ఎదుటి వారికి ఏదైనా విషయాన్ని సూటిగా.. సుత్తిలేకుండా చెప్పాలంటే సామెతలు ఎంతో ఉపయోగపడుతాయి. అయితే అలాంటి సామెతలు వాడేటప్పుడు కాస్త జాగ్రత్త అవసరం. వెనుకా ముందు ఆలోచించకుండా సామెతలను వాడేస్తే ఆ తర్వాత అనవసర కష్టాలు కొని తెచ్చుకోవాల్సిందే. మరీ ముఖ్యంగా రాజకీయ నేతలు తమ మాటల్లో సామెతలు వాడాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సి ఉంటుంది. పదేళ్ల క్రితం ఓ బుక్ ఫెయిర్‌లో పాల్గొన్న పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (West Bengal CM Mamata Banerjee).. పుస్తకం, భార్యను ఇతరులకు అప్పుగా ఇవ్వకూడదని.. ఇస్తే కనుక అది తిరిగి రాదంటూ ఆంగ్ల సామెతను ప్రస్తావించారు. జోక్‌గా ఆమె చేసిన ఈ కామెంట్స్‌పై తీవ్ర రాజకీయ విమర్శలు వచ్చాయి. పదేళ్లు గడిచాక.. ఇప్పుడు మరోసారి మమతా బెనర్జీ చేసిన అదే రకమైన కామెంట్స్ మళ్లీ వివాదాన్ని రేపాయి.
పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో.. మీ జ్ఞానం, మేధస్సు, హౌస్ వైఫ్‌ని ఇతరులకు ఇవ్వకండి.. ఇస్తే తిరిగి మీ చేతికి రాదంటూ ఆమె కామెంట్ చేశారు. కాస్త జోక్‌గా ఆమె ఈ మాట అన్నా.. ఈ వ్యాఖ్యలపై పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. హౌస్ వైఫ్ గురించి మమతా బెనర్జీ వాడిన భాష సరిగ్గా లేదంటూ రాజకీయ ప్రత్యర్థులు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. విద్యా స్కాలర్‌షిప్‌లకు ఇవ్వాల్సిన నిధులను కేంద్రం సరిగ్గా ఇవ్వడం లేదని మమతా బెనర్జీ ఆరోపించారు. కేంద్రం నిధులు ఇవ్వకున్నా.. మేధస్సు చాలా ముఖ్యమైనందున ఈ ఆర్థిక భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తున్నట్లు ఆమె చెప్పుకొచ్చారు. ఇదే సమయంలోనే విద్య, మేధస్సు, హౌస్ వైఫ్‌ను ఇతరులకు ఇవ్వకండి అంటూ.. ముందూ వెనుక ఆలోచించకుండా కామెంట్స్ చేసి వివాదంలో చిక్కుకున్నారు దీదీ.
మహిళలను కించపరిచేలా మమతా బెనర్జీ కామెంట్స్ ఉన్నాయంటూ రాజకీయ ప్రత్యర్థులు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. ఈ అభ్యంతరకరమైన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని మహిళలకు మమతా బెనర్జీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే అధికార తృణముల్ కాంగ్రెస్(TMC) నేతలు మాత్రం మమతా బెనర్జీ వ్యాఖ్యలను తప్పుబట్టాల్సిన అవసరం లేదంటున్నారు. సామెతల విషయంలో ఇలా తప్పుబడితే.. ఏ సామెతనూ మనం వాడలేమని చెబుతున్నారు. సామెతలను సామెతలుగానే చూడాలని.. దీనిలో ద్వంద్వ అర్థాలు తీయడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. మహిళలపై మమతకు ఎంతో గౌరవం ఉందని.. ఆమె వ్యాఖ్యలపై వివాదం చేయడం సరికాదంటున్నారు. గతంలో రాజకీయాల్లో ఇలాంటి అనవసర అంశాలపై వివాదాలు ఉండేవి కావని.. ఇప్పుడు దీదీ ఏది మాట్లాడినా ప్రతిపక్షాలు దాన్ని వివాదం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.
అయితే మమతా బెనర్జీ ఇలా తరచూ నోరు జారుతుంటారని.. ఇకనైనా కాస్త జాగ్రత్తగా ఉండాలని రాజకీయ పండితులు ఆమెకు సూచిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తలు చదవండి