Toolkit Justice : దిశారవి. ఇప్పుడీపేరు దేశమంతటానేకాదు, ప్రపంచవ్యాప్తంగానూ మార్మోగుతోంది. ఒకవైపు ఆందోళనలు.. మరోవైపు మద్దతులు. ఇలా.. టూల్‌కిట్ కేసులో అరెస్ట్ అయిన దిశారవికి వివిధ వర్గాలనుంచి మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ఢిల్లీ రైతు ఉద్యమానికి సంబంధించి టూల్‌కిట్ వ్యవహారంలో ముగ్గురు యువతుల అరెస్ట్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. రిపబ్లిక్ డే సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనపై విచారణను వేగవంతం చేసిన పోలీసులు.. అరెస్ట్‌ల ప్రక్రియను షూరు చేశారు. తొలుత ఓ యువతిని అరెస్ట్ చేయగా.. అనంతరం మరో ఇద్దరిని అరెస్ట్ చేయడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
స్వీడన్‌కు చెందిన అంతర్జాతీయ పర్యవరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన టూల్‌కిట్‌తో దిశారవి, శాంతాను, నికితా జాకబ్.. ఎడిట్ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దిశారవికి పాక్ మద్దతు తెలపడంపై బీజేపీ ఫైర్ అయ్యింది. టూల్‌కిట్ వ్యవహారం ముమ్మాటికి దేశద్రోహమే అవుతుందని దిశ అరెస్ట్‌ను సమర్థిస్తున్నారు బీజేపీ నేతలు. ఐతే దిశపై దేశ ద్రోహం వంటి తీవ్ర ఆరోపణలు చేయడంపై చెన్నై, బెంగళూరులోని ఆమె స్నేహితులు, విద్యార్థి సంఘాలు భగ్గుమంటున్నాయి. అటు రైతు సంఘాలు కూడా దిశారవి అరెస్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దిశారవి అరెస్టుకు నిరసనగా 18వ తేదీన రైల్ రోకో కు పిలుపునిచ్చాయి.
ఇక అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ బంధువు మీనా హారీస్ కూడా దిశా అరెస్ట్‌ను ఖండించారు. ఇక కర్నాటక బీజేపీ ఎంపీ పీసీ మోహన్ ట్వీట్ వివాదస్పదమైంది. దిశారవి కసబ్‌తో పోల్చుతూ పోస్ట్ పెట్టడం పెద్ద దుమారమే రేపుతోంది. ఇక దిశా అరెస్ట్‌కు నిరసనగా బెంగళూరులో భారీగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దిశ విడుదల కోరుతూ వారంతా రోడ్లెక్కి ఉద్యమించేందుకు కార్యాచారణ సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. వాతావరణ మార్పులపై పనిచేస్తోన్న పలు సంస్థలు కూడా దిశారవికు మద్దతుగా నిలిచాయి.
కాగా, దిశారవి ఓ పర్యావరణ కార్యకర్త. బెంగళూరులో బీబీఏ డిగ్రీ చదువుతున్నారు. 2018లో గ్రేటా థన్‌బర్గ్ పర్యావరణ పరిరక్షణ దిశగా ‘సేవ్ ది ఎన్విరాన్‌మెంట్ క్యాంపెయిన్’తో ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనాన్ని సృష్టిస్తున్న సమయంలోనే దిశా రవి ‘ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ ఇండియా’ ప్రచారం మొదలుపెట్టారు. భారత్‌లో వాతావరణ మార్పుల నియంత్రణకు నిర్వహిస్తున్న చాలా ఉద్యమాలు, కార్యక్రమాల్లో దిశ పాల్గొన్నారు. ఇదే అంశంపై గతంలో ఆమె బెంగళూరులో నిరసనలు చేపట్టారు. వాతావరణ మార్పులతో చుట్టుముట్టే ముప్పులపై మీడియాలో ఆమె వ్యాసాలు కూడా రాస్తుంటారు. రైతుల నిరసనలకు ముందు నుంచీ మద్దతు తెలుపుతోన్న ఆమె..గ్రెటా థెన్‌బర్గ్ షేర్ చేసిన టూల్ కిట్ ను రూపొందించినట్లుగా ఢిల్లీ పోలీసులు ఆరోపిస్తున్నారు.
ఇక ఈ టూల్‌కిట్ వ్యవహారంలో దశరవితో పాటు మరో ఇద్దరిపై నాన్‌బెయిలెబుల్ వారెంట్ జారీ అయ్యింది. ముంబైకి చెందిన లాయర్ నిఖిత జాకబ్, శంతునులపై ఈవారెంట్ జారీ చేసింది ఢిల్లీ కోర్టు. అరెస్ట్ భయంతో బాంబే హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు నిఖిత జాకబ్, శంతను.. దీనిపై ఇవాళ విచారణ జరగుతుంది.
Read also : “Toolkit” ఇప్పుడీ పదం ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతోంది. ఓ మహోద్యమాన్ని పక్కదారి పట్టించింది. అసలేంటిది.?