తమిళనాడులోని కూనూర్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో జనరల్ బిపిన్ రావత్ ప్రాణాలు కోల్పోయారు. దేశ రక్షణ రంగంలో కీలకమైన సీడీఎస్ (చీఫ్ డిఫెన్స్ ఆఫ్ స్టాఫ్) పదవిలో ఉన్న ఆయన ఆకస్మిక మరణంతో తదుపరి సీడీఎస్ ఎవరనే చర్చ మొదలైంది. బిపిన్ రావత్ లాంటి అనుభవజ్ఞుడు, వ్యూహకర్త ఎవరు? ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ త్రివిధ దళాలను సమన్వయం చేయగలిగే సమర్థుడు ఎవరు? తదుపరి త్రిదళాధిపతి ఎవరయ్యే అవకాశం కనిపిస్తోంది? ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ అధిపతుల్లో ఎవరికి ఎక్కువ అవకాశం ఉంది? అన్న విషయాలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. కాగా 2019 వరకు ఆర్మీ అధిపతిగా ఉన్న బిపిన్ రావత్‌ను సీనియారిటీ ప్రకారం త్రివిధ దళాధిపతిగా కేంద్రం ఎంపిక చేసింది. ఇప్పుడు కూడా అదే జరుగుతుందా? సీనియారిటీ లెక్కలతో మళ్లీ ఆర్మీ చీఫ్‌నే సీడీఎస్ పోస్ట్ వరించనుందా? అంటే అవుననే మాటే వినిపిస్తోంది.
రేసులో ఆయనే ముందు..
నేవీ, ఎయిర్‌ఫోర్స్‌కి ఇటీవలే కొత్త అధిపతులు వచ్చారు. నేవీ చీఫ్‌గా అడ్మిరల్ ఆర్. హరికుమార్ 8 రోజుల క్రితమే బాధ్యతలు స్వీకరించారు. ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ అయితే ఈ ఏడాది సెప్టెంబర్ 30 నుంచి ఎయిర్‌ఫోర్స్ అధిపతిగా ఉంటున్నారు. జనరల్ మనోజ్ ముకుంద్ నరవణె మాత్రమే 2019 డిసెంబర్ 31 నుంచి ఆర్మీ అధిపతిగా కొనసాగుతున్నారు. ఇలా చూస్తే బిపిన్ తర్వాత ఆర్మీ చీఫ్ జనరల్ నరవణె మాత్రమే సీనియర్ అధికారి అవుతారు. ఈ క్రమంలో రావత్ స్థానంలో నరవణె పేరే ప్రముఖంగా వినిపిస్తోంది. నరవాణె తర్వాత ఆర్మీ వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ సీపీ మొహంతి, నార్త్రన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషి సైన్యంలో సీనియర్లుగా ఉన్నారు . సైన్యం పోరాట సామర్థ్యాన్ని పెంపొందించడానికి కేంద్రం నియమించిన షేకత్కర్ కమిటీ సిఫార్సులను బట్టి చూసినా… త్రివిధ దళాల చీఫ్‌లలో ఒకరిని ప్రభుత్వం సీడీఎస్‌గా నియమించాల్సి ఉంటుంది. ఇది కూడా జనరల్ నరవాణెకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. అయితే సీనియారిటీ ఒక్కటే CDS ఎంపికకు కొలమానం కాదు. దూకుడుగా వ్యవహరించడం, శత్రు దేశాలకు ధీటుగా వ్యూహాలను రచించడం, సైనికుల పోరాట సామర్థ్యాలను పెంచడం… ఇలాంటివన్నీ పరిగణలోకి తీసుకుంటారు. అటు చైనా, ఇటు పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండడంతో అతి త్వరలోననే కొత్త CDSని నియమించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మరో వారం రోజుల్లోనే కొత్త సీడీఎస్‌ని నియమించవచ్చని తెలుస్తోంది.
Also Read:
Farmers Protest: రైతు సంఘాల కీలక నిర్ణయం.. ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటన..