Normal Trains Update: దేశవ్యాప్తంగా అన్‌లాక్ ప్రక్రియ మొదలైన తర్వాత ప్రయాణాలు బాగా పెరిగిపోయాయి. ప్రస్తుతం ప్రత్యేక రైళ్లు మాత్రమే తిరుగుతుండటంతో.. మళ్లీ రెగ్యులర్ ట్రైన్స్ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఇక ప్రస్తుతం నడుపుతున్న స్పెషల్ ట్రైన్ సర్వీసులను పండగల దృష్ట్యా మార్చి నెలాఖరు దాకా పొడిగించడంతో.. ఏప్రిల్ నెల తర్వాతే రెగ్యులర్ ట్రైన్స్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాగా, కరోనా ముందు రోజుకు 13 వేలకు పైగా రైలు సర్వీసులు నడిచిన సంగతి తెలిసిందే.
ఇది ఇలా ఉంటే కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా మార్చి నెలలో కేంద్రం దేశమంతా లాక్‌డౌన్ ప్రకటించింది. దీనితో రైల్వే శాఖ మార్చి 22 నుంచి దేశవ్యాప్తంగా రైళ్ల రాకపోకలను నిలిపివేసింది. ఆ తర్వాత మే నెల నుంచి ప్రయాణీకుల సౌకర్యార్ధం దశల వారీగా స్పెషల్ ట్రైన్స్‌ను రైల్వే శాఖ పట్టాలెక్కిస్తూ వస్తోంది. శనివారం నుంచి కోవిడ్ టీకా అందుబాటులోకి రావడం.. సాధారణ ప్రజలకు, అన్ని వయసుల వారికి వచ్చేసరికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉండటంతో.. ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుని రెగ్యులర్ సర్వీసులను తిరిగి పున: ప్రారంభించడంపై నిర్ణయం తీసుకుంటామని రైల్వే ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.