Westbengal Elections 2021: ఎన్నికల షెడ్యూల్ విడుదలైన దరిమిలా.. పశ్చిమ బెంగాల్ ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నియమావళిని అమలు చేయడంతో నిర్లక్ష్యం ప్రదర్శించారని ఆరోపిస్తూ రాష్ట్ర అడిషనల్ డీజీ జావేద్ షమీమ్‌ను విధుల నుంచి తొలగించింది. అతని స్థానంలో ఫైర్ సర్వీస్ డీజీ జగ్ మోహన్‌ను కొత్త ఏడీజీగా నియమించింది. ఈ మేరకు శనివారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక జావేద్ షమీమ్‌ను ఫైర్ సర్వీస్ డీజీగా బదిలీ చేసింది. కాగా, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. జావేద్ షమీమ్‌ను ఇటీవలే ఏడీజీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఆయన నియామకం అయిన కొన్ని రోజుల్లోనే ఈసీ బదిలీ చేయడం ఆసక్తికరంగా మారింది. అయితే, ఈసీ ఆదేశాలతో ప్రభుత్వం వీరి బదిలీకి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, బీజేపీ పవర్తన్ యాత్ర రథంపై కొందరు దాడి చేశారు. దాంతో బీజేపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఏడీజీ విఫలమయ్యారని, అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల సంఘం తాజాగా ఆయనను విధులనుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఎన్నికల సంఘంపై తీరుపై మండిపడుతున్న టీఎంసీ..
ఈసీ నిర్ణయంపై అధికార పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్ తీవ్రస్థాయిలో మండిపడుతోంది. ఈసీ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపడుతోంది. బీజేపీ సహా, ప్రత్యర్థి పార్టీ రాష్ట్రంలో అహింసను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని అధికార పార్టీ నేతలు ఆరోపించారు. ఎన్నికల కమిషన్ పూర్తి పక్షపాతంతో వ్యవహరిస్తోందని టీఎంసీ ఎంపీ సౌతారాయ్ ఆరోపించారు. మోదీ, అమిత్ షా ఆదేశాల మేరకు నడుచుకుంటున్నారని విమర్శించారు.
బెంగాల్‌లో ఎనిమిది విడతలుగా ఎన్నికలు..
ఇక పశ్చిమ బెంగాల్‌లో సుదీర్ఘంగా ఎనిమిది విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం తలపెట్టింది. మార్చి 27వ తేదీన తొలివిడత జరగనుండగా.. ఆఖరుగా ఎనిమిదో విడత ఏప్రిల్ 29వ తేదీన జరగబోతోంది. ఏప్రిల్ 1, 6, 10, 17, 22, 26 తేదీలలో రెండు, మూడు, నాలుగు, అయిదు, ఆరు, ఏడో విడత పోలింగ్ జరుగుతుంది.
Also read: