వేడిగాలులతో సతమతమవుతున్న రాజధాని ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. బుధవారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారి భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా ఉత్తరాదిలో మళ్లీ వరుణుడు ఉగ్రరూపం దాల్చాడు. ఉత్తరాఖండ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌తోపాటు పలు ప్రాంతాల్లో కుంభవృష్టి వర్షం కురుస్తోంది. ఢిల్లీలో భారీ వర్షాలకు జనజీవితం అస్తవ్యస్థంగా మారింది. కొద్దిరోజుల క్రితం ముగ్గురు సివిల్స్ అభ్యర్ధులు ప్రాణాలు కోల్పోయిన రాజేంద్రనగర్‌లో మళ్లీ భారీ వర్షం కురిసింది. పోలీసుల బారికేడ్లు నీట మునిగాయి. రాజేంద్రనగర్‌లోని సెల్లార్లలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. హస్తినలోని పలు రోడ్లు నదులను తలపిస్తున్నాయి.
భారీవర్షాలతో విమానాల రాకపోకలకు కూడా అంతరాయం కలుగుతోంది . ప్రతికూల వాతావరణం కారణంగా 10 విమానాలను దారిమళ్లించారు. భారీవర్షం లోనే విద్యార్ధులు తమ ఆందోళనలను కొనసాగించే ప్రయత్నం చేశారు. ఢిల్లీలో రానున్న 24 గంటల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అలర్ట్ జారీ చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాల కారణంగా ఢిల్లీలో చాలా చోట్ల ట్రాఫిక్ స్తంభించింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అటు ఢిల్లీతోపాటు NCR పరిధిలో భారీవర్షాలు కురుస్తున్నాయి. నోయిడా, ఘజియాబాద్ , గుర్‌గావ్ , ఫరీదాబాద్‌లో కుండపోత కురిసింది. సాయంత్రం కార్యాలయం నుంచి బయటకు వచ్చిన ఉద్యోగులు వర్షం కారణంగా రోడ్లపైనే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. కేవలం రెండు గంటలపాటు కురిసిన వర్షానికి ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి అయింది.
#WATCH | Delhi: Students' protest continues amid severe waterlogging in Old Rajinder Nagar over the death of 3 students due to rainwater logging in the basement of a coaching institute on 27 July. pic.twitter.com/GRscisjlCV
— ANI (@ANI) July 31, 2024
ఉత్తరాఖండ్‌లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. డెహ్రాడూన్‌లో భారీ వర్షాల కారణంగా నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. గంగానది ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తోంది.
ఉత్తరప్రదేశ్‌లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. యూపీ రాజధాని లక్నోలో కుంభవృష్టి కురిసింది. రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అంతేకాదు యూపీ అసెంబ్లీ లోకి వరదనీరు ప్రవేశించింది. సభ జరుగుతున్న సమయంలోనే వరదనీరు అసెంబ్లీలోకి ప్రవేశించింది. =అసెంబ్లీ సిబ్బంది వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. బకెట్లతో నీటిని తోడిపోశారు. వాహనాలన్నీ నీటిలో చిక్కుకున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి కూడా వరదనీరు చేరింది. సబ్‌వేల్లోకి కూడా వరదనీరు ప్రవేశించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆకస్మిక వరదల్లో పలు వాహనాలు చిక్కుకుపోయాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..