి మృతదేహాన్ని ఆశ్రమం లోపలికి తీసుకెళ్లకుండా స్కార్పియో కారులోనే ఉంచుకుని రోడ్డుపై కూర్చున్నారు. దాదాపు రాత్రి 10:30 గంటల వరకు ఆయన కారులోనే శవంతో ఉండటం చూసి స్థానికులు విస్తుపోయారు. పోలీసులు సాధ్వి ఫోన్‌ను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించగా, తండ్రి తీవ్రంగా ప్రతిఘటించారు. చివరకు పోలీసులు బలవంతంగా ఫోన్ తీసుకోవాల్సి వచ్చింది. మరణం తర్వాత వచ్చిన పోస్ట్ గురించి తండ్రి మాట్లాడుతూ.. అది ఆమె చివరి కోరిక, అందుకే నేనే ఆమె ఫోన్ నుండి పోస్ట్ చేశాను అని అంగీకరించారు.
గత ఏడాది జూలైలో సాధ్వి తన తండ్రిని కౌగిలించుకున్న ఒక వీడియో వైరల్ అయ్యింది. ఆ వీడియోను తప్పుగా ఎడిట్ చేశారని సాధ్వి వాదించారు. అయితే ఇప్పుడు ఆశ్రమంలోని సీసీటీవీ కెమెరాలు తొలగించినట్లు పోలీసులు గుర్తించారు. ఆ వీడియో లీక్ అయిన తర్వాతే కెమెరాలు తీసేశారా..? లేక ఈ ఘటనకు ముందు సాక్ష్యాలు లేకుండా తొలగించారా? అన్నది తేలాల్సి ఉంది.
ప్రేమ్ బైసా ప్రస్థానం: ట్రక్ డ్రైవర్ కూతురి నుండి సాధ్వి వరకు
ఒక ట్రక్ డ్రైవర్ కూతురిగా పుట్టిన ప్రేమ్ బైసా 4 ఏళ్లకే తల్లిని కోల్పోయారు. 12 ఏళ్ల వయసులోనే గ్రంథాలను అభ్యసించి అద్భుతమైన ప్రసంగాలు ఇవ్వడం ప్రారంభించారు. అనతి కాలంలోనే ఆమెకు విరాళాలు, అనుచరులు పెరిగారు. జోధ్‌పూర్, పరేవు, జాస్తి ప్రాంతాల్లో మూడు ఆశ్రమాలను నిర్మించారు.
ACP చావి శర్మ నాయకత్వంలోని బృందం ఈ కేసును అత్యంత సున్నితంగా విచారిస్తోంది.”పోస్ట్‌మార్టం నివేదిక ప్రస్తుతం రిజర్వ్‌లో ఉంది. కాంపౌండర్‌ను ఇప్పటికే విచారించాము. తండ్రి, ఇతర సాక్షులను కూడా త్వరలో విచారిస్తాము అని పోలీసులు తెలిపారు. సాధ్వి ప్రేమ్ బైసా మరణం ఒక ప్రమాదమా? తప్పుడు ఇంజెక్షన్ వల్ల జరిగిన పొరపాటా? లేక సోషల్ మీడియా వేధింపుల ఒత్తిడిలో తీసుకున్న నిర్ణయమా? అన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.