India – POK: ఏదో ఒక రోజు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుంది.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు

ఇదంతా ఒకెత్తయితే.. ఇక పాక్ ఆక్రమణలో ఉన్న ఆ భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడమే మిగిలి ఉంది. ఆర్టికల్ 370 రద్దు చేసే వరకు మూడో కంటికి తెలీకుండా మంత్రాంగం నడిపిన భారత ప్రభుత్వం.. పీఓకే ను తిరిగి స్వాధీనం చేసుకునే విషయంలోనూ అలాగే వ్యవహరిస్తుందన్న ఊహాగానాలు ఇప్పుడు పెరిగిపోయాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగాలు..

India - POK: ఏదో ఒక రోజు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుంది.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు
India - POK

Edited By: Shaik Madar Saheb

Updated on: Dec 17, 2023 | 5:16 PM

కశ్మీర్.. హిమాలయాల పర్వత సానువుల్లో కొలువైన భూతల స్వర్గం. ప్రకృతి సౌందర్యానికి, అనేక సహజ వనరులకు నిలయం. మంచు దుప్పటి కప్పుకుని ఎంతో అందంగా కనిపించే కాశ్మీర్.. సహజ సౌందర్యంలో యూరప్‌లోని స్విట్జర్లాండ్ కంటే ఏమాత్రం తీసిపోదు. అందుకే దీనిపై పాకిస్తాన్ కన్ను పడింది. గత పాలకుల తప్పిదమో, ఏమరుపాటో.. కారణమేదైనా కాశ్మీర్‌లో సగ భాగం పాకిస్తాన్ పరమైంది. పాక్ ఆక్రమణలో ఉన్న ఆ భాగాన్ని ‘పాక్ ఆక్రమిత కాశ్మీర్’ (POK)గా వ్యవహరిస్తున్నాం. ఆక్రమించుకోవడమే కాదు.. దశాబ్దాలుగా ఆ ప్రాంతాన్ని ఉగ్రవాదుల తయారీ కర్మాగారంగా మార్చి భారత్‌లో విధ్వంసాలకు కుట్ర చేస్తోంది. ఆ కుట్రలను భారత భద్రతా బలగాలు ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉన్నాయి. ఈ దశాబ్దకాలంలో ఆ గడ్డపై కాలుమోపి మరీ ఉగ్రవాదుల భరతం పట్టిన సందర్భాలున్నాయి. జమ్ము-కాశ్మీర్‌ను పూర్తిగా భారత్‌లో అంతర్భాగంగా చెప్పుకుంటూ.. మ్యాప్‌లో పూర్తి కాశ్మీర్‌ను భారత్‌లోనే ఉన్నట్టు చూపిస్తున్నప్పటికీ.. పూర్తి కాశ్మీర్ భారత్ చేతిలో లేదన్న వెలితి మాత్రం భారత పాలకుల్లోనే కాదు, సమాజంలోనూ ఉంది. తాజాగా ఆర్టికల్ 370ను రద్దు చేయడం ద్వారా స్వయం ప్రతిపత్తి హోదా కల్గిన ఆ రాష్ట్రాన్ని పూర్తిగా భారత్‌లో అంతర్భాగంగా చేసిన భారత ప్రభుత్వం, ఆ తర్వాత చేసిన కొత్త చట్టాల ద్వారా పాక్ ఆక్రమిక కాశ్మీర్‌లో 24 అసెంబ్లీ స్థానాలను రిజర్వ్ చేసింది. తద్వారా పాకిస్తాన్‌కు మాత్రమే కాదు, అంతర్జాతీయ సమాజానికి కూడా ఒక బలమైన సందేశాన్ని పంపింది. పాక్ దురాక్రమణలో ఉన్న ఆ భూభాగం తమదేనని బలంగా చాటి చెప్పింది.

ఇదంతా ఒకెత్తయితే.. ఇక పాక్ ఆక్రమణలో ఉన్న ఆ భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడమే మిగిలి ఉంది. ఆర్టికల్ 370 రద్దు చేసే వరకు మూడో కంటికి తెలీకుండా మంత్రాంగం నడిపిన భారత ప్రభుత్వం.. పీఓకే ను తిరిగి స్వాధీనం చేసుకునే విషయంలోనూ అలాగే వ్యవహరిస్తుందన్న ఊహాగానాలు ఇప్పుడు పెరిగిపోయాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగాలు, ఆ శాఖ సహాయ మంత్రి నిషిత్ ప్రమాణిక్ ‘TV9 బంగ్లా’ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూను డీకోడ్ చేస్తే.. దేశ ప్రజలందరినీ సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తే రోజు దగ్గర్లోనే ఉందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ‘పాక్ ఆక్రమిత కశ్మీర్‌’లో ఏదో ఒక రోజు త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుంది అంటూ కేంద్ర మంత్రి నిషిత్ ప్రమాణిక్ వ్యాఖ్యానించారు. ఒక రోజు నిద్రలేచి చూసే సరికి పీఓకే గడ్డపై ఎగురుతున్న మువ్వన్నెల జెండాను చూస్తారు అంటూ ఆయనన్నారు.

“ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా వంటి కఠిన నిర్ణయాలు తీసుకునే నాయకత్వం ఉంటే ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు, ఆర్టికల్ 370ని రద్దు చేయడం, శ్రీనగర్ లాల్‌చౌక్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం సాధ్యపడినప్పుడు.. మీరు ఒక రోజు ఉదయం నిద్రలేచి, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో రెపరెపలాడుతున్న భారత జెండాను చూసినా ఆశ్చర్యపోవాల్సింది లేదు. దేశాన్ని ఇద్దరు బలమైన వ్యక్తులు నడిపిస్తున్నారు. దేశ గౌరవం, ప్రయోజనాల కోసం అవసరమైన పని వారు చేయగలరు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను భారతీయ జనతా పార్టీ (బీజేపీ) భారత్‌లో అంతర్భాగంగా పరిగణిస్తోంది” అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిషిత్ ప్రమాణిక్ చేసిన వ్యాఖ్యలు సరికొత్త చర్చకు దారితీశాయి. జమ్ము-కాశ్మీర్ అసెంబ్లీలో ‘పాక్ ఆక్రమిత కాశ్మీర్’ భూభాగంలో 24 నియోజకవర్గాలను రిజర్వు చేసిన భారత ప్రభుత్వం, అక్కడ అభ్యర్థులను నామినేషన్ పద్ధతిలో నియమిస్తోంది అని ప్రమాణిక్ అన్నారు. లోక్‌సభ ఎన్నికల లోపే పీఓకే భారత్ హస్తగతమవుతుందా అన్న ప్రశ్నకు తాను కచ్చితంగా చెప్పలేనని, కానీ ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ఇద్దరూ చెప్పిన మాటను నిజం చేసే నాయకులని తెలిపారు.

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి స్వయంప్రతిపత్తిని అందించిన ఆర్టికల్ 370ని తొలగించడం మోడీ ప్రభుత్వం తీసుకున్న బలమైన నిర్ణయాలలో ఒకటిగా రాజకీయ పండితులు చెబుతున్నారు. దేశ సర్వోన్నత న్యాయస్థానం సైతం ఈ ఆర్టికల్ విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టలేదు. ఆర్టికల్ 370 అనేది శాశ్వతమైన అధికరణ కాదని, కాశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేసే ప్రక్రియలో దశలవారీగా జరిగేందుకు తాత్కాలికంగా చేసిన ఏర్పాటు మాత్రమేనని అభిప్రాయపడింది. కేంద్ర ప్రభుత్వం సైతం ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్‌లో పర్యాటకం, పెట్టుబడులు పెరిగాయని, అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని చెబుతోంది. ఈ మధ్య పాకిస్తాన్‌లో ఆహార సంక్షోభం ఏర్పడినప్పుడు పీఓకేలో పండిన పంటనంతా ఆ దేశ ప్రభుత్వం తరలించుకుపోయిందని ఆ ప్రాంత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ కంటే భారత భూభాగంలో ఉన్న కాశ్మీర్ ప్రజల జీవన ప్రమాణాలే చాలా మెరుగ్గా ఉన్నాయని కూడా అక్కడి ప్రజలు భావిస్తున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరనసలు, ఆందోళనలు సైతం జరిగాయి. వాటిని పాక్ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేయడం కూడా కాశ్మీరీ ప్రజల్లో వ్యతిరేకతకు కారణమైంది. ఈ పరిస్థితుల్లో అక్కడి ప్రజల్లో కొందరు భారత్‌లో కలవడానికి మొగ్గుచూపుతున్నట్టు కథనాలు వస్తున్నాయి. వీటి సంగతెలా ఉన్నా.. భారతదేశం అంతర్జాతీయ సమాజంలో ఒక బలమైన శక్తిగా ఎదిగింది. ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగానే కాదు, బలమైన సైనిక శక్తి కల్గిన దేశాల్లో ఒకటిగా నిలిచింది. దౌత్య సంబంధాల్లో సైతం ఏ ఒక్కరికి ఒత్తిడికి తలొగ్గకుండా తనకంటూ సొంత నిర్ణయాలు తీసుకుంటూ, సొంత వైఖరిని చాటుతోంది. ఇదే సమయంలో పాక్ అంతర్గతంగా తీవ్రమైన సమస్యలతో సతమతమవుతోంది. ఆహార, ఆర్థిక సంక్షోభాలు ఆ దేశాన్ని చుట్టుముట్టాయి. సైనిక పాలనలో, సైనిక బలగాల ఆధిపత్యంలో ఉంటే ఆ దేశంలో రాజకీయంగా ఎప్పుడూ సుస్థిరత లేదు. ఈ పరిస్థితుల్లో దశాబ్దాలుగా రగులుతున్న కాశ్మీర్ సమస్యకు ఒక ముగింపు తీసుకురావడానికి ఇదే సరైన తరుణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..